మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.
యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.
నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.
‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి.
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! యువరాణి రాసిన మందు చీటీ
Published Sun, Nov 3 2024 4:46 AM | Last Updated on Sun, Nov 3 2024 9:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment