‘మేల్’కొలుపుతూ..
‘మేల్’కొలుపుతూ..
Published Mon, Apr 17 2017 10:33 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
– దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విశాఖవాసి
– గృహహింస నుంచి బయటపడాలని సూచన
– ‘ఇట్స్ టైమ్ టు స్పీక్ అవుట్ మర్డ్’ అంటున్న అమీన్
‘‘గృహహింస మహిళలకు మాత్రమే ఉంటుందని అందరి భావన. కానీ పురుషులూ దీనికి గురవుతున్నారనేది వాస్తవం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2006 గణాంకాల ప్రకారం ప్రతి 8.5 నిముషాలకు ఒక పురుషుడు గృహహింస కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. గృహహింస నుంచి తమను తాము రక్షించుకోవడం ఆవశ్యం. వారిలో చైతన్యం నింపడమే యాత్ర ఉద్దేశం’’ అంటున్నాడు విశాఖపట్టణానికి చెందిన అమీన్ షరీఫ్. ఇట్స్ టైమ్ టు స్పీక్ అవుట్ మర్డ్(మేల్)పేరుతో దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన పుష్కరఘాట్, మోరంపూడి ప్రాంతాల్లో పురుషుల గృహహింసపై వివరించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. - రాజమహేంద్రవరం రూరల్
‘‘సమస్యను దగ్గర నుంచి చూసిన వారికి, అనుభవించిన వారికి మాత్రమే ఆ తీవ్రత తెలుస్తుంది. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. వివాహం అనంతరం నేను అనుభవించిన సంఘర్షణ నుంచే యాత్ర చేయాలనే ఆలోచన వచ్చింది. దీని కోసం ఫేస్‌బుక్ అకౌంట్ కూడా నిర్వహిస్తున్నా.
నాలుగు నెలల ప్రయాణం:
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలితప్రాంతాలు, నేపాల్, బూటాన్ లలో పర్యటించి పురుషులను గృహహింసపై చైతన్యవంతులను చేయడం కోసం ఈ ఏడాది జనవరి 24న విశాఖపట్నం నుంచి బయలుదేరాను. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణిస్తూ ఇప్పటికీ 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, నేపాల్,బూటాన్‌ల దేశాలను సందర్శించాను. ఇంకా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మిగిలాయి. నేను సందర్శించిన ప్రతి ప్రాంతంలో రెండు అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేశాను. ఒకటి గృహహింస బాధితులు దైర్యంగా ముందుకు రావాలని, తమ సమస్యను పంచుకోవాలని సూచించాను. ముందుగా ఒక విషయం గుర్తించండి ‘‘మనం మనుషులం లింగ వ్యత్యాసాలు తరువాత అంశం. ఆత్మహత్యలు చేసుకోకండి సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయండి’’ అని అందరికీ చెబుతున్నాను. నా ప్రయాణంలో ఏ ఒక్కరూ ప్రేరణ పొంది సమస్య నుంచి బయటపడినా, ప్రాణాలను నిలుపుకున్నా నాకు ఎంతో ఆనందమే.
సమస్య ఆధారంగా చట్టాలు ఉండాలి
నాది ఒకటే విజ్ఞప్తి చట్టాలు తయారు చేసే వారు లింగ ప్రధానంగా కాకుండా సమస్య ఆధారంగా రూపొందించాలి. నేటి సమాజంలో పురుషులను గృహహింస నుంచి రక్షించే చట్టాలు, వ్యవస్థలు లేవు. ఓసారి ఆలోచించి చట్టాలను మార్పు చేయాలని కోరుతున్నాను.
ఆ వేదనకు మూల్యం ఎవరు చెల్లిస్తారు!
చట్టాలను నేను గౌరవిస్తా. అలాగే చట్టాల్లో మార్పు రావాలని కోరుకునే వ్యక్తిని నేను. సమాజంలో సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు ఇంకా వివక్షత ఎందుకు. 498–ఏ కేసులో అక్రమంగా ఇరుక్కున్న వారు న్యాయస్థానాలు తీర్పు తరువాత నిర్దోషిగా బయటపడుతున్నారు. కేసు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి పడిన బాధ, వేదనకు మూల్యం ఎవరు చెల్లిస్తారు. ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా నిత్యం దర్శనమిస్తున్నాయి. మహిళలను గౌరవించడం ఎంతో అవసరం. అదే సమయంలో పురుషులకూ సమాన గౌరవం ఇవ్వాలి. నా ఈ ప్రయాణం స్త్రీలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. కేవలం పురుషుల సంరక్షణ కోసమే.
అండగా నిలుస్తున్న ఎన్‌జీవోలు, స్వచ్ఛంద సంస్థలు
నా ప్రయాణంలో ఎన్‌జీఓలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను కలుస్తున్నా. పలువురు మహిళలు సైతం పురుషుల గృహహింస నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కలసినప్పుడు వారి అనుభవాలను నాతో పంచుకున్నారు.
Advertisement