స్ఫూర్తి
మగపిల్లాడు పుట్టాలని బలంగా కోరుకుంది ఆ కుటుంబం. అయితే ఆడపిల్లే పుట్టింది. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. నిర్లక్షంగా చూసేవారు. రూర్కెలాలోని పేద కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయికి బాగా చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం పెద్దగా లేకపోవడం వల్ల చదువు కొనసాగించడం అనేది అసాధ్యంగా మారినప్పటికీ వెనకడుగు వేయలేదు. ఒడిషాకు చెందిన సంజిత మహాపాత్రో ఎన్నో సమస్యల మధ్య చదువును పూర్తి చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయింది.
‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి!’ అనిపించుకుంటుంది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ సీయీవో సంజిత మహపాత్రో. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
ముఖ్యంగా పేదింటి బిడ్డల చదువు విషయంలో చొరవ తీసుకుంటుంది. ‘చదువుకోవాలనే కోరిక మీలో బలంగా ఉంటే ఏ శక్తీ అడ్డుకోలేదు’ అంటున్న సంజిత.. ‘చదివింది చాలు. ఇక ఆపేయ్’ అనే పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొంది. అయితే స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఉపకార వేతనాలతో చదువు కొనసాగించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సంజిత స్టీల్ అథారిటీ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసింది. వారి కుటుంబం సొంత ఊళ్లో ఇల్లు కట్టుకుంది. ‘ఐఏఎస్ చేయాలి’ అనేది సంజిత చిన్నప్పటి కల. భర్త కూడా ప్రోత్సహించాడు.
ఇదీ చదవండి: ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యా
యూపీఎస్‌సీకి ముందు ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (వోఎఎస్)లో రెండో ర్యాంకు సాధించింది. ఉద్యోగంలో చేరకుండా యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టింది. అయితే విజయం ఆమెకు అంత తేలికగా దక్కలేదు. మొదటిసారి, రెండోసారి, మూడోసారీ ప్రిలిమినరి పరీక్షలలోనే ఫెయిల్ అయింది.
చదువులో ‘సక్సెస్’ తప్ప ఫెయిల్యూర్ గురించి పెద్దగా పరిచయం లేని సంజిత వరుస ఫెయిల్యూర్‌లతో నిరాశపడి ఉండాలి. అయితే ఆమె ఎప్పుడూ నిరాశ పడలేదు. అలా అని అతి ఆత్మవిశ్వాసానికి పోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరుగుతుంది’ అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం సాధించింది. తాము నడిచొచ్చిన దారిని మరవని వారు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ సంజిత మహాపాత్రో ఈ కోవకు చెందిన స్ఫూర్తిదాయకమైన విజేత.
చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
ఒక్కో మెట్టు ఎక్కుతూ...
పేద కుటుంబంలో పుట్టిన నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది చిన్నప్పటి కోరిక. చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం. అనుకున్నవన్నీ నిజం కాకపోవచ్చు. అయితే సాధించాలనే పట్టుదల మనలో గట్టిగా ఉంటే అదేమీ అసాధ్యం కాదు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక్కోమెట్టు ఎక్కుతూ నా కలను నిజం చేసుకున్నాను.
– సంజిత మహాపాత్రో
Comments
Please login to add a commentAdd a comment