రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.
ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment