Hungry Elephant Swims Across Brahmaputra River To Enter Town - Sakshi
Sakshi News home page

మన్నించు గజరాజా..! పాపం.. బక్కచిక్కి ఎముకలు తేలి ఆకలితో అలమటిస్తూ..

Published Tue, Aug 30 2022 7:03 PM | Last Updated on Tue, Aug 30 2022 8:59 PM

Hungry Elephant Swims Across Brahmaputra River To Enter Town - Sakshi

వైరల్‌: ఆకలి.. ఏ కడుపుకైనా ఒక్కటే!. గుప్పెడు పొట్ట ఉండే మనిషికే అంత ఆకలి ఉంటే.. భారీ కాయం ఉన్న ఆ జీవి మాత్రం తట్టుకోగలదా?. ఇక్కడ ఓ ఏనుగుకు వెన్ను ఎముకలు బాధాకరంగా పొడుచుకు వచ్చాయి. బక్కచిక్కిపోయి.. బలహీనంగా మారిపోయి ఆహారం కోసం అటు ఇటు తిరుగాడింది. దీనికితోడు జనాలు చేసే ఆ గోల దానిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పాపం.. ఈ విశాల ప్రపంచంలో ఆకలి తీర్చుకోలేక  బాధతో అలమటించింది ఆ గజరాజు. అదే ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

సాధారణంగా.. మూగజీవాలు జనవాసాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ, ఇక్కడ ఈ గజరాజు మాత్రం ఆకలికి తట్టుకోలేక వచ్చింది. అది అలా ఇలా కాదు. అందుకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆకలిగొన్న ఆ అడవి ఏనుగు.. అస్సాం కజిరంగ నేషనల్‌ పార్క్‌ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్‌పూజ్‌ నగరానికి ఆదివారం సాయంత్రం చేరుకుంది. ఏనుగు రాకతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రావడం రావడంతోనే నగరంలో అలజడి సృష్టించింది ఆ గజం. 

వీధుల్లో తిరుగుతూ.. తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. లాభం లేదు. చన్మరీ ప్రాంతంలో ఓ ఇంటి వంట గదిలోకి వెళ్లింది కూడా. అక్కడ ఏం దొరకలేదు. దీంతో తేజ్‌పూర్‌ షిప్‌ పోర్ట్‌ గుండా చిత్రలేఖ పార్క్‌లోకి వెళ్లింది. అక్కడ వందల మంది దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆపై అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్టాండ్‌కు చేరుకుని.. జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసేంది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించింది.

తిండి కోసం అది పడే తాపత్రయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా దానిని భయపెడుతూ మరింత అలజడికి కారణం అయ్యారు. చివరికి.. ఫారెస్ట్‌ సిబ్బంది దానిని బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపే తరలించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. ఏనుగు సృష్టించిన అలజడి.. విధ్వంసం వెనుక హృదయవిదారకమైన, కఠోర వాస్తవాలు ఉన్నాయి. వాటినే పలువురు నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. పాపం.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులనే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తూ.. ఆకలికి దూరం చేస్తున్న మనిషి.. ఇప్పుడు దాని ఆకలి తీర్చలేకపోవడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సోషల్‌ మీడియాలో!.

ఇదీ చదవండి: రైల్వే ట్రాక్‌ దగ్గర బైక్‌ స్టంట్‌.. వాడికలా అవ్వాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement