పాప్ పవర్‌హౌజ్ టేలర్ స్విఫ్ట్ పేరు పలికితే ‘రికార్డ్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. 2024 గ్రామీ అవార్డ్‌లలో టేలర్ ఆల్బమ్ ‘మిడ్‌నైట్స్’ ‘బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. దీంతో బెస్ట్ ఆల్బమ్ విభాగంలో వరుసగా నాలుగు సార్లు అవార్డ్ గెల్చుకున్న తొలి మహిళా గాయనిగా రికార్డ్ సృష్టించింది టేలర్ స్విఫ్ట్....
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారు. పలుకే కాదు... పాట కూడా పాడుతుంది అనుకోవచ్చు. అయితే అందరి విషయంలోనూ ఇది నిజం కాకపోవచ్చు. టేలర్ స్విఫ్ట్ విషయంలో మాత్రం అక్షరాలా నిజమైంది. ‘పెన్సిల్వేనియాలోని రీడింగ్ హాస్పిటల్‌లో పుట్టిన టేలర్ పుట్టగానే ఏడ్చింది అంటే నేను నమ్మను.
పుట్టగానే తీయగా పాట పాడి ఉంటుంది’ అని ఆమె అభిమానులు చమత్కరిస్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ఇల్లంతా సంగీతమే’ అన్నట్లుగా ఉండేది టేలర్ ఇల్లు. తండ్రి స్కాట్ కింగ్స్ లీ స్విఫ్ట్ స్టాక్‌బ్రోకర్. సంగీతప్రేమికుడు. తల్లి ఆండ్రియా స్విఫ్ట్ మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఆ తరువాత ఇంటికే పరిమితమైంది. ఆండ్రియా గాయకురాలు. టేలర్ తమ్ముడు నటుడు. అమ్మమ్మ ఒపెరా సింగర్.
తొమ్మిదేళ్ల వయసు నుంచి పాటలతో ప్రయాణం మొదలుపెట్టింది టేలర్. పాటలోనే కాదు నటనలోనూ అద్భుతమైన ప్రతిభ చూపేది. స్థానిక పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో టేలర్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. షానియా ట్వైన్ పాటలతో స్ఫూర్తి పొందిన టేలర్ జానపదాలను ఇష్టపడింది. పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు స్థానిక కళాకారుడు రోనీ క్రీమర్ నుంచి గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాసే విషయంలో కూడా రోనీ క్రీమర్ టేలర్‌కు సహాయపడేవాడు. కెరీర్ ప్రారంభంలోనే టేలర్ అనుభవజ్ఞులైన సంగీతకారులు, గేయ రచయితలతో కలిసి పనిచేసింది.
ప్రపంచంలోని ప్రముఖులతో పోటీ పడి టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్–2023’కు ఎంపికైంది. గత సంవత్సరం యూఎస్ ఎకనామిక్ రిపోర్ట్‌లో టేలర్ ప్రస్తావన కనిపించింది. ‘పాప్ సింగర్ ప్రస్తావన ఈ రిపోర్ట్‌లో ఎందుకు వచ్చింది!’ అని చాలామంది ఆశ్చర్యపోయారు.‘ íఫిలడెల్ఫియాలో టేలర్ షోలకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. బుకింగ్స్‌తో హోటళ్లు కిటకిటలాడిపోయాయి. ఒక్క నెలలోనే హోటళ్ల ఆదాయం భారీగా పెరగడానికి కారణం టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన అభిమానులు’ అంటూ ఆ రిపోర్ట్‌లో టేలర్ స్విఫ్ట్ ప్రస్తావన కనిపిస్తుంది.
నిద్రలేని రాత్రుల మిడ్‌నైట్స్
‘నా నిద్రలేని రాత్రుల నుంచి వచ్చిన ఆల్బమ్ ఇది’ అని ‘మిడ్‌నైట్స్’ గురించి అంటోంది టేలర్ స్విఫ్ట్. ‘మిడ్‌నైట్స్’ను కాన్సెప్ట్ ఆల్బమ్‌గా రూపొందించింది. ఈ ఆత్మకథాత్మక గీతరచనలో పశ్చాత్తాపం నుంచి స్వీయ విమర్శ వరకు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. పాటల రచన, సంగీత నిర్మాణానికి సంబంధించి ‘మిట్‌నైట్ ఆల్బమ్’ను విశ్లేషకులు ఆకాశాని కెత్తారు. తన గత ఆల్బమ్‌లతో పాటు ‘మిడ్‌నైట్స్’ను ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు వినిపించడానికి ఎరాస్ టూర్ (2023–2024)ని మొదలు పెట్టింది టేలర్ స్విఫ్ట్.
Comments
Please login to add a commentAdd a comment