
సాక్షి, తిరుమల: హిందూ దేవాలయాలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి చులకన అయ్యిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీటీడీలో అర్చకులకు వయోపరిమితి విధించడాన్ని ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకి దమ్ముంటే మసీదులు, చర్చిలలో ఉన్నవారికి వయోపరిమితిని వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలని సవాల్ విసిరారు. టీటీడీ అధికారుల తప్పుడు వైఖరితో శ్రీవారి సంపద కొల్లగొట్టబడుతోందని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణచేయించాలని డిమాండ్ చేశారు.
రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన ఆరోపణలపై నిజనిర్ధారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. పదవి విరమణ పొందిన డాలర్ శేషాద్రి వద్ద వేల కోట్ల విలువైన స్వామివారి ఆభరణాలను ఎలా భద్ర పరుస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి మడుగులు వత్తుతున్నారు కాబట్టే జేఈఓగా శ్రీనివాస రాజు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. టీటీడీ జేఈఓగా పనిచేసే అర్హతలు ఇతర ఐఏఎస్ అధికారులకు లేవా అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆదాయంపై ప్రభుత్వం కన్ను పడింది. అందుకే వారికి మడుగులొత్తే అధికారులను టీటీడీలో నియమిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment