చికిత్స అందించిన ఆస్పత్రిని సందర్శించిన బ్రిటన్ యువరాణి
లండన్: తాను కేన్సర్‌ను జయించానని బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రకటించారు. తనకు కేన్సర్ చికిత్స అందించిన లండన్‌లోని రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. గత ఏడాది కాలంగా తనను సేవలందించిన నేషనల్ హెల్త్ సర్విస్ (ఎన్హెచ్‌ఎస్) సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కాలంగా విలియం, నాతో కలిసి నిశ్శబ్దంగా నడిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక రోగిగా ఈ కాలంలో నేను అసాధారణమైన సంరక్షణ, సలహాలు పొందాను. ఎంతో ఉపశమనం పొందాను. కేన్సర్‌ను అనుభవించినవారికే ఇది తులుస్తుంది. ఇప్పుడు కోలుకోవడంపై దృష్టి పెట్టాను. ఈ సంవత్సరం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’’అని కేట్ ప్రకటించారు. మార్చిలో తాను కేన్సర్‌కు కీమో థెరపీ చికిత్స చేయించుకున్నట్లు కేట్ వెల్లడించారు.
గత గురువారం 43వ పుట్టిన రోజు జరుపుకొన్న కేట్.. ‘‘అద్భుతమైన భార్య, తల్లి. గత ఏడాది కాలంగా మీరు చూపించిన బలం అమోఘం’’అని ప్రిన్స్ విలియం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కేన్సర్ ఆసుపత్రిగా రాయల్ మార్స్‌డెన్‌ను 1851లో ప్రారంభించారు. దీనికి బ్రిటన్ రాజవంశీయులు దాతలుగా ఉన్నారు. దీనికి 2007 నుంచి ప్రిన్స్ విలియం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో వేల్స్ యువరాణి అయిన అతని తల్లి డయానా ఈ పాత్రను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment