గృహహింస నిరోధక చట్టానికి చైనా ఆమోదం!
ఎట్టకేలకు చైనాలో గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. గృహ హింసకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించేలా జాతీయ చట్టాన్ని తేవాలంటూ కొన్నేళ్ళుగా అఖిలచైనా మహిళా సమాఖ్య చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. శాసన ప్రణాళికలో బిల్లును చేర్చాలన్న ప్రతిపాదన తుదిరూపం దాల్చింది. అయితే ఈ చట్టంలో గే జంటలకు మాత్రం రక్షణ కల్పించలేదు.
గతంలో చైనాలో గృహహింస నిరోధానికి సంబంధించిన ప్రత్యేక చట్టం లేదు. సంప్రదాయ చైనా సంస్కృతిలో తరచూ ఉత్పన్నమౌతున్న కుటుంబ హింసను నివారించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టం.. మానసిక, శారీరకమైనదే కాక, ఏ రూపంలోని గృహ హింసనైనా నిషేధించేట్టుగా రూపొందించారు. అయితే వివాహిత మహిళల్లో పావు భాగం గృహ హింసకు గురౌతున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలోని చైనా మహిళా సమాఖ్య లెక్కలు చెప్తుండగా... సంవత్సరానికి నలభైనుంచి, ఏభై వేల కంప్లైంట్లు మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి.
గతేడాది రిజిస్టర్ అయిన కేసుల్లో తొంభై శాతం మహిళలు భర్తలవల్ల గృహం హింసకు గురైన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త చట్టం.. వివాహితులకు మాత్రమే కాక, సహజీవనం సాగించే వారికి కూడా వర్తించేట్టు రూపొందించారు. కుటుంబ సభ్యుల మధ్య, సహజీవనం సాగించే వారిమధ్య గృహ హింసకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటి శాసనసభా వ్యవహారాల కమిషన్ సభ్యుడు 'గౌ లిన్మావ్'... అన్నారు. ఈ చట్టం నిర్థిష్ట సమస్యలకోసం రూపొందించినట్లుగా ఆయన పేర్కొన్నారు.
కాగా 'గే' లకు ఈ చట్టం వర్తించదని, చైనాలో స్వలింగ సంపర్కులు అంతగా లేరని, వారి విషయంలో హింసకు ఎక్కడా ఉదాహరణలు లేవని అన్నారు. మరోవైపు చైనాలో స్వలింగ సంపర్కం అక్రమం కాకపోయినప్పటికీ నిషిద్ధమని, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కొద్దిశాతం గే కల్చర్ కనిపించినా.. అటువంటి స్వలింగ జంటలకు ఎటువంటి చట్టపరమైన రక్షణా లేదన్నారు. దేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే అవకాశం కూడ లేదని గౌ లిన్మావ్ తెలిపారు.