చంద్రుడు ఇలా పుట్టాడట!
లాస్‌ఏంజెలిస్: భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే 430 ఏళ్ల కింద ఈ రెండు గ్రహాలు ఢీకొన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. థియాకు భూమి 45 డిగ్రీల కోణంలో పార్శ్వంగా ఢీకొని ఉంటుందని భావించారు. కానీ అవి రెండు ఎదురెదురుగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తేల్చారు.
చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన ఏడు రాళ్లు, హవాయి, ఆరిజోనాల్లోని భూమి లోపలి పొరల్లో సేకరించిన అగ్నిపర్వత రాళ్లను పరిశీలించాక వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు రకాల రాళ్లలో ఉన్న ఆక్సిజన్ పరమాణువు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. భూమి పొరల్లోని రాళ్లు, చంద్రుడిపై రాళ్లలో సాధారణ ఆక్సిజన్, దాని ఐసోటోప్‌ల నిష్పత్తి ఒకే విధంగా ఉందని ప్రొఫెసర్ ఎడ్వర్డ్ యంగ్ తెలిపారు.