ప్రస్తుతం భూమి మీద ప్రాణాలతో ఉన్న ఖడ్గమృగాల్లో మూడింట రెండొంతులు నివసించేది అక్కడే. అత్యధికంగా ఖడ్గమృగాలు హత్యకు గురవుతున్నది కూడా అక్కడే. అది ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. ఇంకా ఎన్నో విశిష్టతలున్న ఆ చోటు అసోంలోని కజిరంగా జాతీయపార్కు. అరుదైన ఖడ్గమృగాలు, పక్షిజాతులకు నివాసస్థావరం. గడిచిన కొద్దికాలంగా పేట్రేగిపోతోన్న స్మగ్లర్ల బారి నుంచి జంతువులను కాపాడేందుకు సుశిక్షితులైన రేంజర్లను నియమించారు పార్కు అధికారులు. అలా నియమితుడైన ఓ రేంజర్ కు శుక్రవారం గొప్ప చిక్కొచ్చిపడింది.
వాహనాలు వినియోగిస్తే స్మగ్లర్లు పారిపోయే అవకాశం ఉంటుందికాబట్టి కాలినడకన పార్కులో కలియదిరగడం రేంజర్ల విధి. అలా తన విధులు నిర్వహిస్తోన్న రేంజర్.. ఓ భారీ ఖడ్గమృగం కంటబడ్డాడు. పైగా అది పిల్ల తల్లి కూడా. సహజంగానే పిల్లతల్లులైన జంతువులు మిగతా సమయాల్లోకంటే ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రేంజర్ ను చూసిన ఖడ్గమృగం, అతను ఎక్కడ తన పిల్లకు, తనకు హాని చేస్తాడేమోనని కంగారుపడింది. ఆ కంగారు కాస్తా కోపంగామారి రేంజర్ వైపు గుర్రుగా దూసుకొచ్చింది. దిక్కుతోచని రేంజర్ పక్కనే ఉన్న చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.
నిజానికి ఆ చెట్టును కూల్చేసి, అతణ్ని చంపడం ఖడ్గమృగానికి పెద్ద పనేంకాదు. కానీ దాని లక్ష్యం పిల్లల్ని కాపాడుకోవటమేకాబట్టి దారి దొరకగానే పిల్లతోసహా తన దారినతాను వెళ్లిపోయింది. అదే పార్కులో తిరుగాడుతోన్న కౌషల్ బొరువా అనే జంతుశాస్త్రవేత్త ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డతర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉందని ఆ రేంజర్ ను అడిగితే..'చావుతో సెల్ఫీ దిగినంత పనైంది' అని బదులిచ్చాడు.
చావుతో సెల్ఫీ దిగినంత పనైంది!!
Published Fri, Apr 1 2016 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement