జిమ్‌ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు! | Going to the gym check these saftey measures deets inside | Sakshi
Sakshi News home page

జిమ్‌ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!

Published Wed, Mar 5 2025 11:23 AM | Last Updated on Wed, Mar 5 2025 12:36 PM

Going to the gym check these saftey measures deets inside

అవగాహన అవసరం అంటున్న నిపుణులు 

నగర జీవనంలో భాగమైన ఫిట్నెస్‌ కేంద్రాలు

అవగాహనా లోపంతో  ఔత్సాహికుల అవస్థలు

సొంత ప్రయోగాలతో పెరుగుతున్న ప్రమాదాలు

ఇటీవల వైరల్‌ అవుతున్న యస్తిక మృతి వీడియో

 ట్రైనర్‌ పర్యవేక్షణ తప్పనిసరి అంటున్న నిపుణులు 

జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యానికి మేలే.. కానీ జిమ్‌కి వెళ్లే ముందు మానసికంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నామా? లేదా! అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు తగిన మూల్యం తప్పదని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. జిమ్‌ చేసే క్రమంలో నియమావళిని తప్పక పాటించాలని, ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవల జిమ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతి చెందిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇప్పుడీ అంశాలు చెప్పుకోడానికి ఇదే ప్రధాన కారణం. సొంత ప్రయోగాలకు పోకుండా నిపుణుల సలహాల మేరకే వ్యాయామం చేయాలనేదే ఇందులోని ముఖ్య ఉద్దేశం.  – సాక్షి, సిటీబ్యూరో 

ఈ మధ్యనే ఒక జాతీయ స్థాయి ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన యస్తిక (17) ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువును ఎత్తుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు వెయిట్స్‌ మెడపై పడి చనిపోయింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో.. షేర్‌ చేస్తున్నారు. కేవలం చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్, వ్యాయామ సమయాల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను సూచిస్తున్నారు. 

చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు 
 

జిమ్‌ పార్ట్‌నర్‌ తప్పనిసరి.. 
ప్రమాదకర వ్యాయామాలు చేస్తున్న సమయంలో జిమ్‌ పార్ట్‌నర్‌ను ఎంచుకోవడం తప్పనిసరి. ట్రైనర్‌ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విభిన్న వర్కవుట్లు చేసే క్రమంలో పార్ట్‌నర్‌ ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తారు. ముఖ్యంగా బెంచ్‌ ప్రెస్, స్క్వాట్స్‌ వంటి వ్యాయామాల్లో, అధిక బరువులను ఎత్తుతూ వర్కవుట్లు చేసే సమయంలో భాగస్వామి సమన్వయం చేస్తారు. స్పాటర్‌ లిఫ్టింగ్‌ సమయంలో సహాయకారిగా ఉంటారు.  

టెక్నిక్స్‌తోనే సేఫ్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌ వంటి కఠిన వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం ప్రాథమిక నియమం. ఫామ్‌లో లేని సమయంలో ఎలాంటి బరువులూ ఎత్తే ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు జిమ్‌ టెక్నిక్స్‌ ప్రమాదాలు, గాయాల బారినుంచి సంరక్షిస్తాయి. శారీరక, మానసిక దృఢత్వమే హాస్పిటల్‌ బెడ్‌ పై కాకుండా వెయిట్‌ లిఫ్టింగ్‌ బెంచ్‌పై ఉండేందుకు ఉపకరిస్తుందని ఉమెన్‌ ఫిట్నెస్‌ ట్రైనర్‌ శ్వేత పేర్కొన్నారు. 

పరిసరాలను గమనించాలి.. 
వ్యాయామం చేస్తున్న సమయంలో చాలా మంది ఇయర్‌ బడ్స్‌ పెట్టుకుంటారు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. వ్యాయామం చేసేటప్పుటు జిమ్‌ పరిసరాల్లో, ఇతరులు చేస్తున్న వ్యాయామ ప్రక్రియలను గమనిస్తుండాలి. లేదంటే పొరపాటున ఇతరులు చేసే వ్యాయామ పరికరాలు తగలడం, మీద పడటం, రాడ్స్‌ తగలడం వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రైనర్లు చెబుతున్నారు. 

ద్రవాలతో డీహైడ్రేషన్‌కు చెక్‌.. సాధారణంగా జిమ్‌ సెంటర్లన్నీ వెంటిలేషన్‌ తక్కువగా ఉండే పెద్ద పెద్ద హాల్స్‌లో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వ్యాయామం ద్వారా వచ్చే వేడి, మరో వైపు ఉబికివచ్చే చెమటలు. ఈ కారణాలతో శరీరం డీహైడ్రేట్‌ కావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అనువైన ద్రవాలు, పానీయాలు తీసుకోవడం కీలకం. లేదా ఇతర ప్రమాదాలకు డీహైడ్రేషన్‌ కూడా కారణమవుతుంది.  

క్రమశిక్షణ ముఖ్యం.. 
జిమ్‌ కల్చర్‌లో క్రమశిక్షణ ప్రాథమిక నియమం. ఫిట్నెస్‌ వ్యాయామాల తరువాత జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ వాటిని భద్రపరిచే ర్యాక్‌లో పెట్టడం ఇతరులను ప్రమాదాల నుంచి నివారిస్తుంది. జిమ్‌ ఫ్లోర్‌పై డంబెల్స్, వెయిటింగ్‌ బెల్స్‌ ఎక్కడివక్కడే ఉంచడం వల్ల కాలికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్కిప్‌ అయ్యి దానిపై పడితే తలకు బలమైన గాయాలు అయిన సందర్భాలూ కోకొల్లలు. జిమ్‌లో తగిలే గాయాలకు మరో ప్రధాన కారణం ‘వ్యాయామ క్రమశిక్షణ’ లేకపోవడమేనని ప్రముఖ ట్రైనర్‌ సంతోష్‌ హెన్రిక్‌ తెలిపారు. 

వార్మ్‌ అప్‌ తప్పనిసరి..  
వ్యాయామాలకు ముందు వార్మ్‌ అప్‌ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్‌ సెషన్‌ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్‌– లేదా ప్లేట్‌–లోడెడ్‌ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. వ్యాయామాలకు ముందు వార్మ్‌ అప్‌ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్‌ సెషన్‌ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్‌– లేదా ప్లేట్‌–లోడెడ్‌ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. 

సమయం తప్పనిసరి..  
ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆదరాబాదరా జిమ్‌కి వెళ్లడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరం. వ్యాయామాలు, ఫిట్నెస్‌ ప్రక్రియలను నిర్దేశిత సమయాల్లోనే చేయాలి. తక్కువ సమయంలో పూర్తి చేసి వెళ్లాలనే తొందరలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. జిమ్‌ పార్ట్నర్‌ కోసం త్వరగా ముగించడం, ఎక్కువ సేపు చేయడం కూడా ప్రమాదమే. 

మన స్థాయికి తగ్గట్టుగానే..
వ్యాయామాల్లో ఎక్కువగా చేసే తప్పలు ‘సామర్థ్యానికి మించిన బరువులను ఎత్తడం’. అధిక బరువులను ఓ క్రమ పద్ధతిలో రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సూచన. ఎంత ఎత్తగలరో అంతే ఎత్తండి అని ప్రతి ట్రైనర్‌ చెబుతుంటారు. అనివార్యకారణాల వల్ల కొన్ని రోజులు 
జిమ్‌కు వెళ్లని పక్షంలో.. తిరిగి మునుపటి బరువులు ఎత్తడం సరికాదు. దీనివల్ల కండరాలకు గాయాలయ్యే ప్రమాదం ఉందని బంజారాహిల్స్‌లోని ఓ జిమ్‌ ట్రైనర్‌ రవి  చెబుతున్నారు. వ్యాయామాలు చేసేవారు తమతోపాటు తప్పనిసరిగా టవల్‌ వెంట తీసుకెళ్లాలి. ఇది ఆరోగ్య రక్షణకు, ప్రమాదాల నివారణకు సహకరిస్తుంది. వ్యాయామాల సమయంలో పట్టే చెమట వల్ల బరువైన వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గాయాలు కావొచ్చు. టవల్‌తో చెమటను తుడుచుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు తొలగిపోయి చర్మానికి రక్షణ చేకూరుతుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement