'పర్వాలేదు.. మా బిడ్డలాంటివాడేలే'
కజిరంగా: పసివాళ్లు దేవుళ్లు అంటారు. దేవుడంటే అందరినీ సమాన దృష్టితో చూసేవాడని చెప్తారు. చిన్నాపెద్ద, బీద, ధనిక బేధాలు అస్సలు ఆయనకు ఉండవని అంటుంటారు. అది నిజమేనేమో అని సంఘటన చూస్తే అర్థం అవుతుంది. సాధరణంగా రాజు, రాణి అనగానే మన మనసులో ఓభయం పొర్లుతుంది. లేదంటే ఏదో తెలియని ఆత్మన్యూనత వారికి దూరంగా ఉండేలా చేస్తుంది. కానీ అసోంలో మూడేళ్ల బాలుడికి మాత్రం వారిద్దరు అందరిలాంటి మాములు మనుషులుగానే కనిపించారేమో.. ఏకంగా వారి కాళ్లను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. అది ఒక్కసారి కాదు.. తన ప్రదర్శన అయిపోయేవరకు.
బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్‌లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన విషయం తెలిసిదే. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉండటంతో గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, చూశారు. అయితే, అంతకుముందు కేట్ దంపతులకు పార్క్లోకి స్వాగతం చెప్పేందుకు కొంతమంది సంప్రదాయ నృత్యం చేసేవారిని అక్కడికి పిలిపించారు. వీరిలో కాంఖాన్ బారువా మూడేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. తన తల్లిదండ్రుల మాదిరిగానే ముచ్చటగొలిపే వేషధారణలో వచ్చి చక్కగా డప్పు దరువుకు నృత్యం చేశాడు.
చేస్తూ చేస్తూ ఏమాత్రం భయపడకుండా కేట్ దంపతుల కాళ్లను తొక్కాడు. అది కూడా కావాలని అల్లరిఅల్లరిగా పదేపదే తొక్కాడు. అయితే, వాళ్లిద్దరు రాజు, రాణి కావడంతో భయపడిన తల్లిదండ్రులు తమ బిడ్డ తరుపున క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ పిల్లాడి చిందులు చూసి ముచ్చటపడిన విలియం, కేట్ ఏం పర్వాలేదని, కాంఖాన్ తమ కుమారుడు జార్జ్ని గుర్తు చేశాడని, కాంఖాన్ కూడా తమకు జార్జ్ మాదిరిగానే అని చెప్పారు. అతడిని ఆ ఇద్దరు దంపతులు తీసుకొని ముద్దుచేశారు. అతడి డ్యాన్స్కు మురిసిపోయి తెగ చప్పట్లుకొట్టేశారు.