కజిరంగా సిబ్బందితో సొనాలి ఘోష్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం.
మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది.
వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్‌గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్‌కు ఫీల్డ్ డైరెక్టర్‌గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది.
అడవి అంటే ప్రేమ
సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్‌లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్‌మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్‌లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది.
స్త్రీలకు సవాలు
‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం.
అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు.
ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్.
ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment