స్థూలకాయం ప్రభావం పురుషులపైనే ఎక్కువ
న్యూయార్క్: స్థూలకాయం ప్రభావం స్త్రీల కంటే పురుషులపైనే ఎక్కువ ఉంటుందని, ఇది మగవారి వ్యాధి నిరోధక వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిచిగాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త కనకదుర్గ సింగర్ అధ్యయనం ప్రకారం స్థూలకాయం మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకున్న మగ ఎలుకల్లో జీవక్రియలకు సంబంధించిన రుగ్మతలు ఏర్పడ్డాయి. స్త్రీ, పురుషులకు హృదయ సంబంధ సమస్యలు, డయాబెటిస్ వచ్చే ముప్పు వేర్వేరుగా ఉంటుంది.
ఈ ఉద్దేశంతో మగ, ఆడ ఎలుకలకు పరిశోధకులు ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఇందులో ఆడ ఎలుక స్థూలకాయంగా తయారైనప్పటికీ దాని ఆరోగ్యంపై ప్రభావం తక్కువగా ఉంది. అదే మగ ఎలుక కూడా స్థూలకాయంగా తయారైనప్పటికీ రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు పెరిగాయి. స్థూలకాయం ప్రభావం ఆడ ఎలుకలో లేనప్పటికీ మగ ఎలుకపై అధికంగా ఉంది. ఈ పరిశోధన ద్వారా స్త్రీ, పురుషుల్లో మధుమేహం లాంటి సమస్యలు వేర్వేరుగా ఎందుకు వస్తాయో తెలుసుకునేందుకు వీలుంటుంది.