డిజిటల్ రంగంలో వెనకబడిపోతున్న మహిళలు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఆర్థికంగా బలపడుతున్న భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ఆడవాళ్లు అన్ని రంగాల్లో మగవాళ్లతో పోటీ పడి దూసుకుపోతున్నారు అని భావిస్తాం. అన్ని రంగాల సంగతి పక్కన పెడితే భారత్‌ను ‘డిజిటల్ ఇండియా’ గా మార్చాలని కలలుగంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయం నెరవేరే ఆస్కారం కనిపించడం లేదు. డిజిటల్ రంగంలో భారతీయ మహిళలు బాగా వెనకబడిపోతున్నారని పలు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి.
డిజిటల్ రంగంలో ఇంటర్నెట్, సోషల్ వెబ్‌సైట్లయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈకామర్స్ అన్ని వేదికల్లో మహిళలు వెనకబడే ఉన్నారు. ఫేస్‌బుక్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి నలుగురు యూజర్లలో ముగ్గురు మగవాళ్లే ఉంటున్నారు. మొత్తంగా చూస్తే యూజర్లలో 76 శాతం మంది మగవాళ్లుకాగా, 24 శాతం మంది మహిళలు ఉన్నారు. నెట్ యూజర్లలో భారత్ అతి వేగంగా దూసుకుపోతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నా ఆడవాళ్లు మాత్రం తక్కువే ఉంటున్నారు.
125 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో 46,20 కోట్ల మంది డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ కామర్స్‌లో, పొలిటికల్ ట్వీట్స్‌లో మహిళలు మరీ వెనకబడి పోతున్నారు. ఈ రెండు రంగాల్లో సహజంగా మహిళలు వెనకబడి పోవడం వల్లనే ఇలా జరగుతోంది. మహిళలకన్నా 62 శాతం ఎక్కువ మంది మగవాళ్లు ఇంటర్నెట్‌ను కోరుకుంటున్నారు. మహిళలకన్నా 25 శాతం ఎక్కువ మంది మగవాళ్లు సొంతంగా సిమ్ కార్డు కలిగి ఉండాలని కోరుకుంటున్నారని గ్లోబల్ మొబైల్ అసోసియేషన్ ‘జీఎస్‌ఎంఏ’ తన నివేదికలో తెలిపింది.
దేశంలో 29 శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, 71 శాతం మగవాళ్లు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అండ్ రిటేలర్స్ అసోసియేషన్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 నాటికి మహిళల సంఖ్య 40 శాతానికి పెరుగుతుందని అంచనావేయడం ఆశాజనకమైన విషయం.
ఈ కామర్స్‌లో ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారని, మరో నాలుగేళ్లలో ఈ కామర్స్‌లో మహిళల శాతం 20 నుంచి 40 శాతానికి పెరుగుతుందని గూగుల్ సర్వే తెలియజేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో భారతీయ మహిళలు నేపాల్, భూటాన్ దేశాలకన్నా వెనకబడి ఉన్నారు. లైంగిక వేధింపులకు గురవుతామన్న భయంతో కూడా సోషల్ వెబ్‌సైట్లను ఆడవాళ్లు ఎక్కువగా ఉపయోగించడం లేదని తెలుస్తోంది.