పోటాపోటీగా గోవాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ క్యాంప్‌లు
బీజేపీ సైతం.. సుమారు 100 మందికొడైకెనాల్‌కు తరలింపు
ఓటర్లకు భారీ ఎత్తున తాయిలాలు..ఒక్కో ఓటుకు ఒక్కో రేటు
28న పోలింగ్.. శిబిరాల నుంచి నేరుగా పోలింగ్ సెంటర్లకు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లతో తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్ డీలా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలిపోరు కావడం, సిట్టింగ్ స్థానం కూడా కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా మహబూబ్‌నగర్ కాగా.. కాంగ్రెస్ సైతం పట్టువదలకుండా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ‘విందు’రాజకీయాలతో పాటు బేరసారాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఒక్కో రేటు పలుకుతుండగా.. భారీ ఎత్తున తాయిలాలు, ఆఫర్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం.
భారీగా తాయిలాలు..
ఓటర్లు చేజారకుండా ఆయా పార్టీలు క్యాంప్‌లకు తరలించి.. విందు రాజకీయాలకు తెరలేపడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లకు ఫుల్ డిమాండ్ పలుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించడంతో పాటు నియోజకవర్గాల వారీగా కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులకు సైతం పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నట్లు సమాచారం.
ఇరు పార్టీల్లోనూ ఇప్పటికే మాట్లాడుకున్న దాని ప్రకారం ఓటర్లకు సగం అందజేయగా.. మిగతా మొత్తం పోలింగ్ రోజు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. పలు నియోజకవర్గాలకు సంబంధించి బేరసారాలు పోటాపోటీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు ఇంత ఇస్తామని చెబితే.. దానికంటే అదనంగా ఇస్తామని మరొకరు చెబుతూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
గోవా, ఊటీ, కొడైకెనాల్..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలికల కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓట్లు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్ కుమార్‌రెడ్డితో పాటు మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే 70 శాతానికి పైగా ఓటర్లు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కాగా.. వారం కిందటే ఆ పార్టీ నేతలు వారిని టూరిస్ట్ బస్సుల్లో గోవా, ఊటీ ప్రాంతాలకు తరలించారు. సుమారు వంద మంది సభ్యులున్న బీజేపీ కూడా రెండు రోజుల కిందట కొడైకెనాల్‌కు తరలించింది. తాజాగా కాంగ్రెస్ సభ్యులు సైతం ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు.
మహిళా ఓటర్లకు ప్రత్యేక నజరానా..
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 795 మంది మహిళలు, 644 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 151 మంది అధికంగా ఉండగా.. ఈ మేరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు క్యాంప్‌లకు వెళ్లకుండా.. తమ భర్తలను పంపారు. మిగతా ఓటర్లకు ఇచ్చిన మొత్తం కంటే అధికంగా ఇస్తామని.. చీర, సారెలు సమర్పిస్తామని.. తమకే ఓటు వేసేలా ప్రమాణం చేయించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment