కాలేయానికి వైరస్ సాయం
పాడైపోయిన కాలేయ కణజాలాన్ని మరమ్మతు చేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. జన్యుక్రమంలో మార్పులు చేయడం ద్వారా ఒక వైరస్.. లివర్ కణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. మద్యం అతిగా తీసుకోవడం లేదా కొన్ని రకాల వ్యాధుల వల్ల కాలేయం హెపోసైట్స్ అనే కణాలు నాశనమవుతాయి. దీనివల్ల ఏర్పడే ఖాళీ ప్రాంతంలో మైఫైబ్రోబ్లాస్ట్‌లు చేరిపోయి కణజాలం మొత్తం పనికిరాకుండా పోతుంది. కాలేయం సకాలంలో మరిన్ని ఎక్కువ హైపోసైట్స్‌ను తయారు చేసుకోలేకపోవడంతో మరింతగా దెబ్బతింటుంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు జలుబుకు కారణమయ్యే అడెనో అసోసియేటెడ్ వైరస్‌కు జన్యుపరంగా కొన్ని మార్పులు చేసి ఎలుకలపై ప్రయోగం చేశారు. ఈ వైరస్‌లు మైఫైబ్రోబ్లాస్ట్‌లపై దాడి చేయడంతోపాటు పాడైపోయిన కణాలను హైపోసైట్స్‌గా మార్చగలిగాయి. మొత్తంగా ఆరోగ్యకరమైన హైపోసైట్స్ కణాలు పెరిగి.. కాలేయం పునరుద్ధరణ అవుతుంది. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మరో ఐదేళ్లలోనే మనుషులకూ ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త విన్లెన్‌బ్రింగ్ చెబుతున్నారు. అడెనో అసోసియేటెడ్ వైరస్‌ను ఇప్పటికే పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నందువల్ల కాలేయం మరమ్మతులోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాడే వీలుంటుందని పేర్కొంటున్నారు.