యవో తియావో షెన్ షీ!
తాజా కోణం
‘‘ఈ ఆడవాళ్లు మనలా ఎందుకు ఉండరు?’’ 1964 నాటి ‘మై ఫెయిర్ లేడీ’ చిత్రంలో ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్ తన స్నేహితుడైన కల్నల్ పికరింగ్‌ని ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ అడిగిన ప్రశ్న ఇది. అవున్నిజమే! ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండరు? ఆ సినిమా వచ్చి యాభై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొందరు మగవాళ్లను వేధిస్తున్న ప్రశ్న ఇది. అయినా ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండాలి? అసలు మగవాళ్లలా ఉండడం అంటే ఏమిటర్థం? ఏం లేదు. మగవాళ్లకు నచ్చే విధంగా ఉండడం! ఎందుకు ఉండాలీ అంటే, మగవాళ్ల కోసమే!
ఇప్పుడీ మాట అని చూడండి, ఏం జరుగుతుందో?!
ఐదు దశాబ్దాల క్రితం నాటికీ ఇప్పటికీ స్త్రీల ఆలోచనాధోరణిలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ, అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే ఏ మగాడికైనా పురుషాహంకారి, స్త్రీద్వేషి అని పేరు పడిపోతుంది. కనుక ఆడవాళ్ల విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవడం ఎంత అవసరమో, సందేహాలను మనసులోనే దాచేసుకోవడం అంత ఆరోగ్యకరం. ఇదంతా ఒక కోణం.
తాజా కోణం ఏమిటంటే ఆడవాళ్లు కూడా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు... ‘‘ఈ మగవాళ్లు మనలా ఎందుకు ఉండరు’ అని! అంటే వాళ్లకు నచ్చేవిధంగానట! ఎలాగంటే, మగాళ్లు చక్కగా వంటచేస్తూ, తాము చెప్పే కబుర్లు వింటూ ఉండాలట. అంతేకాదు, గాడ్జెట్లను, గిజ్మోలను పట్టించుకోకుండా నిరంతరం తమ చుట్టూ తిరుగుతూ ఉండాలట!
నిజమేనా? ఎవరిదీ పరిశోధన!
పరిశోధన కాదు. పరిశీలన.
పెళ్లిళ్లు కుదిర్చే సైట్‌లకు వధువుల నుంచి వస్తున్న దరఖాస్తులలో ఎక్కువ శాతం ‘అబ్బాయికి వంట చేయడం వచ్చి ఉండాలి’ అనే షరతు ఉంటుంటే, వరుల వైపు నుంచి వచ్చే అప్లికేషన్‌లలో ‘మేం చక్కగా వండి పెడతాం’ అనే ఆశ, దోసె, అప్పడం కూడా ఉంటోందట! ఇదంతా చూస్తుంటే త్వరలోనే ‘మై ఫెయిర్ జెంటిల్మన్’ అని సినిమా వచ్చినా రావచ్చనిపిస్తోంది. ఆల్రెడీ 2009లో వచ్చేసింది కదా అంటారా. అది చైనీస్ మూవీ. ‘యవో తియావో షెన్ షి’ దాని పేరు. ఏంటో... ఆడామగా ఒకరిమీద ఒకరు చేసుకునే కంప్లైంట్‌లు కూడా యవో తియావో షెన్ షి అన్నట్లే అర్థం కాకుండా ఉంటాయి!