‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీలో ఓ దృశ్యం; నిషా పహూజా
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు.
ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’.
‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు.
అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది.
బాధితులు పోరాడాల్సిందే
‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది.
అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది.
స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు
55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది.
భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment