చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం.. | - | Sakshi
Sakshi News home page

చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం..

Published Sun, Nov 19 2023 1:16 AM | Last Updated on Sun, Nov 19 2023 12:34 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు వ్యాప్తంగా ‘హస్తంశ్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తారుమారు రాజకీయాల పరంపర ప్రధాన పార్టీలన్నింటిలోనూ కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో చేరినవారు పెద్దమొత్తంలో జారుకుంటుండడం ఆ పార్టీ పెద్దలతో పాటు కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి రావడం.. సుమారు నెల క్రితం పెద్ద ఎత్తున ముఖ్య నేతల చేరికలు జరగడం ఊపిరి పోశాయి.

ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పట్టణ, మండల, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి అధిక సంఖ్యలో ‘చేయి’ అందుకోగా.. అభ్యర్థులు రేసులోకి వచ్చారు. కానీ ఆ చేరికల ముఖచిత్రం ఉదయం, సాయంత్రానికి లేదంటే నాలుగైదు రోజుల్లోనే మారుతుండడం ఆ పార్టీలో కల్లోలం రేపుతోంది.

ప్రధానంగా గద్వాలకు సంబంధించి కాంగ్రెస్‌లో చేరినట్లే చేరి చేజారుతుండడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండడడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లోని అసంతృప్తి నాయకులు బీఆర్‌ఎస్‌ చెంతకు చేరుతుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ను లుకలుకలు పీడిస్తున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరిన క్రమంలోనే చింతలపల్లి జగదీశ్వర్‌రావు, ఆయన అనుచరులు వ్యతిరేకగళం వినిపించారు. జూపల్లికి అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత జగదీశ్వర్‌రావు పార్టీని వీడి ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించగా మళ్లీ హస్తం గూటికి చేరారు.

కానీ.. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన జగదీశ్వర్‌రావు ఆయన తరఫున నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటి, రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో చింతలపల్లి అనుచరులు పెద్ద మొత్తంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి సమక్షంలో కారెక్కడం హస్తానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు కాంగ్రెస్‌ ఊపులో వివిధ పార్టీల నుంచి చేయి అందుకున్న వారు సైతం తిరిగి సొంత గూటికో, ఇతర పార్టీ లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందోననే ఆందోళన పార్టీ శ్రేణల్లో నెలకొంది.

ముఖ్యనాయకుల జంప్‌తో తొలి షాక్‌..
గద్వాలలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత గులాబీని వీడి చేయి అందుకున్న తర్వాత వివిధ మండలాలు, గ్రామాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపారు. డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుర్వ విజయ్‌కుమార్‌ తదితర నేతలు సరితతో పాటు ఆమె భర్త తిరుపతయ్య రాకను వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానం కూడా ఆమె వైపే మొగ్గు చూపి.. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, కుర్వ విజయ్‌ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరగా.. హస్తానికి షాక్‌ తగిలినట్లయింది.

మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం అధిక సంఖ్యలో ఘర్‌వాపసీ పడుతుండడం పార్టీకి మైనస్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు వారి బంధువులు, తమ వర్గానికి మాత్రమే పెద్దపీట వేయడం, సీనియర్లు, పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారు చేజారిపోతున్నట్లు సమాచారం. ఇది గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు ఈ అంశాన్ని పార్టీ పరిశీలకులతో పాటు కర్ణాటకలో ఉన్న ముఖ్యనేతల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇవి చదవండి: బ్యాలెట్‌ పేపర్‌ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement