
ఊబకాయం సమస్యను అధిగమించేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ (శాన్‌ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. జన్యువుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ఉపయోగించే క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో తాము కొన్ని జన్యువుల పనితీరును నియంత్రించగలిగామని, తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టగలిగామని అంటున్నారు నవనీత్ అనే శాస్త్రవేత్త. అయితే ఈ క్రమంలో జన్యువుల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోవని, ఆకలికి సంబంధించిన జన్యువులపై ప్రభావం చూపడం ద్వారా ఆహారం తీసుకోవడం తగ్గిపోతుందని నవనీత్ వివరించారు.
మన జన్యుక్రమంలో ప్రతి జన్యువుకూ ఒక నకలు ఉంటుందని, ఈ రెండింటిలో ఒకదాంట్లో మార్పులు చోటు చేసుకుని, రెండోది మామూలుగా ఉన్నప్పుడు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని వివరించారు. ఈ నేపథ్యంలో ఎలుకల్లో తాము ఆకలికి సంబంధించిన సిమ్1, ఎంసీఆర్4ఆర్ అనే రెండు ఆకలి జన్యువులపై క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించామని, రెండు జన్యువుల స్థానంలో ఒకటే ఉండేలా చేసినప్పుడు వాటి శరీర బరువు నియంత్రణలోకి వచ్చేసిందని, తినడం తగ్గిపోవడాన్ని గమనించామని చెప్పారు. జన్యుపరమైన మార్పులేవీ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఈ టెక్నిక్‌ను మనుషుల్లోనూ ప్రయోగించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.