ఇమార ‘చెర’పై సమరం
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.
రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.
‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్‌జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)
న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్‌లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్‌లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.
‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్‌వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)
కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.
‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం.
Comments
Please login to add a commentAdd a comment