ప్రతీకాత్మకచిత్రం
ఒకప్పుడు ఒబేసిటీ బాధితులు చాలా తక్కువ. మరి ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి 100 మందిలో 30 మంది దీనిబారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటి? ఇదేమైనా అంటువ్యాధా? ..ఎస్, అవుననే అంటున్నాయి పరిశోధనలు. అనారోగ్య సమస్య నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకపోయినా.. అందుకు కారణమయ్యే అలవాట్లు మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయట.
ఉదయాన్నే లేవడం, ఇంటి పని చకచకా చేసుకోవడం, ఇంట్లో తయారుచేసే టిఫిన్ తినేసి పనులకెళ్లడం, సాయంత్రం వచ్చాక కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడపడం, పొద్దుగూకిన మరుక్షణమే పడుకోవడం.. ఇవన్నీ కనుమరుగై చాలారోజులే అయ్యింది. కాలచక్రం కాస్త.. కాదు కాదు.. బాగానే ముందుకు కదిలింది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాతే నిద్ర. పొద్దున 10 దాటిన తర్వాతే పక్కదిగడం. ఇక ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, ఇంటికొచ్చాక సోఫాలో సాగిలబడి టీవీకి అతుక్కుపోవడం, వంటి అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్నీ మనమే పాడుచేసేలా చేస్తున్నాయి. కారణం చిన్నపిల్లలు మనల్ని చూసి ఇలాంటి అలవాట్లు అనుకరిస్తుండడమే.
అంటు వ్యాధిలా అలవాట్లు..: తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. వారి ఆహార్యాన్ని అనుకరించడమేకాదు.. అలవాట్లనూ పాటిస్తారు. పేరెంట్స్ ఒబెసిటీ మార్గంలో నడిస్తే.. పిల్లలూ అదేబాట అనుసరించి రేపటి ఒబెసిటీ పేషెంట్లవుతారు. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 286 కాలేజీల విద్యార్థుల అలవాట్లను పరిశీలించి, కారణాలను విశ్లేషించి చెప్పిన సంగతిది. ఇలా అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వల్లే యువతరం ఒబేసిటీ బారిన పడుతున్నారని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment