ఆడబాస్‌లే పవర్‌ఫుల్!
లండన్: ఆడవాళ్లు మగవారికంటే ఏ విషయంలోనూ తీసిపోరనేది ఎన్నోసార్లు రుజువైంది. అన్ని రంగంల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. చాలా సంస్థల్లో ఉన్నతోద్యోగులుగా మహిళలే ఉంటున్నారు. టీమ్‌ను నడిపించడంలో, వృత్తి విషయంలో కచ్చితంగా వ్యవహరించడంలో మగవారికంటే మహిళలే ముందుంటున్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. తాజాగా జరిపిన సర్వేలో మహిళా బాస్‌లకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. సరైన ప్రవర్తన లేని, విపరీత బుద్ధి గల మగ ఉద్యోగులపై మహిళా బాస్‌లు కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయంలో మగ సూపర్‌వైజర్ల కంటే వీరే కచ్చితంగా వ్యవహరిస్తున్నారు.
ఆడబాస్‌ల పర్యవేక్షణలో పనిచేస్తున్న మగ ఉద్యోగులు వారి శక్తిసామర్థ్యాలకు ఇబ్బందులు పడుతున్నట్లు మిలాన్‌లోని బొకోని యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తెలింది. మగ ఉద్యోగుల విషయంలో ఆడబాస్‌లు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో మగవారు ఆందోళన చెందుతున్నారని అధ్యయనం తెలిపింది. ‘‘సమాజంలో లింగ వివక్ష తగ్గుతోంది. అనేక మంది మహిళలు తమ కుటుంబాల్ని పోషించేలా ఎదుగుతున్నారు. అనేక కుటుంబాలకు స్త్రీలే ఆధారంగా నిలుస్తున్నారు. ఇది మహిళలు మరింతగా రాణించేందుకు దోహదపడుతోంది. అయితే పురుషులు ఈ స్థితి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని సమర్థిస్తున్న మగవారు సైతం ఈ విషయంలో ఆందోళన ఎదుర్కొనే అవకాశం ఉంది’’అని ఎకటెర్నియా అనే పరిశోధకుడు తెలిపారు.