స్థూలకాయానికి ఇవే కారణాలు
న్యూఢిల్లీ: దీర్ఘకాలం డిప్రెషన్‌తో బాధపడే వారికి స్థూలకాయం ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యుడు పంకజ్ అగర్వాల్ బరువు పెరిగేందుకు కారణాలు వెల్లడించారు. అవి.
దీర్ఘకాల ఒత్తిడి: అతిగా ఆందోళన, ఒత్తిడి, నిస్పృహల్తో ఉన్నవారు అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలం ఈ సమస్యలు ఉన్న వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్న వారి శరీరంలో కార్టిసోల్ వంటి కొన్ని రకాల హార్మోన్లు అధిక సంఖ్యలో విడుదలవుతాయి. ఈ హార్మోన్లు శరీరం ఎక్కువ కొవ్వు నిల్వ చేసుకునేందుకు తోడ్పడతాయి. ఫలితంగా కొవ్వు అధికమై బరువు పెరగొచ్చు. నడుము చుట్టూ ఈ కొవ్వులు పేరుకుపోతాయి. బరువు పెరగడంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.
కుషింగ్స్ సిండ్రోమ్: ఇది అడ్రినల్ గ్రంథి అధికంగా కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేయడం వల్ల ఉత్పన్నమయ్యే స్థితి. దీని వల్ల ముఖం, వీపు, పొట్ట భాగంలో కొవ్వు పెరుగుతుంది.
హైపోథైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల తలెత్తే స్థితి. ఈ గ్రంథి బాగా పనిచేస్తే అదనపు కొవ్వు కరిగి పోతుంది. మన జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు ఈ గ్రంథి దోహదపడుతుంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి పనితీరు నెమ్మదిస్తే అది కొవ్వును కరిగించదు. దీంతో అధిక కొవ్వు పేరుకుపోతుంది.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల సంభవించే అనారోగ్య స్థితి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షలకు పైగా మహిళలు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. దీని వల్ల కూడా బరువు పెరిగిపోతారు.
సిండ్రోమ్ ఎక్స్: దీన్ని ఇన్సులిన్ నిరోధకత లేదా హైపర్ ఇన్సులినీమియా (అధికంగా ఇన్సులిన్ విడుదలవడం) అని కూడా అంటారు. ఈ స్థితి కూడా బరువు పెరిగేందుకు కారణమవుతుంది. ఇన్సులిన్ విడుదలవడాన్ని సిండ్రోమ్ ఎక్స్ నిరోధిస్తే ఇతర హార్మోన్లు జీవక్రియల్ని అదుపు చేసేందుకు యత్నిస్తాయి. ఫలితంగా ఇతర జీవక్రియలు దెబ్బతింటాయి.
కుంగుబాటు: ఎక్కువ కాలం కుంగుబాటుకు గురైతే ఈ సమయంలో అతిగా తినేందుకు యత్నిస్తారు. ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది.
హార్మోన్ల మార్పులు: స్త్రీలకు ఉన్న ప్రత్యేక శారీరక స్థితుల రీత్యా కొన్నిసార్లు హార్మోన్ల విడుదలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో బరువు పెరుగుతారు.
విటమిన్ డి లోపం: ఆకలిని అదుపులో ఉంచడానికి మెదడును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గేందుకు ఉపకరించే పోషకాలను స్వీకరించడంలో డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ తగ్గితే బరువు పెరిగే అవకాశం ఉంది.