దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు.
ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు.
సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment