కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
అసోం: కజిరంగా జాతీయ పార్క్‌లో ఖడ్గమృగాలకు రక్షణ కరువైంది. ఎంతో అరుదైన ఈ అటవీ జంతువుల మరణ మృదంగం దొంగల దాడుల రూపంలో మారుమ్రోగుతోంది. కరడుగట్టిన దొంగలు ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఇప్పటి వరకు 20 ఖడ్గ మృగాల ప్రాణాలను తీసి వాటి కొమ్ములను ఎత్తుకెళ్లారు. కాగా, తాజాగా మరోసారి దొంగలు అదే అఘాయిత్యానికి తెగబడ్డారు. పార్క్లోకి చొరబడి ఓ మగ రైనోను చంపేసి దాని కొమ్మును కోసుకొని పారిపోయారు.
తుపాకుల చప్పుళ్లు విని అధికారులు అక్కడి వచ్చేలోగానే ఆ దొంగలు దాని కళేబరాన్ని అక్కడ వదిలేసి కొమ్ముతో పరారైపోయారు. తిరిగి ఎప్పటిలాగానే ఘటనా స్థలి వద్ద చనిపోయి పడిఉన్న ఖడ్గమృగం, ఖాళీ బుల్లెట్లు లభించాయి. దీంతో, మరోసారి పార్క్ సంరక్షణ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభమై నెల రోజులు పూర్తికాకుండానే వరుసగా ఇది మూడో ఘటన. మొత్తం పన్నెండు నెలలు పరిగణనలోకి తీసుకుంటే ఇది 20వ ఘటన. అంటే 20 ఖడ్గమృగాలను దారుణంగా చంపేశారన్నమాట. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే అధికారులు జాతీయ పార్క్పై నియంత్రణ కోల్పోయి దొంగలను అదుపుచేయలేకపోయారనే అనుమానం కలుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.