
సాక్షి, తిరుమల : మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఏపీ సర్కారు దిగివచ్చింది. ఈ అంశంపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9 సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ తొలుత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు ఈ నిర్ణయంపై భగ్గుమన్నారు. టీటీడీ నిర్ణయంపై సర్వత్రా వ్యక్తమవుతున్న నిరసనలు, భక్తుల ఆగ్రహంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయం మూసివేత అంశంపై ప్రభుత్వం వెనుకకు తగ్గింది. దీంతో శ్రీవారి ఆలయాన్ని మూసివేయవద్దని, భక్తులకు దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టీటీడీని ఆదేశించారు.
మహా సంప్రోక్షణ నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దని టీటీడీ అధికారులకు సీఎం సూచించారు. ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, మహా సంప్రోక్షణ సమయంలో గతంలో ఏ సంప్రదాయాలు పాటించారో.. ఇప్పుడు కూడా అవే సంప్రదాయాలు పాటించాలని తెలిపారు. శ్రీవారి ఆలయంలో పూజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. పరిమిత సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోజులు తరబడి దర్శనం భక్తులు ఎదురూచూసేలా చేయరాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment