సభలో మాట్లాడుతున్న అమిత్‌షా, మక్తల్‌లో హాజరైన ప్రజలు
సాక్షి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో చేనేత కార్మికుల కోసం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తే బీసీ సీఎం అవుతారని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్రమోదీని మరోసారి పీఎం చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వారి జీవన పరిిస్థితులపై నరేంద్రమోదీ అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.
మక్తల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు నోచుకోలేదని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నాయకులు మక్తల్‌లో భూ కబ్జాలు, దాందాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భీమా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఊట్కూర్ చెరువుతోపాటు జాయమ్మ చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు నెరవేరాలంటే జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మక్తల్‌లో మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, నారాయణపేటలో రతంగ్ పాండురెడ్డి, కొడంగల్‌లో బంటు రమేష్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీతోనే సంక్షేమ పాలన!
బీజేపీతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, మక్తల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. ఓడినా.. పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కోలార్ ఎంపీ మునిస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిలారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాంరెడ్డి, తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, కనకరాజు, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మలికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ కర్నిస్వామి, ఉపాధ్యక్షుడు సోంశేఖర్‌గౌడ్, నాగప్ప, కౌన్సిలర్లు కౌసల్య, సత్యనారాయణ, అర్చన, కొండయ్య, నాయకులు లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!
Comments
Please login to add a commentAdd a comment