Kaziranga National Park
-
కజిరంగా నేషనల్ పార్కులో మోదీ విహారం
జోర్హాట్: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు. ఎలిఫెంట్ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. -
కజిరంగ నేషనల్ పార్క్ న్ను సందర్శించిన ప్రధాని మోదీ
-
కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్‌లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం. #WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp — ANI (@ANI) March 9, 2024 కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు. ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి. Assam CM Himanta Biswa Sarma shares video of PM Modi's arrival at Kaziranga National Park pic.twitter.com/FlsjC2fwgU — ANI (@ANI) March 8, 2024 -
మహారణ్యానికి మహిళా బాస్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం. మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది. వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్‌గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్‌కు ఫీల్డ్ డైరెక్టర్‌గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది. అడవి అంటే ప్రేమ సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్‌లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్‌లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది. స్త్రీలకు సవాలు ‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం. అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు. ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్. ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం. -
వైరల్ వీడియో: అదృష్టమంటే అంటే వీరిదే..
వన్యమృగాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా టూరిస్టులు.. నేషనల్ పార్కుల్లో పర్యటిస్తున్నప్పుడు జంతువులను రెచ్చగొడితే.. అవి ఆగ్రహంతో దూసుకువస్తాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పర్యాటకులను ఓ ఖడ్గమృగం వెంబడించి.. వారికి చుక్కలు చూపింది. దీంతో, వారు పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి జీపుల్లో తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటన అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొందరు టూరిస్టులు నేషనల్ పార్క్‌లో పర్యటిస్తున్నారు. కాగా, కజిరంగా పార్క్‌లో దాదాపు 2700లకు పైగా సంఖ్యలో రైనోలు ఉంటాయి. ఈ సందర్భంగా పర్యాటకులు రైనోతో అనుచితంగా ప్రవర్తించి దాన్ని రెచ్చగొట్టారు. దీంతో, ఆగ్రహానికిలోనైనా రైనో.. వారి వెంబండించింది. ఈ క్రమంలో పర్యాటకులు జీపుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగో అంటూ పరుగుతీశారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా జీపు నడపడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా టూరిస్టులు బయటపడ్డారు. దీంతో, అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Assam: Kaziranga National Park tourists went through a gripping experience as they got chased by a one-horned rhino while they were on a safari ride. The incident took place in the Bagri forest area of Kaziranga National Park.#kariranganationalpark #wildlife #onehornedrhino pic.twitter.com/PBjWDpYgbr — India Today NE (@IndiaTodayNE) December 31, 2022 -
అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
అయ్యో గజరాజా! పాపం ఆకలికి తట్టుకోలేక..
వైరల్: ఆకలి.. ఏ కడుపుకైనా ఒక్కటే!. గుప్పెడు పొట్ట ఉండే మనిషికే అంత ఆకలి ఉంటే.. భారీ కాయం ఉన్న ఆ జీవి మాత్రం తట్టుకోగలదా?. ఇక్కడ ఓ ఏనుగుకు వెన్ను ఎముకలు బాధాకరంగా పొడుచుకు వచ్చాయి. బక్కచిక్కిపోయి.. బలహీనంగా మారిపోయి ఆహారం కోసం అటు ఇటు తిరుగాడింది. దీనికితోడు జనాలు చేసే ఆ గోల దానిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పాపం.. ఈ విశాల ప్రపంచంలో ఆకలి తీర్చుకోలేక బాధతో అలమటించింది ఆ గజరాజు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా.. మూగజీవాలు జనవాసాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ, ఇక్కడ ఈ గజరాజు మాత్రం ఆకలికి తట్టుకోలేక వచ్చింది. అది అలా ఇలా కాదు. అందుకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆకలిగొన్న ఆ అడవి ఏనుగు.. అస్సాం కజిరంగ నేషనల్ పార్క్ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్పూజ్ నగరానికి ఆదివారం సాయంత్రం చేరుకుంది. ఏనుగు రాకతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రావడం రావడంతోనే నగరంలో అలజడి సృష్టించింది ఆ గజం. near govt. boys, tezpur pic.twitter.com/k5LQ2IW02n — vishal junak das (@junaaaak) August 27, 2022 వీధుల్లో తిరుగుతూ.. తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. లాభం లేదు. చన్మరీ ప్రాంతంలో ఓ ఇంటి వంట గదిలోకి వెళ్లింది కూడా. అక్కడ ఏం దొరకలేదు. దీంతో తేజ్‌పూర్ షిప్ పోర్ట్ గుండా చిత్రలేఖ పార్క్‌లోకి వెళ్లింది. అక్కడ వందల మంది దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆపై అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్‌కు చేరుకుని.. జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసేంది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించింది. Dear mama, I am from tezpur & this elephant passes away just in front of my house last night. I just want you to interfere in this matter and make a close watch to the animals, just see the health condition of a wild animal. Shame on every human being. Save our nature pic.twitter.com/9hZoqvK9MX — Bikash Adhikari (@BikashA03668793) August 28, 2022 తిండి కోసం అది పడే తాపత్రయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా దానిని భయపెడుతూ మరింత అలజడికి కారణం అయ్యారు. చివరికి.. ఫారెస్ట్ సిబ్బంది దానిని బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపే తరలించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. 🐘wild elephant enters tezpur. scene from chandmari-railgate area. pic.twitter.com/N5Gnt8HioK — vishal junak das (@junaaaak) August 27, 2022 అయితే.. ఏనుగు సృష్టించిన అలజడి.. విధ్వంసం వెనుక హృదయవిదారకమైన, కఠోర వాస్తవాలు ఉన్నాయి. వాటినే పలువురు నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. పాపం.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులనే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తూ.. ఆకలికి దూరం చేస్తున్న మనిషి.. ఇప్పుడు దాని ఆకలి తీర్చలేకపోవడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సోషల్ మీడియాలో!. ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దగ్గర బైక్ స్టంట్.. వాడికలా అవ్వాల్సిందే! -
పాన్పుపై సేదతీరిన పులి!
అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కు ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమది. పేరు హర్మోతి. మోతీలాల్ ఎప్పటిలాగే గురువారం ఉదయాన్నే తన పాత సామాను దుకాణంలో కూర్చున్నాడు. అంతలో బయట నుంచి ‘పులి పులి’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎంటో చూద్దామని దుకాణం బయటకొచ్చిన మోతీలాల్‌కు గుండె ఆగినంత పనైంది. ఆయనకు ఎదురుగా కేవలం 20 అడుగుల దూరంలో బెంగాల్ టైగర్ ఉంది. అది మోతీలాల్ వైపే వస్తోంది. గాండ్రిస్తూ పెద్ద పులి తనవైపే వస్తుండటంతో మోతీలాల్ శరీరం భయంతో మొద్దుబారి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి అతని కళ్లల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా.. అతని పక్కనుంచి దుకాణంలోపలికి వెళ్లింది. విశ్రాంతి తీసుకునేందుకు దుకాణంలోపల ఉన్న మంచంపై సెటిలైంది. పులి లోపలికి వెళ్లిపోగానే బతికితే చాలురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు మోతీలాల్. గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అధికారుల బృందం హుటాహుటిన అక్కడికొచ్చింది. భారీ వర్షాల కారణంగా కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అధికారుల అంచనా. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు. -
విలవిలలాడుతున్న ప్రాణి ప్రపంచం
గువాహటి: భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదికి వరద పొటెత్తటంతో అస్సాం అతలాకుతలం అవుతోంది. పునరావాస శిబిరాల్లోకి కూడా నీరు వచ్చి చేరటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం అధికారులకు కష్టతరంగా మారుతోంది. ప్రతిష్టాత్మక కజిరంగా జాతీయ ఉద్యావనం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పార్క్ లోకి భారీ ఎత్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో సమీపంలోని కబ్రి, అంగోలాంగ్ జిల్లాల సరిహద్దు గ్రామాలవైపు జంతువులు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడే అవకాశం ఉండటంతో 188 ప్రత్యేక కాంపులను ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు, రక్షణ గస్తీ కాస్తున్నారు. "85 శాతం పార్క్ నీటితో నిండిపోయింది. ఆదివారం బ్రహ్మపుత్ర వరదతో 6 అడుగుల కంటే ఎక్కువే నీరు వచ్చి చేరింది. 1988 వరదల కంటే దారుణమైన పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం" అని కజిరంగ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి బల్లవ సాయికియా తెలిపారు. కజిరంగ ఉద్యానవనం ఏనుగులు, పులులు, తెల్ల దున్నపోతులు, అరుదైన దుప్పిజాతులు, మరీముఖ్యంగా రైనోలకు ఆశ్రయంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలూ బ్రహ్మపుత్ర నదికి ప్రతీయేడూ ఇలా వరదలు రావటం, కజిరంగ పార్క్ లోకి నీరు చేరి జంతువులు ఇబ్బందిపాలు అవుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే రాను రాను ఈ పరిస్థితి అధ్వానంగా తయారువతోందని, జంతువులను తరలించటం చాలా కష్టతరంగా మారుతోందని సాయికియా చెబుతున్నారు. గత నెలలో వరదల మూలంగా 7 రైనోలతోసహా 107 జంతువులు చనిపోగా, అందులో 13 వరదల నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డాయి. పర్యాటక రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినటంతో సమారు 7కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. -
'పర్వాలేదు.. మా బిడ్డలాంటివాడేలే'
కజిరంగా: పసివాళ్లు దేవుళ్లు అంటారు. దేవుడంటే అందరినీ సమాన దృష్టితో చూసేవాడని చెప్తారు. చిన్నాపెద్ద, బీద, ధనిక బేధాలు అస్సలు ఆయనకు ఉండవని అంటుంటారు. అది నిజమేనేమో అని సంఘటన చూస్తే అర్థం అవుతుంది. సాధరణంగా రాజు, రాణి అనగానే మన మనసులో ఓభయం పొర్లుతుంది. లేదంటే ఏదో తెలియని ఆత్మన్యూనత వారికి దూరంగా ఉండేలా చేస్తుంది. కానీ అసోంలో మూడేళ్ల బాలుడికి మాత్రం వారిద్దరు అందరిలాంటి మాములు మనుషులుగానే కనిపించారేమో.. ఏకంగా వారి కాళ్లను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. అది ఒక్కసారి కాదు.. తన ప్రదర్శన అయిపోయేవరకు. బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన విషయం తెలిసిదే. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉండటంతో గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, చూశారు. అయితే, అంతకుముందు కేట్ దంపతులకు పార్క్‌లోకి స్వాగతం చెప్పేందుకు కొంతమంది సంప్రదాయ నృత్యం చేసేవారిని అక్కడికి పిలిపించారు. వీరిలో కాంఖాన్ బారువా మూడేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. తన తల్లిదండ్రుల మాదిరిగానే ముచ్చటగొలిపే వేషధారణలో వచ్చి చక్కగా డప్పు దరువుకు నృత్యం చేశాడు. చేస్తూ చేస్తూ ఏమాత్రం భయపడకుండా కేట్ దంపతుల కాళ్లను తొక్కాడు. అది కూడా కావాలని అల్లరిఅల్లరిగా పదేపదే తొక్కాడు. అయితే, వాళ్లిద్దరు రాజు, రాణి కావడంతో భయపడిన తల్లిదండ్రులు తమ బిడ్డ తరుపున క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ పిల్లాడి చిందులు చూసి ముచ్చటపడిన విలియం, కేట్ ఏం పర్వాలేదని, కాంఖాన్ తమ కుమారుడు జార్జ్‌ని గుర్తు చేశాడని, కాంఖాన్ కూడా తమకు జార్జ్ మాదిరిగానే అని చెప్పారు. అతడిని ఆ ఇద్దరు దంపతులు తీసుకొని ముద్దుచేశారు. అతడి డ్యాన్స్‌కు మురిసిపోయి తెగ చప్పట్లుకొట్టేశారు. -
కజిరంగాలో ప్రిన్స్ జంట
కజిరంగా: బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉన్నాయి. గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులను చూశారు. పెద్ద పులులు ఉండే ప్రదేశాలను చూశారు. బిమోలీ క్యాంప్ వద్ద అల్పాహారం తీసుకున్నారు. ఖడ్గమృగాలు, ఏనుగుల గురించి అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేటగాళ్లను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా విలియం, కేట్లకు కజిరంగా సమాచార కేంద్రం వద్ద ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఏపీ పాండే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పార్కు సందర్శన అనంతరం వారు పరిసరాల్లోని గ్రామాల్లో పర్యటించారు. పార్కులోని ఏనుగుల రాకపోకలకు అంతరాయం కలగకుండా తమ ఇళ్లను ఇతర ప్రాంతాలకు మార్చుకున్న రోంగ్ టెరాంగ్ గ్రామస్తులను విలియం, కేట్లు కలుసుకున్నారు. తొలుత వారు గ్రామంలోని ‘నామ్‌ఘర్’ మందిరాన్ని సందర్శించారు. సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ రిహబిలిటేషన్, కజిరంగా డిస్కవరీ సెంటర్లకు వెళ్లారు. అక్కడ ఏనుగులు, ఇతర జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీని వీక్షించారు. -
కజరంగా పార్క్‌లో ప్రిన్స్ దంపతుల సందడి
అసోం: బ్రిటన్ యువరాజ్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు బుధవారం అసోంలోని కజరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లోని అధికారులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన దృశ్యాలను వీక్షిస్తూ సందడి చేశారు. బ్రిటన్ యువరాజు సతి సమేతంగా పార్క్‌కు రావడంతో అక్కడి అధికారులు ముందుగానే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ పార్క్‌కు సందర్శనానికి వచ్చిన బ్రిటన్ యువరాజు దంపతులను కలిసి మాట్లాడటం తమకు గొప్ప అనుభవమని అక్కడి అధికారుల్లో ఒకరు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, కజరంగా పార్క్‌లో ఫారెస్ట్ రేంజర్లు నిత్యం అవలభించే విధివిధానాల గురించి యువరాజు దంపతులు అడిగి తెలుసుకున్నారు. -
చావుతో సెల్ఫీ దిగినంత పనైంది!!
ప్రస్తుతం భూమి మీద ప్రాణాలతో ఉన్న ఖడ్గమృగాల్లో మూడింట రెండొంతులు నివసించేది అక్కడే. అత్యధికంగా ఖడ్గమృగాలు హత్యకు గురవుతున్నది కూడా అక్కడే. అది ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. ఇంకా ఎన్నో విశిష్టతలున్న ఆ చోటు అసోంలోని కజిరంగా జాతీయపార్కు. అరుదైన ఖడ్గమృగాలు, పక్షిజాతులకు నివాసస్థావరం. గడిచిన కొద్దికాలంగా పేట్రేగిపోతోన్న స్మగ్లర్ల బారి నుంచి జంతువులను కాపాడేందుకు సుశిక్షితులైన రేంజర్లను నియమించారు పార్కు అధికారులు. అలా నియమితుడైన ఓ రేంజర్ కు శుక్రవారం గొప్ప చిక్కొచ్చిపడింది. వాహనాలు వినియోగిస్తే స్మగ్లర్లు పారిపోయే అవకాశం ఉంటుందికాబట్టి కాలినడకన పార్కులో కలియదిరగడం రేంజర్ల విధి. అలా తన విధులు నిర్వహిస్తోన్న రేంజర్.. ఓ భారీ ఖడ్గమృగం కంటబడ్డాడు. పైగా అది పిల్ల తల్లి కూడా. సహజంగానే పిల్లతల్లులైన జంతువులు మిగతా సమయాల్లోకంటే ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రేంజర్ ను చూసిన ఖడ్గమృగం, అతను ఎక్కడ తన పిల్లకు, తనకు హాని చేస్తాడేమోనని కంగారుపడింది. ఆ కంగారు కాస్తా కోపంగామారి రేంజర్ వైపు గుర్రుగా దూసుకొచ్చింది. దిక్కుతోచని రేంజర్ పక్కనే ఉన్న చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. నిజానికి ఆ చెట్టును కూల్చేసి, అతణ్ని చంపడం ఖడ్గమృగానికి పెద్ద పనేంకాదు. కానీ దాని లక్ష్యం పిల్లల్ని కాపాడుకోవటమేకాబట్టి దారి దొరకగానే పిల్లతోసహా తన దారినతాను వెళ్లిపోయింది. అదే పార్కులో తిరుగాడుతోన్న కౌషల్ బొరువా అనే జంతుశాస్త్రవేత్త ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డతర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉందని ఆ రేంజర్ ను అడిగితే..'చావుతో సెల్ఫీ దిగినంత పనైంది' అని బదులిచ్చాడు. -
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
-
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
అసోం: కజిరంగా జాతీయ పార్క్‌లో ఖడ్గమృగాలకు రక్షణ కరువైంది. ఎంతో అరుదైన ఈ అటవీ జంతువుల మరణ మృదంగం దొంగల దాడుల రూపంలో మారుమ్రోగుతోంది. కరడుగట్టిన దొంగలు ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఇప్పటి వరకు 20 ఖడ్గ మృగాల ప్రాణాలను తీసి వాటి కొమ్ములను ఎత్తుకెళ్లారు. కాగా, తాజాగా మరోసారి దొంగలు అదే అఘాయిత్యానికి తెగబడ్డారు. పార్క్‌లోకి చొరబడి ఓ మగ రైనోను చంపేసి దాని కొమ్మును కోసుకొని పారిపోయారు. తుపాకుల చప్పుళ్లు విని అధికారులు అక్కడి వచ్చేలోగానే ఆ దొంగలు దాని కళేబరాన్ని అక్కడ వదిలేసి కొమ్ముతో పరారైపోయారు. తిరిగి ఎప్పటిలాగానే ఘటనా స్థలి వద్ద చనిపోయి పడిఉన్న ఖడ్గమృగం, ఖాళీ బుల్లెట్లు లభించాయి. దీంతో, మరోసారి పార్క్ సంరక్షణ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభమై నెల రోజులు పూర్తికాకుండానే వరుసగా ఇది మూడో ఘటన. మొత్తం పన్నెండు నెలలు పరిగణనలోకి తీసుకుంటే ఇది 20వ ఘటన. అంటే 20 ఖడ్గమృగాలను దారుణంగా చంపేశారన్నమాట. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే అధికారులు జాతీయ పార్క్‌పై నియంత్రణ కోల్పోయి దొంగలను అదుపుచేయలేకపోయారనే అనుమానం కలుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. -
మరో రైనోను చంపేశారు!
గౌహతి: ప్రపంచ చారిత్రక ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన అసోంలోని ఖజిరాంగా నేషనల్ పార్క్‌లో మరో ఒంటి కొమ్ము రైనోను వేటగాళ్లు పొట్టన పెట్టుకున్నారు. పార్క్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రైనో మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారని పార్క్ డైరెక్టర్ ఎంకె యాదవ్ తెలిపారు. నాటు తుపాకీ గాయంతో పాటు, రైనో కొమ్ము కనిపించకపోవడంతో ఇది అక్రమ వేటగాళ్ల పనేనని పార్క్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రపంచంలో ఉన్న ఒంటి కొమ్ము రైనోలు దాదాపు 70 శాతం ఖజిరాంగా పార్క్‌లోనే ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీతీరంలో సుమారు 858 చదరపు కి.మీ.పరిధిలో విస్తరించి ఉన్న ఈ జాతీయ పార్క్‌లో ఈ సంవత్సరంలో గత జనవరి నుంచి 12 రైనోసార్లు హత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. -
కజిరంగా పార్క్ లో అమీర్ ఖాన్, కరణ్ జోహార్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ లు అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు. అమీర్ వెంట ఆయన సతీమణి కిరణ్ రావ్, కుమారుడు ఆజాద్ లు ఉన్నారు. తొలిసారి అసోంలో పర్యటిస్తున్న అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. రైనో ఖడ్గ మృగాల సంరక్షణకు కజిరంగా అధికారులు తీసుకుంటున్న కృషిని అమీర్ ప్రశంసించారు. రైనో ఖడ్గమృగాల సంరక్షణ కోసం ఓ డాక్యుమెంటరీని తీయడానికి ప్రయత్నిస్తా అని అన్నారు. తన భార్య కిరణ్ పుట్టిన రోజున ఆశ్చర్యం కలిగించే విధంగా అసోం పర్యటనకు ప్లాన్ చేశాను అని అన్నారు. అసోం ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన అపూర్వ స్వాగతం తనకు ఆనందం కలిగించింది అని అన్నారు. రైనోలను చూడటానికి అధికారులు తోడుండగా కిరణ్, కరణ్, ఆజాద్ లతో కలిసి జీప్ లో సఫారీకి వెళ్లారు. -
అసోంలో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ పుట్టిన రోజు వేడుక
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ లు అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు. అమీర్ వెంట ఆయన సతీమణి కిరణ్ రావ్, కుమారుడు ఆజాద్ లు ఉన్నారు. అమీర్ ఖాన్ భార్య కరణ్ జోహార్ పుట్టిన రోజున ఆశ్చర్యం కలిగించే విధంగా అసోం పర్యటనకు ప్లాన్ చేశాను అని అన్నారు. అసోం ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన అపూర్వ స్వాగతం తనకు ఆనందం కలిగించింది అని అన్నారు. రైనోలను చూడటానికి అధికారులు తోడుండగా కిరణ్, కరణ్, ఆజాద్ లతో కలిసి జీప్ లో సఫారీకి వెళ్లారు.