gents
-
భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ
న్యూఢిల్లీ: భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. దేశంలో జనవరి 1, 2005 నుంచి డిసెంబర్ 31, 2019 మధ్య మూడు కేన్సర్ ఆస్పత్రులతో పాటు ఢిల్లీలోని పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్), మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రరీల నుంచి రికార్డుల్ని సేకరించి ఈ నివేదిక రూపొందించారు. పీబీసీఆర్‌లో 11 వేలు, ఇతర ఆస్పత్రిల్లోని 22 వేల క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్ సమీర్ బక్షీ చెప్పారు. -
తాగుబోతు స్టాంప్: పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే!
మద్యపానం విషయంలో ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. స్తీలు అధికంగా మద్యపానం చేస్తే పిల్లలు పుట్టరంటూ పోలాండ్ పాలక పక్ష నాయకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. స్త్రీలు డ్రింక్ చేయడం వల్లే జననాల రేటు తక్కువగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడాయన. పోలాండ్ జనాభా తక్కువగా ఉండటానికి కారణం స్త్రీలు అధికంగా మద్యపానం సేవించడమే ప్రధాన కారణమని అన్నారు. 25 ఏళ్లు వయసు ఉన్న స్త్రీలు.. అదే వయసు ఉన్న పురుషుల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు పిల్లలు ఉండరన్నారు. పురుషులు తాగుబోతులు అని ముద్ర వేయించుకోవడానికి 20 ఏళ్లు పడితే స్త్రీలకు కేవలం రెండేళ్లు చాలంటూ కామెంట్లు చేశాడు. అంతేగాదు మద్యానికి బానిసైన మగవాళ్లకు చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు కానీ స్త్రీలను నయంచ చేయలేమని ఇది ఒక వైద్యుడు అనుభవం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఇది పితృస్వామ్య రాజ్యమని ప్రూవ్ చేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవానికి పోలాండ్లోని మహిళలు ఆర్థిక స్థిరత్వం, అబార్షన్ రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా పిలలు కనడం పట్ల అంత ఆసక్తి కనబర్చడం లేదనేది ప్రధాన కారణమని నిపుణుల చెబుతున్నారు. (చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా!) -
కరోనా బాధితుల్లో మగవారే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: కరోనాకు ప్రభావితం అవుతున్న వారిలో అధికంగా పురుషులే ఉంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్డేట్స్ను అందించే ‘వరల్డో మీటర్’అనే వెబ్సైట్ ఇటీవల నివేదికలో వెల్లడించింది. కరోనాతో మహిళలకు రిస్క్ తక్కువగా ఉన్నట్లు తెలిపింది. పొగతాగే అలవాటుండటం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అంచనాల ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. వారిలో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్ వంటివి ఉన్నాయని తేలింది. అలాగే ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువ మంది కరోనాకు గురయ్యేది పురుషులేనని నివేదిక వెల్లడించింది. అంటే 71 శాతం మంది ఈ వైరస్‌కు మగవారు ప్రభావితం అవుతున్నారని తెలిపింది. అయితే కరోనా వైరస్ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా వృద్ధులు, ఉబ్బసం, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్న వారికి అధికంగా సోకుతుందని నివేదిక తెలిపింది. కాలానుగుణంగా ఫ్లూ, వైరస్ల వల్ల ప్రతీ ఏడాది ప్రపంచంలో 6.50 లక్షల మంది వరకు చనిపోతున్నారని తెలిపింది. 70 ఏళ్లకు పైబడిన వారిలోనే మరణాలు అధికం... కరోనా వైరస్‌కు చనిపోతున్నవారిలో అధికంగా 70 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని నివేదిక తెలిపింది. చైనాతోపాటు ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి లెక్కలను విశ్లేషిస్తే, 70 ఏళ్లకు పైబడినవారు 29.9 శాతం ఉన్నారు. పిల్లల్లో చాలా తక్కువ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. లింగ నిష్పత్తిని లెక్క వేస్తే చైనాలో ధూమపానం మగవారిలో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ధూమపానం శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కరోనా మరణాల రేటు పురుషుల్లో అధికంగా ఉందని నివేదిక తెలిపింది. కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే... పురుషుల్లో మరణ రేటు 4.7 శాతం, మహిళల్లో 2.8 శాతంగా మరణ రేటు ఉందని తెలిపింది. గుండె వ్యాధులున్న వారిపైనే ప్రభావం కరోనా బారినపడేవారు అధికంగా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారే ఉన్నారని నివేదిక తెలిపింది. గుండె వ్యాధులున్నవారు అధికంగా చనిపోయారు. ఇతరుల వివరాలపై స్పష్టత లేదు. పొగతాగే వారిపై తీవ్ర ప్రభావం పొగతాగే వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్. పొగతాగే వారికి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ ప్రధానంగా పొగతాగే అలవాటున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి పొగతాగడాన్ని నిలిపివేయాలి. – నాగ శిరీష, యాంటీ టొబాకో యాక్టివిస్ట్, హైదరాబాద్ -
ఆ ఆపరేషన్లు వద్దంటున్న మగరాయుళ్లు!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మగవాళ్లు సిగ్గుపడుతున్నారు. కేవలం ఏటా పదుల సంఖ్యలో మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదేళ్ల గణాంకాలు గమనిస్తే.. ఈ విషయం స్పష్టవుతోంది. కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేయించుకుంటే సంసార జీవితానికి ఇబ్బందులు కలుగుతాయనే అపోహలు బలంగా నాటుకున్నట్లు కనిపిస్తోంది. కుటుంబంలో భార్యాభర్తకు సమానభాగం ఉంటుందనే భావిస్తున్న ప్రస్తుత సమాజంలో కుటుంబ నియంత్రణ బాధ్యతను పూర్తిగా ఆడవారిపైనే పెట్టి మగవారు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారికి ట్యూబెక్టమీ, డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) ద్వారా చేస్తారు. మగవారికి మాత్రం వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ఆడవారికి మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుండగా, మగవారు మాత్రం వేసెక్టమీకి ముఖం చాటేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే వ్యవసాయ పనులు చేయడానికి, బరువులు మోయడానికి ఇబ్బందులు కలుగుతాయని, సంసార సుఖానికి ఆటంకం కలుగుతుందన్న అపోహలు బలంగా నాటుకున్నాయి. గ్రామీణ ప్రాంత మగవారిలో ఈ అపోహలు బాగా ఉన్నాయి. వేసెక్టమీ చేయించుకున్న మగవారిలో పట్టణ ప్రాంతం వారే అగ్రభాగం కావడం గమనార్హం. నిరక్షరాస్యులతోపాటు అక్షరాస్యులు కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. 2013–14 సంవత్సరంలో 22 వేల 50 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జిల్లాలో జరిగితే అం దులో కేవలం 53 మంది మా త్రమే వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకున్నారు. 2014– 15 సంవత్సరంలో 24 వేల 5 ఆపరేషన్లు జరిగితే అందులో 29 మంది మగవారు మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. 2015–16 సంవత్సరంలో 21వేల2 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగితే 30 మంది వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకున్నారు. 2016–17 సంవత్సరంలో 6226 ఆపరేషన్లు జరిగితే 3 మంది మాత్రమే వేసెక్టమీ చేయించుకున్నారు. 2017–18 సంవత్సరంలో ఇప్పటి వరకు 6557 ఆపరేషన్లకు గాను అందులో ఒక్క మగవాడు కూడా వేసెక్టమీ ఆపరేషన్‌ను చేయించుకోవడానికి ముందుకురాకపోవడం విశేషం. అన్ని తెలిసి కూడా ఏదో అవుతుందని భావన బలంగా ఉంటోంది. ఇప్పటికైనా మగవాళ్లు మూఢనమ్మకాలను, అపోహలను విడనాడి వ్యాసెక్టమీ ఆపరేషన్లను చేయించుకోవడానికి ముందుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిస్తోంది. సంవత్సరం ఆపరేషన్లు వేసెక్టమీ 2013-14 22050 53 2014-15 24005 29 2015-16 21002 30 2016-17 6226 3 2017-18 6557 0 ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మగవారు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పది, ఇరవై రోజుల తరువాత రోజువారీ పనులను యధావిధిగా చేసుకోవచ్చు. కష్టం, వ్యవసాయ పనులు చేయాలంటే ఇబ్బంది ఉంటుందనే అపోహలను నమ్మవద్దు. సంసార జీవితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. మూఢనమ్మకాలతో వేసెక్టమీ చేయించుకోవడానికి మగవారు ముందుకురాకపోవడం బాధాకరం. ఎలాంటి అపోహలను నమ్మకుండా ముందుకురావాలి. – డాక్టర్ కె.బానుప్రసాద్నాయక్, డీఎంహెచ్ఓ -
శభాష్ తల్లీ
సృష్టికి జన్మ ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ... పురిటినొప్పులు పడుతూ... పడుతూ... పడుతూ... లేస్తూ... లేస్తూ.. లేస్తూ... పునర్జన్మలు పొందుతూ... పొందుతూ... పొందుతూ... తల్లి భారతి సమాజానికి పునరుజ్జీవనం ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ.. రాబోయే కొత్త సంవత్సరానికి మనకు స్ఫూర్తిని పంచుతూ... పంచుతూ... పంచుతూ... అసలు మహిళ విజయం సాధించనిదెప్పుడు? కుటుంబంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎవరి విజయమైనా అది మహిళదే! తన శక్తియుక్తులను ఇంటికి, కుటుంబానికి ధారపోస్తేనే కదా.. ఏలికలు సవ్యంగా పాలించేది! సమాజాన్నయినా.. దేశాన్నయినా.. చివరకు ఈ లోకాన్నయినా! ప్రతి పురుషుడి గెలుపు వెనక స్త్రీ త్యాగం ఉందని లోకోక్తి కూడా కదా! ఇలా ఇంటిని చూస్తూ బయట పనులూ చక్కబెట్టే మహిళ శక్తికి మాటలు గట్టే ప్రయత్నం చేస్తే విశ్వమంత పేజీ అయినా సరిపోదు. ఆమె ఆత్మనిబ్బరం, ఆత్మవిశ్వాసం, సాహసాన్ని ఏ భాషా నిర్వచించలేదు. ఒక్క ఉదాహరణ.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన లక్ష్మీ అగర్వాల్. టీవీ చానళ్లలో రియాలిటీ షోస్‌లో పాడుతూ.. సింగర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని పధ్నాలుగేళ్ల వయసు నుంచీ కలలు కన్నది. వాటిని నెరవేర్చుకోవడానికి సాధన చేసింది. 32 ఏళ్ల ఓ వ్యక్తి లక్ష్మి మీద మనసు పడ్డాడు. మగాడు మనసు పడ్డ అమ్మాయి అతని ఆస్తి అనే భావం ఈ దేశంలో జాస్తి కదా! అందుకే అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆర్డర్ వేశాడు. నువ్వు నాకే అని. కాదు.. నేను నాకే అంది లక్ష్మి. అహం దెబ్బతిన్న పురుషుడు ఆమె మొహం మీద యాసిడ్ పోశాడు. దాదాపుగా మరణం అంచుకు వెళ్లి మళ్లీ జీవం నింపుకుంది. కొన్ని యేళ్లు పట్టింది. అయినా ఆశను చావనివ్వలేదు. నెమ్మదిగా నిలదొక్కుకుంది. తనకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకు జరగొద్దని ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. యాసిడ్ అటాక్ తర్వాత గొంతు దగ్గర చర్మం బిగుసుకుపోయి పాటకు సహకరించకపోయేసరికి టెలివిజన్ హోస్ట్‌గా మారింది. 2014లో అప్పటి అమెరికా మొదటి పౌరురాలు మిషెల్లీ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ విమెన్ కరేజ్ అవార్డును అందుకుంది. అంతేకాదు, ఎన్డీవీ వాళ్ల ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్నీ పొందింది. అనురిమా సిన్హాది ఇంకో రకమైన గెలుపు. జాతీయస్థాయి వాలీబాల్, ఫుట్‌బాల్ ప్లేయర్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరాలన్నది ఆమె స్వప్నం, ఆశయం కూడా. ఆ పరీక్ష రాయడానికే రైలెక్కింది. అందులో ఉన్న కొంతమంది దుండగులు అనురిమ మెడలో బంగారు గొలుసును దొంగిలిద్దామని ఆమె ఒంటి మీద చేయి వేశారు. నిలువరించింది అనురిమ. అంతే! అందరూ కలిసి ఆమె మీద పడ్డారు గొలుసు లాక్కొని కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది అనురిమా. కాని కలను కాదు. కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కింది. పెట్టుడుకాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఎన్నో అవార్డులు తీసుకుంది. కిలిమంజారో ఎక్కడం గురించీ ఇప్పుడు ఆలోచిస్తోంది. ఫరిదాబాద్‌కు చెందిన కిరణ్ కనోజీది కూడా ఇలాంటి అనుభవమే. ఆమె హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైల్లో ఫరిదాబాద్‌కు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ను దొంగిలించబోతూ రైల్లోంచి ఆమెను కిందకు తోశారు. ఆ దుర్ఘటనలో ఆమె ఒక కాలు కోల్పోయింది. అయినా స్థయిర్యం కోల్పోలేదు. బ్లేడ్ రన్నర్‌గా గెలుపును వరించింది. జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆరోగ్య సిరి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభాషిణీ మిస్త్రీ... ఊరందరి క్షేమం కోసం తపించిన తల్లి. ఆమె భర్త కూరగాయలు అమ్మేవాడు. ఒకసారి జబ్బు చేసి ఊళ్లో హాస్పిటల్ లేక.. వైద్యసహాయం అందక చనిపోయాడు. అప్పటికే వాళ్లకు నలుగురు పిల్లలు. సుభాషిణి ఏమీ చదువుకున్నది కాదు. అయినా కుటుంబ బండిని లాగే భారం ఆమె తీసుకోక తప్పలేదు. భర్త పనినే అందుకుంది. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించ సాగింది. అయితే మనసులో ఒకే కోరిక. తన భర్తలాగే ఆ ఊళ్లో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు. అందుకే వచ్చిన డబ్బుల్లో కొంతలో కొంత దాచేది. ఓవైపు కూరగాయలు అమ్ముతూనే ఇంకోవైపు ఇళ్లలో పనిచేసింది. కూలికి వెళ్లింది. అలా 20 ఏళ్లు కూడబెట్టిన డబ్బులతో ఒక ఎకరం భూమి కొన్నది. అంతకుముందు ఆమె ప్రయత్నాన్ని చూసి నవ్విన వాళ్లంతా ఆశ్చర్యంతో నొసలు ముడివేశారు. కొడుకులూ అందివచ్చారు. ఆ నేలలో ఒక గదితో క్లినిక్ కట్టాలనే తమ తల్లి నిశ్చయానికి ఊతమిచ్చారు. తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి కొంత చందా తెచ్చారు. అంతా కలిపి ఎట్టకేలకు ఒక గది ఉన్న క్లినిక్‌ను కట్టారు. వీళ్ల సంకల్పానికి ముచ్చటపడ్డ డాక్టర్లు వంతులవారీగా వచ్చి వైద్యసేవలందించడం మొదలుపెట్టారు. కేవలం పది రూపాయల ఫీజుతో. ఆ ఫీజునూ ఈ క్లినిక్‌ను ఇంకా విస్తరించడానికే ఖర్చు చేస్తున్నారు. ఇది సుభాషిణి విజయం! సమానహక్కు.. ముంబైకి చెందిన సఫీనా హుసేన్.. సమాన హక్కులు సాధించడానికి చదువొక్కటే సాధనం అని నమ్మే వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పట్టాపొందిన సఫీనా 2007లో బాలికల చదువుకోసం ఒక ఎన్జీవో ప్రారంభించింది. బేటీ బఢావో కార్యక్రమాన్ని మోదీ కంటే ముందునుంచే ప్రచారం చేయడమే కాదు.. పనీ చేస్తోంది. జీవితమంతా దానికే అంకితం అంటోంది. వ్యాపార దక్షత.. విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అంటూ ఈ యేడు మహిళా వ్యాపార దక్షతను ప్రోత్సహించడానికి ప్రపంచమంతా నడుం కట్టింది. సాక్షాత్తు అమెరికా ఆడపడచు ఇవాంకా ట్రంప్ దానికి సారథ్యం వహించింది. వేదిక మన దేశమైంది. నిజమే! మహిళకు ముందు స్థానమిస్తే అందరి సంక్షేమాన్నీ ఆమె కాంక్షిస్తుంది. ఆమెకు జెండర్ డిస్క్రిమినేషన్ తెలియదు. ఆలస్యమైనా ఆ ఆలోచన చేసిన జగత్తుకు జేజేలు. అలాంటి దక్షత ఉన్న ఒక సామాన్య స్త్రీ పరిచయం ఇది. ఆమె పేరు కమల్ కుంభార్. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ఆమె ఊరు. తనలాగా పేదరికంలో ఉన్న మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం తన వెరైటీ కోళ్లతో ఒక చిన్న పౌల్ట్రీ ఫామ్‌ను స్థాపించింది ముందు. అది ఇప్పుడు మహారాష్ట్ర అంతటా విస్తరించి ఎంతోమంది ఒంటరి, పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తన పౌల్ట్రీ బిజినెస్ మీద వచ్చిన లాభాలతో ఆమే ఇంకో ఆరు వ్యాపారాలు మొదలుపెట్టి వాటిని లాభాల బాటలో నడిపిస్తోంది. దాదాపు 5వేల మంది మహిళలకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టించి ఎంట్రప్రెన్యూర్కి రోల్ మోడల్‌గా నిలిచింది. కనికాటేక్రివాల్ కూడా ఎంట్రప్రెన్యూరే. అయితే ఆమె ప్రయాణం మరోలా సాగింది. ఆమె పుట్టిపెరిగిందంతా భోపాల్‌లోనే. పదిహేడేళ్లకే ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పార్ట్‌టైమ్ జాబ్‌తో. ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలున్నాయని, అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్‌గా పరిణామం చెందబోతోందని ఆ వయసులోనే గ్రహించింది కనిక. అంతేకాదు, ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్స్కి మంచి డిమాండ్ ఉందని కూడా తెలుసుకోగలిగింది. ఆ దిశగా అడుగులు వేద్దామనుకునేలోపే అంటే తన 21వయేట క్యాన్సర్ బారిన పడింది. ఒకవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంకోవైపు ఏవియేషన్ ఇండస్ట్రీలో తన పెట్టుబడి ఆలోచనలకు పిల్లర్స్ వేసుకోనారంభించింది. ట్రీట్మెంట్ సమయంలో ఆ ఇండస్ట్రీ గురించి అధ్యయనం చేసింది. క్యాన్సర్‌ను జయించింది. ఏవియేషన్ ఇండస్ట్రీలోనూ తన కంపెనీని టేకాఫ్ చేసింది. 2013లో ‘జెట్‌సెట్‌గో’ తో. చార్టెడ్ జెట్స్కి ఫస్ట్మార్కెట్ ప్లేస్ అదే. ఇప్పుడు ఆమెకు 28 ఏళ్లు. పదహారు ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో కాంట్రాక్ట్ సైన్ చేసి రోజుకు నాలుగు నుంచి 20 విమానాలను రన్‌వే మీద పరిగెత్తిస్తోంది కనిక టేక్రివాల్. లేడీ టార్జాన్.. జమునా తుడు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని మతుర్ఖమ్ స్వస్థలం. అదంతా అటవీప్రాంతం. స్మగ్లర్ల బెడద చాలా ఎక్కువ. వాళ్లంతా మాఫియాగా మారి అడవిని నాశనం చేస్తూ ఆ ప్రాంత గిరిజనుల బతుకును దుర్భరం చేయసాగారు. వాళ్ల ఆగడాలను అటవీశాఖా ఆపలేకపోయింది. ఒక్క చేవ చూపించింది పదిహేడేళ్ల ఒక సివంగి. ఆమే జమునా. తనతోపాటు 25 మంది మహిళలను కలుపుకొని విల్లంబులు చేత పట్టుకొని అడవిని పహారా కాసే బాధ్యతను తీసుకుంది. 50 హెక్టార్ల ఆ వనం నుంచి మాఫియా ముఠాను తరిమి కొట్టింది. ఇప్పుడు ఆమె సైన్యంలో 60 మంది మహిళలున్నారు. ఆ ప్రాంతమంతా ఆమెను లేడీటార్జాన్ అని పిలుచుకుంటారు గౌరవంగా! సైంటిస్ట్ అమ్మ అవసరాలే పరిష్కారాలను కనిపెడ్తాయి. ఈ అమ్మ కథ అలాంటిదే. బెంగళూరుకు చెందిన రాజలక్ష్మి బొర్తాకుర్కు ఒక కొడుకు. ఎపిలెప్సీతో బాధపడ్తున్నాడు. ఎప్పుడు బాగుంటాడో.. ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియదు. ఒక్క క్షణం బాబును వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. కనీసం ఫలానా సమయంలో ఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిసినా జాగ్రత్తగా ఉండొచ్చు. బాబు అనారోగ్యంతో ఆమె చాలా నీరసించి పోయింది. విపరీతంగా అలసిపోయింది. నిరాశా నిస్పృహలకు లోనయ్యింది. అసలు ఫిట్స్ ఎప్పుడు వస్తాయో కనిపెట్టే పరికరం ఏమైనా ఉందా అని అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. లేదని తేలి.. తానే ఎందుకు కనిపెట్టకూడదని పరిశోధనా ప్రారంభించింది. మూడేళ్ల ఆ కష్టానికి ఫలితం కనపడింది. ఒక సింపుల్ గ్లోవ్‌ను కనిపెట్టింది. అందులోని సెన్సర్లు ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని హెచ్చరిస్తుంటాయన్నమాట. ఇలా తన కొడుకు కోసం రాజలక్ష్మి కనిపెట్టిన ఈ పరికరం అలాంటి ఎంతోమంది జీవితాలను రక్షిస్తోంది. ఫైర్ ఫైటర్.. నాగ్పూర్వాసి హర్షిణీ కన్హేకర్ తొలి మహిళా ఫైర్ ఫైటర్. అదొక కోర్స్ ఉంటుందని కూడా తెలియని ఆమె తన స్నేహితురాలికి సహాయంగా వెళ్లి దాని గురించి తెలుసుకొని ఫైర్ సర్వీస్‌లో సీట్ తెచ్చుకుంది. పెద్ద పెద్ద ఫైర్స్ యాక్సిడెంట్స్‌ను ఒంటిచేత్తో హ్యాండిల్ చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. వెటర్నరీ డాక్టర్.. మహారాష్ట్రకే చెందిన సునీతా కాంబ్లే ఆ ప్రాంతంలోని తొలి మహిళా వెటర్నరీ డాక్టర్. మహాస్వాడ్.. కరువు ప్రాంతం. ప్రధాన జీవనాధారం గొర్రెలు. కాని అక్కడి పరిస్థితుల వల్ల వాటిని కాపాడ్డం చాలా కష్టంగా ఉండింది. అవి బతికితేనే ఆ ఊళ్లకు బతుకు. అప్పుడే అనుకుంది సునీత. పశువుల డాక్టర్.. ప్రత్యేకించి గొర్రెల ఆరోగ్యాన్ని రక్షించే డాక్టర్ కావాలని. కుటుంబం, కమ్యూనిటీ ఆడపిల్లకు చదువేంటి, అందునా అలాంటి చదువేంటి? అని వ్యతిరేకరిస్తున్నా.. వెనక్కి లాగుతున్నా.. వెటర్నరీ డాక్టర్ అయింది. ప్రస్తుతం మహాస్వాడ్కి దేవతలా గౌరవాన్నందుకుంటోంది. ఈ మెచ్చుకోలు మచ్చుకే! స్త్రీ ఇంటిని చక్కదిద్దుతున్నా.. బయట వ్యవహారాలను చక్కబెడుతున్నా.. ఏకాగ్రత, చిత్తశుద్ధి, నిబద్ధత ఆమె అలంకారాలు! సహనం ఆమె ఆయుధం! ఇవన్నీ ఆమె వ్యక్తిత్వంలో ఒదిగిన కలికితురాయిలు! – సరస్వతి రమ -
ఈక్వల్ ఈక్వల్
దేవుడి సృష్టిలో మనుషులమంతా సమానమే. కాకపోతే సృష్టి అవసరాల కోసం ఆడ, మగ అని వేరు చేసి ఎవరి దేహధర్మాలను వారికి ఇచ్చాడు. ఆ ధర్మాలకు అనువుగా స్త్రీ పురుషుల పని విభజన జరిగింది తప్ప ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని కాదు. ఒక పని ఎక్కువ, ఒక పని తక్కువ అని కాదు. ప్రపంచాన్ని ఇప్పుడు కంప్యూటర్ నడిపిస్తోంది. అందులో హార్డ్‌వేర్ గొప్పా? సాఫ్ట్వేర్ గొప్పా? రెండూ గొప్పే. ఒకటి లేకపోయినా పని కాదు. అంటే రెండింటికీ సమానవైన విలువ ఉంది. దేన్నీ తక్కువ చెయ్యడానికీ, దేన్నీ ఎక్కువ చెయ్యడానికీ లేదు. ఈక్వల్ ఈక్వల్. ఇందులోనూ మళ్లీ హార్డ్‌వేర్ అంటే మగవాడనీ, సాఫ్ట్వేర్ అంటే స్త్రీ అనీ పోలిక తెస్తున్నారు. అదీ కరెక్టు కాదు. ఆడవాళ్లల్లో హార్డ్‌వేర్ నిపుణులు ఉన్నారు. మగవాళ్లలో సాఫ్ట్వేర్ ఎక్స్‌పర్ట్‌లు ఉన్నారు; బైక్‌లు నడుపుతున్న ఆడవాళ్లు ఉన్నారు. ఇంటిపనులన్నీ చక్కగా చేసే మగవాళ్లూ ఉన్నారు. ఎవరి ప్రాముఖ్యం వాళ్లది. అయితే గుర్తింపులో, కష్టానికి ప్రతిఫలం పొందడంలో మాత్రం మహిళలు మగవాళ్లకంటే తక్కువగా ఉంటున్నారు. ఎంత అన్యాయం! ఎంత అసమానత! పని గంటలు సమానం అయినప్పుడు, ప్రతిఫలం కూడా సమానంగానే కదా ఉండాలి. అలా కాకుండా.. వివక్ష చూపుతున్నామంటే దేవుడి సృష్టిపైనే వివక్ష చూపుతున్నాం అని. ఎంత అపరాధం! చరిత్రలో ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. 1975 డిసెంబర్ 29న బ్రిటన్ పార్లమెంటు.. ‘ఈక్వల్ పే, ఈక్వల్ రైట్..’ చట్టాన్ని తెచ్చింది. ఆఫీస్‌లలో, సమాజంలో స్త్రీపురుష సమానత్వం ఉండాలని శాసించింది. మనుషులు అనుకోవాలే కానీ, శాసనాలు అవసరమా? అవసరం లేదు. దేవుడి అభీష్టాన్ని నెరవేర్చడానికి మనిషికి శాసనాలు అక్కర్లేదు. సంకల్పం చాలు. -
‘మేల్’కొలుపుతూ..
– దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విశాఖవాసి – గృహహింస నుంచి బయటపడాలని సూచన – ‘ఇట్స్ టైమ్ టు స్పీక్ అవుట్ మర్డ్’ అంటున్న అమీన్ ‘‘గృహహింస మహిళలకు మాత్రమే ఉంటుందని అందరి భావన. కానీ పురుషులూ దీనికి గురవుతున్నారనేది వాస్తవం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2006 గణాంకాల ప్రకారం ప్రతి 8.5 నిముషాలకు ఒక పురుషుడు గృహహింస కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. గృహహింస నుంచి తమను తాము రక్షించుకోవడం ఆవశ్యం. వారిలో చైతన్యం నింపడమే యాత్ర ఉద్దేశం’’ అంటున్నాడు విశాఖపట్టణానికి చెందిన అమీన్ షరీఫ్. ఇట్స్ టైమ్ టు స్పీక్ అవుట్ మర్డ్(మేల్)పేరుతో దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన పుష్కరఘాట్, మోరంపూడి ప్రాంతాల్లో పురుషుల గృహహింసపై వివరించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. - రాజమహేంద్రవరం రూరల్ ‘‘సమస్యను దగ్గర నుంచి చూసిన వారికి, అనుభవించిన వారికి మాత్రమే ఆ తీవ్రత తెలుస్తుంది. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. వివాహం అనంతరం నేను అనుభవించిన సంఘర్షణ నుంచే యాత్ర చేయాలనే ఆలోచన వచ్చింది. దీని కోసం ఫేస్బుక్ అకౌంట్ కూడా నిర్వహిస్తున్నా. నాలుగు నెలల ప్రయాణం: దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలితప్రాంతాలు, నేపాల్, బూటాన్ లలో పర్యటించి పురుషులను గృహహింసపై చైతన్యవంతులను చేయడం కోసం ఈ ఏడాది జనవరి 24న విశాఖపట్నం నుంచి బయలుదేరాను. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణిస్తూ ఇప్పటికీ 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, నేపాల్,బూటాన్ల దేశాలను సందర్శించాను. ఇంకా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మిగిలాయి. నేను సందర్శించిన ప్రతి ప్రాంతంలో రెండు అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేశాను. ఒకటి గృహహింస బాధితులు దైర్యంగా ముందుకు రావాలని, తమ సమస్యను పంచుకోవాలని సూచించాను. ముందుగా ఒక విషయం గుర్తించండి ‘‘మనం మనుషులం లింగ వ్యత్యాసాలు తరువాత అంశం. ఆత్మహత్యలు చేసుకోకండి సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయండి’’ అని అందరికీ చెబుతున్నాను. నా ప్రయాణంలో ఏ ఒక్కరూ ప్రేరణ పొంది సమస్య నుంచి బయటపడినా, ప్రాణాలను నిలుపుకున్నా నాకు ఎంతో ఆనందమే. సమస్య ఆధారంగా చట్టాలు ఉండాలి నాది ఒకటే విజ్ఞప్తి చట్టాలు తయారు చేసే వారు లింగ ప్రధానంగా కాకుండా సమస్య ఆధారంగా రూపొందించాలి. నేటి సమాజంలో పురుషులను గృహహింస నుంచి రక్షించే చట్టాలు, వ్యవస్థలు లేవు. ఓసారి ఆలోచించి చట్టాలను మార్పు చేయాలని కోరుతున్నాను. ఆ వేదనకు మూల్యం ఎవరు చెల్లిస్తారు! చట్టాలను నేను గౌరవిస్తా. అలాగే చట్టాల్లో మార్పు రావాలని కోరుకునే వ్యక్తిని నేను. సమాజంలో సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు ఇంకా వివక్షత ఎందుకు. 498–ఏ కేసులో అక్రమంగా ఇరుక్కున్న వారు న్యాయస్థానాలు తీర్పు తరువాత నిర్దోషిగా బయటపడుతున్నారు. కేసు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి పడిన బాధ, వేదనకు మూల్యం ఎవరు చెల్లిస్తారు. ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా నిత్యం దర్శనమిస్తున్నాయి. మహిళలను గౌరవించడం ఎంతో అవసరం. అదే సమయంలో పురుషులకూ సమాన గౌరవం ఇవ్వాలి. నా ఈ ప్రయాణం స్త్రీలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. కేవలం పురుషుల సంరక్షణ కోసమే. అండగా నిలుస్తున్న ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు నా ప్రయాణంలో ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను కలుస్తున్నా. పలువురు మహిళలు సైతం పురుషుల గృహహింస నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కలసినప్పుడు వారి అనుభవాలను నాతో పంచుకున్నారు. -
కరెన్సీ కష్టాలు.. ముష్టిఘాతాలు, సిగపట్లు!
-
డిజిటల్ రంగంలో వెనకబడిపోతున్న మహిళలు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఆర్థికంగా బలపడుతున్న భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ఆడవాళ్లు అన్ని రంగాల్లో మగవాళ్లతో పోటీ పడి దూసుకుపోతున్నారు అని భావిస్తాం. అన్ని రంగాల సంగతి పక్కన పెడితే భారత్‌ను ‘డిజిటల్ ఇండియా’ గా మార్చాలని కలలుగంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయం నెరవేరే ఆస్కారం కనిపించడం లేదు. డిజిటల్ రంగంలో భారతీయ మహిళలు బాగా వెనకబడిపోతున్నారని పలు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ రంగంలో ఇంటర్నెట్, సోషల్ వెబ్సైట్లయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఈకామర్స్ అన్ని వేదికల్లో మహిళలు వెనకబడే ఉన్నారు. ఫేస్‌బుక్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి నలుగురు యూజర్లలో ముగ్గురు మగవాళ్లే ఉంటున్నారు. మొత్తంగా చూస్తే యూజర్లలో 76 శాతం మంది మగవాళ్లుకాగా, 24 శాతం మంది మహిళలు ఉన్నారు. నెట్ యూజర్లలో భారత్ అతి వేగంగా దూసుకుపోతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నా ఆడవాళ్లు మాత్రం తక్కువే ఉంటున్నారు. 125 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో 46,20 కోట్ల మంది డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ కామర్స్‌లో, పొలిటికల్ ట్వీట్స్‌లో మహిళలు మరీ వెనకబడి పోతున్నారు. ఈ రెండు రంగాల్లో సహజంగా మహిళలు వెనకబడి పోవడం వల్లనే ఇలా జరగుతోంది. మహిళలకన్నా 62 శాతం ఎక్కువ మంది మగవాళ్లు ఇంటర్నెట్ను కోరుకుంటున్నారు. మహిళలకన్నా 25 శాతం ఎక్కువ మంది మగవాళ్లు సొంతంగా సిమ్ కార్డు కలిగి ఉండాలని కోరుకుంటున్నారని గ్లోబల్ మొబైల్ అసోసియేషన్ ‘జీఎస్ఎంఏ’ తన నివేదికలో తెలిపింది. దేశంలో 29 శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, 71 శాతం మగవాళ్లు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అండ్ రిటేలర్స్ అసోసియేషన్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 నాటికి మహిళల సంఖ్య 40 శాతానికి పెరుగుతుందని అంచనావేయడం ఆశాజనకమైన విషయం. ఈ కామర్స్‌లో ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారని, మరో నాలుగేళ్లలో ఈ కామర్స్‌లో మహిళల శాతం 20 నుంచి 40 శాతానికి పెరుగుతుందని గూగుల్ సర్వే తెలియజేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో భారతీయ మహిళలు నేపాల్, భూటాన్ దేశాలకన్నా వెనకబడి ఉన్నారు. లైంగిక వేధింపులకు గురవుతామన్న భయంతో కూడా సోషల్ వెబ్సైట్లను ఆడవాళ్లు ఎక్కువగా ఉపయోగించడం లేదని తెలుస్తోంది. -
ఉల్లాసంగా...ఉత్సాహంగా
కరీంనగర్ సిటీ : కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్ ఆదివారం చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటలు..పురుషుల నృత్యాలతో హోరెత్తింది. ఎల్లాపి కులస్తులు ఏర్పాటుచేసుకున్న వనమహోత్సవం కన్నులపండువగా సాగింది. దాదాపు 300 కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, మ్యూజికల్ చైర్, డ్యాన్స్ తదితర విభాగాల్లో పోటీపడ్డారు. కరీంనగర్ యూనిట్ అధ్యక్షుడు వి.గణేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి లక్కాకుల సురేందర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ పారువెల్ల హన్మంతరావు, తుల అనూషను ఘనంగా సన్మానించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కరాలు అందించారు. ఎల్లాపి సంఘం మాజీ అధ్యక్షుడు లక్కాకుల మనోహర్‌రావు, కార్పొరేటర్ తాటి ప్రభావతి, వేల్ముల వెంకటేశ్వర్రావు, ఆది జలపతిరావు, తాటి వేణుగోపాల్‌రావు, బాలసంకుల అనంతరావు, వి.బాలకిషన్‌రావు, గందె కల్పన విశ్వేశ్వర్రావు, లక్కాకుల మోహన్‌రావు, ఆది కొండాల్‌రావు, భాస్కర్‌రావు, ఆది రమణారావు, సర్పంచ్‌లు ఆది మధుసూదన్‌రావు, జి.లత శ్రీనివాస్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆడబాస్లే పవర్ఫుల్!
లండన్: ఆడవాళ్లు మగవారికంటే ఏ విషయంలోనూ తీసిపోరనేది ఎన్నోసార్లు రుజువైంది. అన్ని రంగంల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. చాలా సంస్థల్లో ఉన్నతోద్యోగులుగా మహిళలే ఉంటున్నారు. టీమ్‌ను నడిపించడంలో, వృత్తి విషయంలో కచ్చితంగా వ్యవహరించడంలో మగవారికంటే మహిళలే ముందుంటున్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. తాజాగా జరిపిన సర్వేలో మహిళా బాస్‌లకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. సరైన ప్రవర్తన లేని, విపరీత బుద్ధి గల మగ ఉద్యోగులపై మహిళా బాస్‌లు కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయంలో మగ సూపర్వైజర్ల కంటే వీరే కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఆడబాస్ల పర్యవేక్షణలో పనిచేస్తున్న మగ ఉద్యోగులు వారి శక్తిసామర్థ్యాలకు ఇబ్బందులు పడుతున్నట్లు మిలాన్‌లోని బొకోని యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తెలింది. మగ ఉద్యోగుల విషయంలో ఆడబాస్లు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో మగవారు ఆందోళన చెందుతున్నారని అధ్యయనం తెలిపింది. ‘‘సమాజంలో లింగ వివక్ష తగ్గుతోంది. అనేక మంది మహిళలు తమ కుటుంబాల్ని పోషించేలా ఎదుగుతున్నారు. అనేక కుటుంబాలకు స్త్రీలే ఆధారంగా నిలుస్తున్నారు. ఇది మహిళలు మరింతగా రాణించేందుకు దోహదపడుతోంది. అయితే పురుషులు ఈ స్థితి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని సమర్థిస్తున్న మగవారు సైతం ఈ విషయంలో ఆందోళన ఎదుర్కొనే అవకాశం ఉంది’’అని ఎకటెర్నియా అనే పరిశోధకుడు తెలిపారు. -
స్థూలకాయం ప్రభావం పురుషులపైనే ఎక్కువ
న్యూయార్క్: స్థూలకాయం ప్రభావం స్త్రీల కంటే పురుషులపైనే ఎక్కువ ఉంటుందని, ఇది మగవారి వ్యాధి నిరోధక వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిచిగాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త కనకదుర్గ సింగర్ అధ్యయనం ప్రకారం స్థూలకాయం మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకున్న మగ ఎలుకల్లో జీవక్రియలకు సంబంధించిన రుగ్మతలు ఏర్పడ్డాయి. స్త్రీ, పురుషులకు హృదయ సంబంధ సమస్యలు, డయాబెటిస్ వచ్చే ముప్పు వేర్వేరుగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో మగ, ఆడ ఎలుకలకు పరిశోధకులు ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఇందులో ఆడ ఎలుక స్థూలకాయంగా తయారైనప్పటికీ దాని ఆరోగ్యంపై ప్రభావం తక్కువగా ఉంది. అదే మగ ఎలుక కూడా స్థూలకాయంగా తయారైనప్పటికీ రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు పెరిగాయి. స్థూలకాయం ప్రభావం ఆడ ఎలుకలో లేనప్పటికీ మగ ఎలుకపై అధికంగా ఉంది. ఈ పరిశోధన ద్వారా స్త్రీ, పురుషుల్లో మధుమేహం లాంటి సమస్యలు వేర్వేరుగా ఎందుకు వస్తాయో తెలుసుకునేందుకు వీలుంటుంది. -
'కొందరు మగవాళ్లు మాట వినడంలేదు'
మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో 'స్లైడింగ్ డోరు సిస్టమ్' ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు సిటీ బస్సులలో మహిళల, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మగవాళ్లు మాత్రం ... ఆర్డినరీ సిటీ బస్సు ముందు డోర్ల నుంచి ఎక్కడం...మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చోవటం తమ జన్మహక్కుగా వ్యవహరిస్తున్నారట. ఈ కొత్త సిస్టమ్‌ను అనుసరించడం లేదు. స్త్రీలకు మేం దూరంగా ఉండలేము అన్నట్లుగా ఉంది పురుషుల వ్యవహారం. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే... మధ్యవయస్సు వారితో ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయనేది కండక్టర్లు, డ్రైవర్ల వాదన. 'బస్సు ముందు డోరు భాగం అనేది స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మగవాళ్లు వినిపించుకోవడం లేదు' అని ఓ సిటీ బస్సు డ్రైవర్ అన్నారు. 'పురుషులకు కేటాయించిన సెక్షన్‌కు వెళ్లాలని ఎంత చెప్పినా మగవారు అర్థం చేసుకోవడం లేదు. మధ్య వయస్సు ఉన్న వారితోనే అసలు సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగాలేదని కూర్చోవడానికి అనుమతించాలని మహిళల విభాగంలోనే ఉంటున్నారు. పెనాల్టీ లాంటిది ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదు' అని ఓ మహిళా కండక్టర్ తెలిపారు. ఇక సిటీ బస్సుల్లో తమ కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంటుంటే... మగవారు మాత్రం స్లైడింగ్ డోరు వ్యవస్థను జీర్ణించుకోలేకపోతున్నారు. -
యవో తియావో షెన్ షీ!
తాజా కోణం ‘‘ఈ ఆడవాళ్లు మనలా ఎందుకు ఉండరు?’’ 1964 నాటి ‘మై ఫెయిర్ లేడీ’ చిత్రంలో ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్ తన స్నేహితుడైన కల్నల్ పికరింగ్ని ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ అడిగిన ప్రశ్న ఇది. అవున్నిజమే! ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండరు? ఆ సినిమా వచ్చి యాభై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొందరు మగవాళ్లను వేధిస్తున్న ప్రశ్న ఇది. అయినా ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండాలి? అసలు మగవాళ్లలా ఉండడం అంటే ఏమిటర్థం? ఏం లేదు. మగవాళ్లకు నచ్చే విధంగా ఉండడం! ఎందుకు ఉండాలీ అంటే, మగవాళ్ల కోసమే! ఇప్పుడీ మాట అని చూడండి, ఏం జరుగుతుందో?! ఐదు దశాబ్దాల క్రితం నాటికీ ఇప్పటికీ స్త్రీల ఆలోచనాధోరణిలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ, అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే ఏ మగాడికైనా పురుషాహంకారి, స్త్రీద్వేషి అని పేరు పడిపోతుంది. కనుక ఆడవాళ్ల విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవడం ఎంత అవసరమో, సందేహాలను మనసులోనే దాచేసుకోవడం అంత ఆరోగ్యకరం. ఇదంతా ఒక కోణం. తాజా కోణం ఏమిటంటే ఆడవాళ్లు కూడా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు... ‘‘ఈ మగవాళ్లు మనలా ఎందుకు ఉండరు’ అని! అంటే వాళ్లకు నచ్చేవిధంగానట! ఎలాగంటే, మగాళ్లు చక్కగా వంటచేస్తూ, తాము చెప్పే కబుర్లు వింటూ ఉండాలట. అంతేకాదు, గాడ్జెట్లను, గిజ్మోలను పట్టించుకోకుండా నిరంతరం తమ చుట్టూ తిరుగుతూ ఉండాలట! నిజమేనా? ఎవరిదీ పరిశోధన! పరిశోధన కాదు. పరిశీలన. పెళ్లిళ్లు కుదిర్చే సైట్లకు వధువుల నుంచి వస్తున్న దరఖాస్తులలో ఎక్కువ శాతం ‘అబ్బాయికి వంట చేయడం వచ్చి ఉండాలి’ అనే షరతు ఉంటుంటే, వరుల వైపు నుంచి వచ్చే అప్లికేషన్లలో ‘మేం చక్కగా వండి పెడతాం’ అనే ఆశ, దోసె, అప్పడం కూడా ఉంటోందట! ఇదంతా చూస్తుంటే త్వరలోనే ‘మై ఫెయిర్ జెంటిల్మన్’ అని సినిమా వచ్చినా రావచ్చనిపిస్తోంది. ఆల్రెడీ 2009లో వచ్చేసింది కదా అంటారా. అది చైనీస్ మూవీ. ‘యవో తియావో షెన్ షి’ దాని పేరు. ఏంటో... ఆడామగా ఒకరిమీద ఒకరు చేసుకునే కంప్లైంట్లు కూడా యవో తియావో షెన్ షి అన్నట్లే అర్థం కాకుండా ఉంటాయి! -
మానవా... ప్లీజ్ మానవా!
వాయిదా పద్ధతొద్దు దేనికైనా..! మగాళ్లు పనుల్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు... మహిళామణులంతా చేసే ఫిర్యాదు ఇది. ‘‘అసలు పనులంటూ చేసేవాడే కదా వాటిని ఇప్పుడో రేపో చేసేది’’ అని మనం ఎదురు ప్రశ్నించగలం. కానీ ప్రశ్నించకపోవడమే మంచిది. ఎందుకంటే... వాయిదా పద్ధతి అంత మంచి కాదు అంటున్నారు నిపుణులు. ‘దాని వల్ల మీ మీద ఆధారపడ్డవాళ్లు అసంతృప్తి చెందవచ్చు. ఎంత వాళ్ల విషయంలో మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించినా, సకాలంలో చేయకుండా వాయిదా వేయడం వలన మిగిలేది అసంతృప్తే’ అంటున్నారు వారు. అందుకే వాయిదా పద్ధతిని వదులుకొమ్మని సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... స్త్రీ మనసును గెలుచుకోవాలనుకునేవారికి వాయిదా అనేదే కూడదట. కోరుకొన్న పనిని కోరుకొన్న వెంటనే చేసిపెడుతుంటే సంతోషపడటమే కాదు... వారికి మన మీద బోలెడంత ప్రేమ పెరుగుతుందట. వృత్తిగత జీవితంలో కూడా... ‘పోస్ట్‌పోన్’ అనే మాటను డిక్షనరీలో పెట్టుకోని వారే కెరీర్లో ఉన్నత దశకు చేరే అవకాశం ఉంది. ఇక మధ్య వయసు ఉద్యోగులు పని సరిగా చేయరు అనే అభిప్రాయానికి కూడా ప్రధాన కారణం వారి ‘వాయిదా’ మనస్తత్వమేనట. కాబట్టి... ‘వాయిదా పద్ధతి’ని వాయిదా వేయండిక!