women officer
-
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
దళిత మహిళా అధికారిపై టీడీపీ నేత సోమిరెడ్డి దూషణలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ccపొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ దళిత మహిళా అధికారిపై దూషణలు చేయడంతో దళిత, గిరిజన వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆ అధికారికి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ సీనియర్ రాజకీయ నేతగా సమాజంలో హుందాగా ఉండాల్సిన వ్యక్తి తన స్థాయి మరిచి ప్రవర్తించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమిరెడ్డి అనుచరుడు కేసీ పెంచలయ్య గత టీడీపీ పాలనలో ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.8 లక్షల విలువైన టాటా ఇండికా వాహనాన్ని రాయితీపై పొందారు. దానికి రూ.లక్ష వరకు రాయితీ వస్తుండగా, మిగతాది ప్రతి నెలా రూ.15 వేలు కంతు చెల్లించాల్సి ఉంది. ఇలా కంతులు చెల్లించుకుంటూ ఐదేళ్లలో పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంది. కానీ గిరిజన సంఘం నేత ఇప్పటికి కేవలం రూ.60 వేలే చెల్లించాడు. ఆరేళ్లు పూర్తి కావస్తున్నా వాహన కంతులు చెల్లించకపోవడంతో ఐటీడీఏ అధికారులు పలుమార్లు నోటీసులిచ్చారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల కిందట వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి.. ఐటీడీఏ పీవో మందా రాణికి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగారు. నువ్వు.. అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ దూషించారు. సోమిరెడ్డి దూషణతో మనస్తాపం చెందిన ఆమె జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. సోమిరెడ్డి తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన గిరిజన సంఘాలు దళిత అధికారిపై వ్యక్తిగత దూషణలు చేసిన సోమిరెడ్డి తీరును నిరసిస్తూ శనివారం దళిత, గిరిజన సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘ నేత పాలకీర్తి రవి మాట్లాడుతూ కుల సంఘం ముసుగులో సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తి వాహన కంతులు చెల్లించకుండా విలాస జీవితం గడుపుతున్నారని విమర్శించారు. తన మద్దతుదారుడి వాహనం సీజ్ చేస్తే అదేదో ఘోరం జరిగినట్టు మహిళా అధికారిపై ఫోన్లో బెదిరింపులకు దిగి నానా యాగీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Disha Naik: ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్
గోవాకు చెందిన దిశా నాయక్ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్ ఫైర్ టెండర్’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది. అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్’ (ఏ.ఆర్.ఎఫ్.ఎఫ్.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ. 2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్ ఫైర్ టెండర్’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్ ఫైర్ టెండర్‌ను ఆపరేట్ చేసే తొలి సర్టిఫైడ్ ఉమన్ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. క్రాష్ ఫైర్ టెండర్ (సి.ఎఫ్.టి.) అంటే? ఇది హైటెక్ ఫైర్ ఇంజిన్. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్.టి.ని ఆపరేట్ చేసే మహిళా ఫైర్‌ఫైటర్ అయ్యింది. యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని.. గోవాలోని పెర్నెమ్కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’లో ఫైర్‌ఫైటర్ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్ సైకిల్ నడిపేది. రన్నింగ్ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్ ఫైర్ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్.టి ఆపరేటర్‌గా ప్రమోట్ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు. అన్నివిధాలా సిద్ధంగా ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ. -
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
మహారణ్యానికి మహిళా బాస్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం. మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది. వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్‌గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్‌కు ఫీల్డ్ డైరెక్టర్‌గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది. అడవి అంటే ప్రేమ సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్‌లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్‌లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది. స్త్రీలకు సవాలు ‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం. అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు. ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్. ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
సూపర్ ఉమెన్.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్ ప్రశంసలు..
సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..? చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్ కమిషనర్ ఆర్వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్ టాపిక్ మారింది. ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్ స్పందించారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మహిళా ఐఏఎఫ్‌పై లైంగిక దాడి
న్యూఢిల్లీ/చెన్నై: తనపై లైంగిక దాడి జరిగిందని ఐఏఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ ఓ మహిళా ఐఏఎఫ్ అధికారి కోయంబత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని 26న మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్ హార్ముఖ్ తన వద్ద శిక్షణ తీసుకుంటున్న ఐఏఎఫ్ మహిళా అధికారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐఏఎఫ్ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, వారు ఆమె చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించిన ‘టూ ఫింగర్ టెస్ట్’నూ ఆమెపై నిర్వహించారు. అయితే, తాజాగా స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత ఆ కేసు తమకు బదిలీ అయ్యిందని, కోర్ట్ మార్షల్ నిర్వహిస్తామని ఐఏఎఫ్ తెలిపింది. -
ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే
చంద్రవంక వంటి వంతెన మీద నడక ఒకే వేగంతో ఉండదు. వంతెనకు ఈ చివర ఇల్లు. ఆ చివర ఆఫీస్. ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికీ వంతెన ప్రయాణం. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మహిళ అడుగులు వేస్తున్నప్పుడు.. ఎంత అలవాటైన ప్రయాణం అయినా ఏదో ఒక పరిస్థితిలో ఆఫీస్ ఉన్న వైపు నడక వేగం తగ్గుతుంది. అడుగులు ఇంటివైపు లాగుతుంటాయి! కెరీర్ ‘స్లో డవున్’ అయ్యే దశ అది! ‘నువ్వీ రోజు ఆఫీస్‌కి వెళ్లొదు, ‘నువ్వా క్యాంప్‌ను క్యాన్సిల్ చేసుకో’, ‘కొన్నాళ్లు సెలవు పెట్టొచ్చు కదా’.. అని ఇల్లు డిమాండ్ చేస్తుంది. వినకుంటే ఆదేశిస్తుంది. అప్పటికీ కాదంటే.. ఆర్యోగంపై, మనసుపై ఒత్తిడి తెస్తుంది. అప్పుడేం చేయాలి?! ‘‘ఏమాత్రం ఒత్తిడి తీసుకోకుండా.. స్లో డవున్ అవడమే మంచిది. ఆ స్లో డవునే ఆ తర్వాత మీ కెరీర్‌ని ‘స్పీడ్ అప్’ చేస్తుంది’’ అని నమ్మకంగా చెబుతున్నారు అశ్విని నందిని. అశ్విని ఎంత పెద్ద ఉద్యోగినో, అంతకన్నా పెద్ద బాధ్యతలు గల గృహిణి. అశ్విని గురించి చెప్పుకుంటున్నాం కనుక అశ్విని అంటున్నాం కానీ.. ఎంత సాధారణ ఉద్యోగం చేసే మహిళ నుంచైనా ఇల్లు అసాధారణ స్థాయిలోనే తన నిర్వహణ కోసం పట్టుబడుతుంది! ‘నువ్వు దగ్గర లేకుండా నేనెలా నడుస్తాను’ అని ఇల్లు ఏ మాత్రం దయ, జాలి, సానుభూతి, మొహమాటం లేకుండా అనేస్తుంది. అశ్విని నోయిడాలోని ‘గ్లోబల్‌లాజిక్ ఇండియా’ లోని డెలివరీ అస్యూరెన్స్ విభాగానికి అధిపతి. ఆ సంస్థ హెడ్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది. ఉద్యోగం చేసే ఏ మహిళకైనా ఆమె చెప్పేదొక్కటే.. ‘మీరు సూపర్ ఉమన్‌లా ఇంట్లో, ఆఫీస్‌లో పడీ పడీ చేయడానికి ప్రయత్నించకండి. భుజంపై కావడి లా రెండిటినీ మోసుకుని వంతెన పై ఒక రోబోలా ప్రయాణించకండి..’’ అని. మల్టీ టాస్కింగ్ పట్ల ఆమెకు గొప్ప అభిప్రాయమేమీ లేదు. ఇంట్లో ముఖ్యమైన పని ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆప్పుడు ఆఫీస్‌కు రెండో స్థానం. ఇక ఆఫీస్‌లో చేసి తీరవలసిన పని ఉంటే ఆఫీస్ పనికే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు ఇంటికి రెండో స్థానం’’ అని చెబుతారు అశ్విని. అలా కుదురుతుందా? ‘ఎందుకు కుదరదు?’ అని ఆమె ప్రశ్న. ఈ ప్రశ్న వేయగలిగినంత సమన్వయ బలాన్ని ఆమె ఇల్లు, ఆఫీసే ఆమెకు ఇచ్చాయి. 1980 లలో ఢిల్లీ యూనివర్సిటీలో మేథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చారు అశ్విని. తర్వాత ఏమిటి? అప్పట్లో డిగ్రీ చేసిన వారెవరికైనా మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటే హాటెస్ట్ కోర్సు.. ‘ఎంసీఎ’. మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ కోర్సులో చేరాకే మొదటిసారి కంప్యూటర్ని చూశారు అశ్విని. కంప్యూటర్ని వేళ్లతో తాకడం కూడా అప్పుడే. ఆ క్షణంలోనే కంప్యూటర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడి పోయింది. మేథ్స్ ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించడం ఆమెకో ఆటలా ఉండేది. ఆ ఆటకు కంప్యూటర్ సాధనం అయింది. కోడ్స్ రాయడం, అల్గోరిథమ్స్ వృద్ధి చేయడం ఆమెకు ఇష్టమైన కఠిన వ్యాయామాలు. గ్లోబల్‌లాజిక్ ఇండియా డెలివరీ అస్యూరెన్స్ హెడ్‌గా ఇప్పుడు ఆమె చేస్తున్న పని అదే. అదొక టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ. కంపెనీలకు అవసరమైన ప్రోగ్రామింగ్‌లను రాసి, తన టీమ్ చేత రాయించి డెలివరీ చేయిస్తుంటారు. ‘ఇంటెరల్ ఐటీ’, ‘టాటా యునిసిస్’ వంటి పెద్ద సంస్థల్లో పని చేసి వచ్చాక 2007లో ఆమె గ్లోబల్‌లాజిక్‌లో చేరారు. ఇక ఇప్పుడు ఆమె ఆఫీస్ బయట చేస్తూ వస్తున్న ఉద్యోగం కూడా ఒకటి ఉంది. లైఫ్ కోచ్. ఉద్యోగం అంటే ఎవరి దగ్గరో లైఫ్ కోచ్‌గా చేయడం కాదు. తనే సొంతంగా ‘వంతెన మీద నడిచే’ గృహిణి కమ్ ఉద్యోగినులకు బ్యాలెన్సింగ్‌లో తర్ఫీదు ఇస్తుంటారు. ‘‘ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దానివైపు మొగ్గ చూపండి. నష్టమేం లేదు’’ అన్నది ఆమె తరచు చెబుతుండే పాఠం. లైఫ్ కోచ్‌గా ఆమె దగ్గరకు వస్తుండే వాళ్లంతా మల్టీ నేషనల్ కంపెనీలలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలే. వాళ్లంతా ఇంటికి, ఆఫీస్‌కి మధ్య చిక్కుకున్నవారు. అశ్విని లైఫ్ కోచ్ అవడానికి స్వీయానుభవాలే ప్రేరేపించాయి. ‘‘సమాజాన్ని మెరుగు పరిచినా, సామాజిక జీవన స్థితిగతుల్ని క్షీణింపజేసినా ఇల్లూ, ఆఫీసేనని ఆమె అభిప్రాయం. అంత ప్రాముఖ్యం గల రెండు వ్యవస్థల్ని సవ్యసాచిలా నడుపుతున్న మహిళలు.. సమానత్వాన్ని, సాధికారతను సాధిస్తూనే ఉన్నా వంపు వంతెనపై నడవడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది. నన్నే చూడండి. నా కూతురు పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు తనని దగ్గరుండి చదివించడానికి, తనకి కావలసినవి వేళకు అమర్చడానికి నేను ఉద్దేశపూర్వకంగా ఇంటì వేగాన్ని పెంచి, ఆఫీస్ వేగాన్ని తగ్గించుకున్నాను. అందువల్ల నా కెరీర్ కూడా కొంత దెబ్బతినింది. పట్టించుకోలేదు. ఆ తర్వాత నా ఆఫీస్ వేగాన్ని పెంచుకున్నాను’’ అని చెప్తారు ఇద్దరు పిల్లల తల్లి అయిన అశ్విని. ఆమెకు మరొక అనుభవం కూడా ఉంది. కెరీర్ ఆరంభంలో ఆఫీస్ తరఫున అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవాలి. అప్పటికి ఆమె మొదటి బిడ్డ తల్లి. క్షణం కూడా ఆలోచించకుండా అమెరికా ఆఫర్‌ని కాదనేశారు. ‘‘వెళ్లొచ్చా అని అడగడం కాదు. వెళ్లాలో వద్దో మనకే తెలిసిపోవాలి’’ అంటారు అశ్విని. ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దాని వైపు మొగ్గు చూపండి. నష్టమేం లేదు. -
మంత్రి పాదాలు తాకిన మహిళా అధికారి..
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి పాదాలను ఓ మహిళా అధికారి తాకిన వీడియో వైరల్ కావడంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ప్రజా పనుల మంత్రి సజ్జన్ సింగ్ వర్మ దెవాస్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మహిళా అధికారి ఆయన పాదాలకు నమస్కరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజేష్ లునావత్ ట్విటర్లో షేర్ చేశారు. ‘నూతన మధ్యప్రదేశ్ ఇదే..అధికార యంత్రాంగం మంత్రి పాదాక్రాంతమైంద’ ని ఆయన ట్వీట్ చేయడం కలకలం రేపింది. గురునానక్ 550వ జయంతి వేడుకల సందర్భంగా దెవాస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారలో ప్రార్ధనలు చేసేందుకు మంత్రి చేరుకోగా అక్కడే ఉన్న మహిళా అధికారి ఆయన పాదాలను తాకారు. మహిళా అధికారి దెవాస్ మున్సిపల్ కమీషనర్‌గా భావిస్తున్నారు. #WATCH Madhya Pradesh: Dewas Municipal Corporation Commissioner, Sanjana Jain touched the feet of state Minister Sajjan Singh Verma while he was visiting a gurdwara in Dewas, on the occasion of Gurupurab, earlier today. pic.twitter.com/40ahf3Sfin— ANI (@ANI) November 12, 2019 -
తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్‌గా హినా జైస్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేనలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్‌గా చండీగఢ్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ చరిత్ర సృష్టించారు. ఫ్లైట్ ఇంజనీర్‌కు ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన సున్నితమైన విమాన వ్యవస్థలను పర్యవేక్షించడం, ఆపరేట్ చేయగల సామర్ధ్యం అవసరం. భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్ హెలికాఫ్టర్ యూనిట్లలో ఫ్లైట్ ఇంజనీర్‌గా హినా విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతల ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ నుంచి సున్నితమైన పలు ప్రాంతాల్లో ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఫ్లైట్ ఇంజనీర్‌గా ఆమె సేవలు అందించాల్సి ఉంటుంది. భారత వాయుసేనలో చేరడం ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరిందని పంజాబ్ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన హినా సంతృప్తి వ్య్తం చేశారు. తనకు చిన్ననాటి నుంచి సైనికుల యూనిఫాం ధరించి ఏవియేటర్‌గా ఆకాశంలో విహరించాలనే ఆసక్తి ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా వాయుసేనలో ఆమె గత ఆరు నెలల నుంచి కఠోర శిక్షణ తీసుకున్నారు. -
మహిళా అధికారిని వేధించిన మేజర్‌పై వేటు
న్యూఢిల్లీ : మహిళా అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన మేజర్ జనరల్ ఎంఎస్ జస్వాల్‌ను ఆర్మీ జనరల్ కోర్టు మార్షల్ (జీసీఎం) సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్వాల్ రెండేళ్ల కిందట నాగాలాండ్‌లో పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా కొహిమాలో పనిచేస్తున్న సమయంలో కెప్టెన్ ర్యాంక్ అధికారి అయిన మహిళను తన రూమ్‌కు పిలిపించుకుని అసభ్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు. అయితే సైన్యంలో వర్గ పోరును తనను బలిపశువును చేశారని, తాను అమాయకుడినని నిందితుడు చెప్పుకొచ్చారు. మేజర్ జనరల్‌పై ఈ ఏడాది జూన్ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా జీసీఎం తీర్పుపై మేజర్ జనరల్ ఎగువ కోర్టులో అప్పీల్‌కు వెళతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. -
ఉన్నతాధికారి లైంగిక వేధింపులు
తుమకూరు(బెంగళూరు): ఉన్నతాధికారి లైంగిక వేధింపులతో మహిళా అధికారిణి తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గురువారం తుమకూరులో చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ అధికారిణిగా పని చేస్తోంది. ఏడాది కాలంగా జాయింట్ డైరెకర్ సుబ్రమణ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు మహిళా అధికారిణి గురువారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. అయితే సహచర ఉద్యోగులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు జాయింట్ డైరెక్టర్‌పై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, నెల నెలా మాముళ్లు ఇవ్వాలని బెదరిస్తున్నాడని, సిబ్బంది ముందు దూషించేవాడని, ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి రావాలని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. జిల్లా కలెక్టర్ మోహన్‌రాజు, జిల్లా పంచాయతీ సీఈఓ శాంతారామ్, మహిళ,శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ నంజేగౌడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితురాలితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అధికారి సుబ్రమణ్యం పైన కఠిన చర్యలను తిసుకుంటామని హామీ ఇచ్చారు.