naveen kumar reddy
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు.ఇప్పటికే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ చేరనున్నారు. త్వరలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశ్ గౌడ్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. -
నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా ఎన్.నవీన్‌కుమార్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువు రు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం నవీన్‌కుమార్‌రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పుష్ప గుచ్ఛం అందజేసి అభినందించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగిన రోజు వెలువడిన ఫలితాల్లో తాను విజయం సాధించానని, తన గెలుపును తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న శాసన మండలి వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన తీన్మార్ మల్లన్న.. మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్, ఏఐసీసీ నాయకురాలు దీపాదాస్ మున్షీ సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మండలి లాన్లో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో కలిసి నూతన ఎమ్మెల్సీలు ఫొటోలు దిగారు. -
రసవత్తరంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ‘ఉప’ పోరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లతో తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలిపోరు కావడం, సిట్టింగ్ స్థానం కూడా కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా మహబూబ్‌నగర్ కాగా.. కాంగ్రెస్ సైతం పట్టువదలకుండా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ‘విందు’రాజకీయాలతో పాటు బేరసారాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఒక్కో రేటు పలుకుతుండగా.. భారీ ఎత్తున తాయిలాలు, ఆఫర్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. భారీగా తాయిలాలు.. ఓటర్లు చేజారకుండా ఆయా పార్టీలు క్యాంప్‌లకు తరలించి.. విందు రాజకీయాలకు తెరలేపడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లకు ఫుల్ డిమాండ్ పలుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించడంతో పాటు నియోజకవర్గాల వారీగా కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులకు సైతం పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇరు పార్టీల్లోనూ ఇప్పటికే మాట్లాడుకున్న దాని ప్రకారం ఓటర్లకు సగం అందజేయగా.. మిగతా మొత్తం పోలింగ్ రోజు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. పలు నియోజకవర్గాలకు సంబంధించి బేరసారాలు పోటాపోటీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు ఇంత ఇస్తామని చెబితే.. దానికంటే అదనంగా ఇస్తామని మరొకరు చెబుతూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గోవా, ఊటీ, కొడైకెనాల్.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలికల కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓట్లు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్ కుమార్‌రెడ్డితో పాటు మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే 70 శాతానికి పైగా ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా.. వారం కిందటే ఆ పార్టీ నేతలు వారిని టూరిస్ట్ బస్సుల్లో గోవా, ఊటీ ప్రాంతాలకు తరలించారు. సుమారు వంద మంది సభ్యులున్న బీజేపీ కూడా రెండు రోజుల కిందట కొడైకెనాల్‌కు తరలించింది. తాజాగా కాంగ్రెస్ సభ్యులు సైతం ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. మహిళా ఓటర్లకు ప్రత్యేక నజరానా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 795 మంది మహిళలు, 644 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 151 మంది అధికంగా ఉండగా.. ఈ మేరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు క్యాంప్‌లకు వెళ్లకుండా.. తమ భర్తలను పంపారు. మిగతా ఓటర్లకు ఇచ్చిన మొత్తం కంటే అధికంగా ఇస్తామని.. చీర, సారెలు సమర్పిస్తామని.. తమకే ఓటు వేసేలా ప్రమాణం చేయించుకున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత? -
‘హిందూ దేవాలయాలంటే చంద్రబాబుకి చులకన’
సాక్షి, తిరుమల: హిందూ దేవాలయాలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి చులకన అయ్యిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీటీడీలో అర్చకులకు వయోపరిమితి విధించడాన్ని ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకి దమ్ముంటే మసీదులు, చర్చిలలో ఉన్నవారికి వయోపరిమితిని వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలని సవాల్ విసిరారు. టీటీడీ అధికారుల తప్పుడు వైఖరితో శ్రీవారి సంపద కొల్లగొట్టబడుతోందని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణచేయించాలని డిమాండ్ చేశారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన ఆరోపణలపై నిజనిర్ధారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. పదవి విరమణ పొందిన డాలర్ శేషాద్రి వద్ద వేల కోట్ల విలువైన స్వామివారి ఆభరణాలను ఎలా భద్ర పరుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మడుగులు వత్తుతున్నారు కాబట్టే జేఈఓగా శ్రీనివాస రాజు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. టీటీడీ జేఈఓగా పనిచేసే అర్హతలు ఇతర ఐఏఎస్ అధికారులకు లేవా అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆదాయంపై ప్రభుత్వం కన్ను పడింది. అందుకే వారికి మడుగులొత్తే అధికారులను టీటీడీలో నియమిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. -
'చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు'
తిరుపతి: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైన సీఎం చంద్రబాబు ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసుతో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని నవీన్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలో బాబు జైలుకెళ్లడం తప్పదని జోస్యం చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.