
సాక్షి, మహబూబ్‌నగర్: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల హామీలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలుకానుంది. వయస్సుతో సంబంధం లేకుండా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా రాష్ట్ర పరిధిలో ఎక్కడికై నా ప్రయాణం చేయవచ్చు.'
రీజియన్ పరిధిలో..
మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ 10 డిపోల్లోని 845 బస్సుల్లో ప్రతిరోజు 2.50 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. వీరిలో దాదాపు 75–80 వేల మంది మహిళలు రాకపోకలు సాగిస్తారు. రీజియన్‌లో పల్లె వెలుగు 467, ఎక్స్‌ప్రెస్ 263 బస్సులు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలికలు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాలి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం లభించడంతో మధ్య తరగతి ప్రజలకు కొంత ప్రయాణ ఆర్థికభారం తగ్గనుంది.
ఆర్థికభారం తగ్గుతుంది..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీంతో మధ్య తరగతి ప్రజలకు కొంతమేర ఆర్థికభారం తగ్గుతుంది. – త్రివేణి, మహబూబ్‌నగర్
హామీని నిలబెట్టుకున్నాం..!
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేసి తీరుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుండడం సంతోషంగా ఉంది. – బెక్కరి అనిత, కాంగ్రెస్ జిల్లా నాయకురాలు, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఎస్పీ రాములు, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి ప్రారంభించనున్నారు.