Grammy Awards
-
చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!
2024 గ్రామీ అవార్డుల్లో మన భారతీయ సంగీత దిగ్గజాలకు చెందిన దిస్ మూమెంట్ (శక్తి ఆల్బమ్) అవార్డు గెల్చుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పలువురు లెజెండ్స్ కూడా జాకీర్ హుస్సేన్, శంకర్‌మహదేవన్ బృందంపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. దిగ్గజ స్వరకర్త, రవిశంకర్ మన దేశానికి తొలి గ్రామీ అవార్డును అందించిన ఘనతను సాధించారు. మరి గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా? ఇపుడిదే నెట్టింట ఆసక్తి కరంగా మారింది. మరి ఆమె ఎవరు? ఏ విభాగంలో గ్రామీ గెల్చుకుంది అనే వివరాలను ఒకసారి చూద్దాం. 25 ఏళ్లకేగ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ, చెన్నైకి చెందిన గాయని తన్వీషా. 2010లో లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్లో జరిగిన 52వ గ్రామీ అవార్డుల్లో ఆమె ఈ అవార్డును గెల్చుకున్నారు. బాలీవుడ్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్ పాట " జై హో "కోసం స్పానిష్ సాహిత్యాన్ని అందించినందుకు ఉత్తమ పాట అవార్డు దక్కించుకున్నారు. ప్రముఖ గాయకుడు, స్వరకర్త, AR రెహమాన్, గీత రచయిత గుల్జార్‌తో అవార్డును పంచుకుంది. ఈ అవార్డు తన్వి కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. గ్రామీతో పాటు, ఆమె లండన్‌లో 2009లో BMI అవార్డును కూడా అందుకుంది. తన్వీషా డిసెంబర్ 1, 1985న తమిళనాడులో జన్మించింది. చాలా తక్కువ వ్యవధిలో భారతీయ సంగీత పరిశ్రమలో బాగా పాపులర్ అయిన తన్వీషా అనుకోకుండా సింగర్‌గా మారింది. రెహమాన్‌తో యువ మూవీ ‘ఫనా’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మాత్రమే సంగీతంలో శిక్షణ తీసుకొని మరింత రాటు దేలింది. తమిళం, హిందీ , తెలుగు భాషల్లో ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంది. ఎళుతు చిత్రం కోసం "యక్కై తిరి" మొదలు ఫనా, పప్పు కాన్ట్ డ్యాన్స్, రెహ్నా తూ, బూమ్ బూమ్ రోబోడా, మవ్వాలి కవ్వాలి, కేదా కారి లాంటి పాటలతో బాగా పేరు తెచ్చుకుంది. అలాగే స్పానిష్ , పోర్చుగీస్ భాషలతో పాటు అరబిక్‌లో కూడా పాడింది. గ్రామీ అవార్డు తరువాత యువన్ శంకర్ రాజా , అమిత్ త్రివేది లాంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా మెరిసింది. ఐకానిక్ అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్‌తో కలిసి స్నూప్ డాగ్ మిలియనీర్ పాట, జెరెమీ హాకిన్స్, చే పోప్, డేవిడ్ బాటియో లాంటి మరెన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో పాపులర్ అయింది. స్కిన్‌కేర్ బ్రాండ్ తాన్షా స్టూడియోస్‌కు నాంది తన్వి షా అద్భుతమైన ప్రతిభావంతులైన గాయని మాత్రమే కాదు, తాన్షా స్టూడియోస్ అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త కూడా. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. చెమట, దుర్వాసనకు సంబంధించిన సమస్యలతో బాధపడేదట తన్వీ. దీని చికిత్సకు స్టెరాయిడ్లను వాడాలని వైద్యులు సూచించడంతో ఎలాంటి హాని లేని కొత్త బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దీంతో సహజ చర్మ సంరక్షణకోసం సల్ఫేట్లు, పారాబెన్స్, అల్యూమినియం లాంటి ప్రమాదకర రసాయనాలు లేని తాన్షాను బ్రాండ్‌ను తీసుకొచ్చింది. -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
గ్రామీ అవార్డుల పంట!
సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు. విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్‌లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్‌కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి. ఇదే ఆల్బమ్‌కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది. ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు. అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి. విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్‌కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందటమే కాదు... ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్ది. తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది. అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్‌ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత. ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు. -
Taylor Swift: జనం మెచ్చిన పాప్ ప్రభంజనం
పాప్ పవర్‌హౌజ్ టేలర్ స్విఫ్ట్ పేరు పలికితే ‘రికార్డ్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. 2024 గ్రామీ అవార్డ్‌లలో టేలర్ ఆల్బమ్ ‘మిడ్నైట్స్’ ‘బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. దీంతో బెస్ట్ ఆల్బమ్ విభాగంలో వరుసగా నాలుగు సార్లు అవార్డ్ గెల్చుకున్న తొలి మహిళా గాయనిగా రికార్డ్ సృష్టించింది టేలర్ స్విఫ్ట్.... ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారు. పలుకే కాదు... పాట కూడా పాడుతుంది అనుకోవచ్చు. అయితే అందరి విషయంలోనూ ఇది నిజం కాకపోవచ్చు. టేలర్ స్విఫ్ట్ విషయంలో మాత్రం అక్షరాలా నిజమైంది. ‘పెన్సిల్వేనియాలోని రీడింగ్ హాస్పిటల్లో పుట్టిన టేలర్ పుట్టగానే ఏడ్చింది అంటే నేను నమ్మను. పుట్టగానే తీయగా పాట పాడి ఉంటుంది’ అని ఆమె అభిమానులు చమత్కరిస్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ఇల్లంతా సంగీతమే’ అన్నట్లుగా ఉండేది టేలర్ ఇల్లు. తండ్రి స్కాట్ కింగ్స్ లీ స్విఫ్ట్ స్టాక్‌బ్రోకర్. సంగీతప్రేమికుడు. తల్లి ఆండ్రియా స్విఫ్ట్ మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఆ తరువాత ఇంటికే పరిమితమైంది. ఆండ్రియా గాయకురాలు. టేలర్ తమ్ముడు నటుడు. అమ్మమ్మ ఒపెరా సింగర్. తొమ్మిదేళ్ల వయసు నుంచి పాటలతో ప్రయాణం మొదలుపెట్టింది టేలర్. పాటలోనే కాదు నటనలోనూ అద్భుతమైన ప్రతిభ చూపేది. స్థానిక పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో టేలర్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. షానియా ట్వైన్ పాటలతో స్ఫూర్తి పొందిన టేలర్ జానపదాలను ఇష్టపడింది. పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు స్థానిక కళాకారుడు రోనీ క్రీమర్ నుంచి గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాసే విషయంలో కూడా రోనీ క్రీమర్ టేలర్‌కు సహాయపడేవాడు. కెరీర్ ప్రారంభంలోనే టేలర్ అనుభవజ్ఞులైన సంగీతకారులు, గేయ రచయితలతో కలిసి పనిచేసింది. ప్రపంచంలోని ప్రముఖులతో పోటీ పడి టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్–2023’కు ఎంపికైంది. గత సంవత్సరం యూఎస్ ఎకనామిక్ రిపోర్ట్‌లో టేలర్ ప్రస్తావన కనిపించింది. ‘పాప్ సింగర్ ప్రస్తావన ఈ రిపోర్ట్‌లో ఎందుకు వచ్చింది!’ అని చాలామంది ఆశ్చర్యపోయారు.‘ íఫిలడెల్ఫియాలో టేలర్ షోలకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. బుకింగ్స్‌తో హోటళ్లు కిటకిటలాడిపోయాయి. ఒక్క నెలలోనే హోటళ్ల ఆదాయం భారీగా పెరగడానికి కారణం టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన అభిమానులు’ అంటూ ఆ రిపోర్ట్‌లో టేలర్ స్విఫ్ట్ ప్రస్తావన కనిపిస్తుంది. నిద్రలేని రాత్రుల మిడ్నైట్స్ ‘నా నిద్రలేని రాత్రుల నుంచి వచ్చిన ఆల్బమ్ ఇది’ అని ‘మిడ్నైట్స్’ గురించి అంటోంది టేలర్ స్విఫ్ట్. ‘మిడ్నైట్స్’ను కాన్సెప్ట్ ఆల్బమ్‌గా రూపొందించింది. ఈ ఆత్మకథాత్మక గీతరచనలో పశ్చాత్తాపం నుంచి స్వీయ విమర్శ వరకు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. పాటల రచన, సంగీత నిర్మాణానికి సంబంధించి ‘మిట్నైట్ ఆల్బమ్’ను విశ్లేషకులు ఆకాశాని కెత్తారు. తన గత ఆల్బమ్‌లతో పాటు ‘మిడ్నైట్స్’ను ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు వినిపించడానికి ఎరాస్ టూర్ (2023–2024)ని మొదలు పెట్టింది టేలర్ స్విఫ్ట్. -
శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్ హుస్సేన్(తబలా),శంకర్ మహదేవన్ (సింగర్)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Congratulations @ZakirHtabla, @Rakeshflute, @Shankar_Live, @kanjeeraselva, and @violinganesh on your phenomenal success at the #GRAMMYs! Your exceptional talent and dedication to music have won hearts worldwide. India is proud! These achievements are a testament to the hardwork… — Narendra Modi (@narendramodi) February 5, 2024 దిస్ మూమెంట్ పాటను జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతకు ముందు.. శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. -
ఆ సింగర్ డ్రెస్‌తో గూగుల్‌కు లక్షల కోట్ల ఆదాయం?
గూగుల్.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ చిన్న గ్యారేజీలో ప్రారంభమై నేడు 200లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది. 50 దేశాల్లో 70 కార్యాలయాల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1998లో ప్రారంభమైన గూగుల్..ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆ సంస్థ ఎదిగిన తీరు అనిర్వచనీయం. అలాంటి టెక్ దిగ్గజం పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి , ఆర్ధికంగా ఎదిగేందుకు పరోక్షంగా ఓ సింగర్ ధరించిన డ్రెస్సేనంటే మీరు నమ్ముతారా? ఇద్దరు విద్యార్ధుల ఆలోచనే గూగుల్ 1995లో అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివే సమయంలో విద్యార్ధులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు గూగుల్‌కు ప్రాణం పోశారు. కానీ వారి ఆలోచనని ఆచరణలోకి పెట్టేందుకు మూడేళ్లు పట్టింది. సెప్టెంబర్ 4, 1998లో దాని (గూగుల్) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట గూగుల్ సెర్చిఇంజిన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్ధులకు కావాల్సిన యూనివర్సిటీలు, కాలేజీ వివరాలు లభ్యమయ్యేవి. ఆ తర్వాత మెల్లగా ఇతర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని యూజర్లు పొందే అవకాశాన్ని కల్పించింది. ఆశించిన స్థాయిలో లేక రోజులు గడుస్తున్నాయి. గూగుల్‌కు వచ్చే యూజర్లు, పనిచేసే ఉద్యోగులు పెరుగుతూ వస్తున్నారు. కానీ గూగుల్ స్థాపించిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లకు మాత్రం వాళ్లు ఆశించిన స్థాయిలో గూగుల్‌కు అనుకున్నంత పేరు రావడం లేదని నమ్ముతుండేవారు. అప్పుడే గూగుల్‌పై వాళ్లకున్న నమ్మకాన్ని పటాపంచలు చేసేలా ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో సింగర్ డ్రెస్ ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఆమె పేరు మారు మ్రోగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమె ధరించిన డ్రెస్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అదే విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు గూగుల్ సెర్చింజిన్కు పోటెత్తారు. చివరికి ఏమైందంటే? జెన్నిఫర్ లోపెజ్ అందంగా ఉన్న అమ్మాయిని చాలామంది జెన్నిఫర్ లోపెజ్‌తో పోల్చుతుంటారు. అంతెందుకు.. ‘జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ...’ అంటూ టాలీవుడ్లో ఓ సాంగ్ కూడా పాడేసుకున్నారు. ఔను మరి.. జెలో మామూలు అందగత్తె కాదుగా! ఆ మాటకొస్తే పాప్ ప్రపంచంలో తనని నేచురల్ బ్యూటీ, కాంతివంతమైన చర్మం ఉన్న సింగర్‌గా చెబుతుంటారు. అందుకే ఆమె పాట, ఆట, నటనకంటే అందానికే ఫ్యాన్స్ ఎక్కువ. రెడ్ కార్పెట్ మీద హొయలొలుకుతూ సంగీత ప్రపంచాన్ని తమ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన కళాకారులకు ది రికార్డింగ్ అకాడమీ ప్రతి ఏడాది గ్రామీ అవార్డ్‌లను ప్రధానం చేస్తుంది. అయితే, ప్రతిసారి జరిగినట్లే 2001లో గ్రామీ అవార్డుల ప్రధానం జరిగింది. ఆ ఈవెంట్‌కు జెన్నీఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించి రెడ్ కార్పెట్ మీద హొయలొలుకుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అంతే ఆ ఫోటోల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు జెన్నీ డ్రెస్ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికారు. యూజర్ల తాకిడికి దీంతో గూగుల్ సైట్ సైతం స్తంభించిపోయింది. ఈ ఊహించని పరిణామానికి గూగుల్ ఫౌండర్లు సైతం ఆనందంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. గూగుల్ పేరు మారు మ్రోగింది గూగుల్ పేరు సైతం మారు మ్రోగింది. గూగుల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. అప్పుడే గూగుల్ ఫౌండర్లకు ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. గూగుల్ ఇమేజెస్ అనే టూల్‌ను లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఇందుకోసం ముందుగా గూగుల్ ఇమేజెస్ టూల్‌ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. పనితీరు ఎలా ఉంటుందా? అని టెస్ట్ చేశారు. ఐడియా సూపర్ హిట్ అయ్యింది. ఆదాయం అనూహ్యంగా ఆ తర్వాత ఏడాది 2001లో గూగుల్ గూగుల్ ఇమేజ్ అనే టూల్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ఇమేజ్ అనే టూల్ .. గూగుల్ ఇమేజ్‌నే మార్చేసింది. యూజర్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి.. లక్షల నుంచి కోట్లకి చేరింది. గూగుల్‌లో అడ్వటైజ్మెంట్స్ పెరిగాయి. ఆదాయ మార్గాలకు కొదువలేకుండా పోయింది. థ్యాంక్స్ టూ జెన్నిఫర్ లోపెజ్ గూగుల్ ఇమేజెస్, యాప్స్, మ్యాప్స్, బిజినెస్ లిస్టింగ్ ఇలా అన్నింట్లో గూగుల్ ఇమేజ్ అనే టూల్ ఆ సంస్థ స్వరూపానే మార్చేసింది. సెర్చ్ ఇంజిన్ సంపాదనలో 80 శాతం ఈ గూగుల్ ఇమెజ్ టూల్ వల్లే వస్తుంది. ఇలా ప్రపంచంలో తనతో ఏ ఇతర టెక్ కంపెనీ కూడా పోటీ పడలేని స్థాయికి చేరింది. కాబట్టే పరోక్షంగా తమ విజయానికి కారణమైన జెన్నిఫర్ లోపెజ్కు గూగుల్ ఫౌండర్లు సందర్భానుసారం కృతజ్ఞతలు చెబుతుండడం విశేషం. -
Chandrika Tandon: తేజో చంద్రిక
ఆరోజు... ‘అలాగే’ అని తల ఆడించి ఉంటే ‘పవర్ఫుల్ ఉమన్’గా ప్రపంచవ్యాప్తంగా చంద్రిక పేరు తెచ్చుకునేది కాదు. ‘ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండలేను’ అని భయపడి ఉండే ఉద్యోగజీవితంలోకి వచ్చేది కాదు. తనను తాను నిరూపించుకునేది కాదు. ‘లాయర్ కావాలనుకున్నాను. ఈ ఉద్యోగం ఏమిటి’ అని నిట్టూర్చి ఉంటే చంద్రిక కొత్త శిఖరాలు అధిరోహించేది కాదు. ‘ఉద్యోగ జీవితానికే టైమ్ లేదు. ఇక సంగీతానికి స్థానం ఎక్కడ’ అని సర్దుకుపోయి ఉంటే సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకునేది కాదు. ప్రపంచ గుర్తింపు పొందిన బిజినెస్ లీడర్, గ్రామీ–నామినేట్ ఆర్టిస్ట్‌గా, దాతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది చంద్రిక.... ‘అవసరం లేదు’ ఒక మాటలో తేల్చేసింది అమ్మ. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీలో చేరాలనుకుంటున్న చంద్రికకు ఆ మాట శరాఘాతం అయింది. ‘ఆ కాలేజీలో తక్కువమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే’ అన్నది అమ్మ. చంద్రిక చాలా సేపు అమ్మతో వాదించినా ఫలితం కనిపించలేదు. ఇంట్లోనే నిరాహార దీక్ష చేసింది. దీంతో చంద్రిక మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదవడానికి తల్లి ఒప్పుకోక తప్పింది కాదు. మూడు సంవత్సరాల కాలేజీ జీవితం చంద్రిక జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. సంగీతప్రపంచంతో అనుబంధానికి, సింగర్‌గా పేరు తెచ్చుకోవడానికి కారణం అయింది. డిగ్రీలో చేరడమే కష్టం అనుకున్న చంద్రిక ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ చేరడం పెద్ద విజయం. నిజానికి చంద్రికకు బిజినెస్ ప్రపంచంపై పెద్దగా ఆసక్తి లేదు. తాతలాగే లాయర్ కావాలనుకుంది. అయితే ప్రొఫెసర్ స్వామినాథన్ సూచన మేరకు బిజినెస్ స్కూల్లో చేరింది. మొదటి కొన్నిరోజులు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సొంత ఊరు దాటి అంత దూరం రావడం అదే మొదటిసారి. ఆ ఒంటరితనానికి దూరం కావడానికి సంగీతానికి దగ్గరైంది. చంద్రిక తొలి ఉద్యోగం సిటీబ్యాంక్‌లో. బ్యాంకర్ కావాలని కలలో కూడా అనుకోని చంద్రికకు ఇది వింతగా అనిపించింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం లెబనాన్‌లోని బీరుట్ వెళ్లింది. యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడకు వెళ్లింది. అక్కడ అయిదు నెలల పాటు ఉంది. సిటీబ్యాంక్ తరువాత వేరే సంస్థల నుంచి చంద్రికకు అవకాశాలు రావడం మొదలైంది. అలా అమెరికాలోకి అడుగు పెట్టింది. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన సంగీతప్రపంచాన్ని మాత్రం చంద్రిక విడిచి బయటికి రాలేదు. ఎన్నో ఆల్బమ్స్ ద్వారా సక్సెస్ఫుల్ మ్యూజిషియన్‌గా తనను తాను నిరూపించుకుంది. సెకండ్ ఆల్బమ్ ‘సోల్ కాల్’ గ్రామీ అవార్డ్–బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయింది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మకెంజీకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పార్ట్నర్గా అరుదైన ఘనత సాధించింది. అడ్వైజరీ సంస్థ ‘టాండన్ క్యాపిటల్స్ అసోసియేషన్స్’ ప్రారంభించి సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయాణంలో చంద్రికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కుటుంబజీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అందులో ఒకటి. అయితే ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకు వెళ్లింది. సవాలు ముందుకు వచ్చినా, ఒత్తిడి తలలో దూరినా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం సంగీతం. పాటలు వినడం, పాడడం తనకు ఎంతో ఇష్టం. అదే తన బలం. తాజాగా ‘అమ్మూస్ ట్రెజరర్స్’ ఆల్బమ్‌తో ముందుకు వచ్చింది చంద్రిక. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్. -
వైరల్ జయహే!
గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్ లండన్‌లోని ప్రసిద్ధ అబేరోడ్ స్టూడియోస్‌లో మన జాతీయ గీతానికి సంబంధించి 100 మందితో లార్జెస్ట్ ఆర్కెస్ట్రాను నిర్వహించి రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియోకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. ‘చారిత్రాత్మకమైన 100 పీస్ బ్రిటిష్ ఆర్కెస్ట్రాను నిర్వహించినందుకు మ్యూజిక్ కంపోజర్‌గా గర్విస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియోను ఎంతోమందికి షేర్ చేశాను. యూజ్ ఇట్, షేర్ ఇట్, వాచ్ ఇట్... బట్ విత్ రెస్పెక్ట్’ అంటూ ట్విట్టర్లో రాశాడు రికీ కేజ్. ‘వండర్ఫుల్’ అంటూ ఈ వీడియోను రీషేర్ చేశారు ప్రధాని మోదీ. -
కోలాహలంగా 65వ గ్రామీ అవార్డుల వేడుక (ఫొటోలు)
-
Grammy Awards 2023: నవరాగాల తేజం..రిక్కీ కేజ్
గత సంవత్సరం గ్రామీ గెలుచుకున్న తరువాత లాస్ వేగాస్లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యు బాల్రూమ్లో భారతీయత ఉట్టిపడేలా ‘నమస్తే’ అంటూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. భారతీయత అతడి బలం. తనను ముందుకు నడిపించే ఇంధనం. లాస్ ఏంజెల్స్(యూఎస్) మైక్రోసాఫ్ట్ థియేటర్లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన 65 వ గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి ‘గ్రామీ’ అవార్డ్‌ను అందుకున్నాడు రిక్కీ కేజ్. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో గ్రామీ దక్కింది. రిక్కీకి కెరీర్లో ఇది మూడో గ్రామీ... సంగీతరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్‌ను ముచ్చటగా మూడోసారీ సొంతం చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. 2015లో అమెరికన్ రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌కు తొలిసారిగా గ్రామీ అవార్డ్ దక్కింది. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు మూడోసారి గ్రామీ అవార్డ్ (బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగం)లో అందుకున్నాడు రిక్కీ. గత సంవత్సరం ఇదే ఆల్బమ్ ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో రెండోసారి గ్రామీ దక్కింది. డివైన్ టైడ్స్... ప్రకృతి ప్రపంచానికి నివాళి. ఈ ఆల్బమ్‌లో తొమ్మిది పాటలు ఉన్నాయి. మన హిమాలయాల అందాల నుంచి స్పెయిన్ అరణ్యాల అందాల వరకు మ్యూజిక్ వీడియోల్లో కనువిందు చేస్తాయి. ‘నా సంగీతంలో భిన్న సంస్కృతుల ప్రభావం కనిపించినప్పటికీ నా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి’ అంటాడు రిక్కీ కేజ్. మూడోసారి ‘గ్రామీ’ వరించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోప్లాండ్తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ‘సూపర్ గ్రేట్ఫుల్, మై థర్డ్ గ్రామీ అవార్డ్’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రిక్కీ కేజ్. నార్త్ కరోలినా (యూఎస్)లో జన్మించాడు రిక్కీ. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉంటున్నాడు. స్థానిక బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో సంగీతంలోనే కెరీర్ వెదుక్కుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఇలా చెప్పడం తండ్రికి నచ్చలేదు. ఆ తరువాత మాత్రం ఆయన కాస్త మెత్తబడ్డాడు. డెంటల్ సర్జరీలో డిగ్రీలో పూర్తి చేసిన తరువాత, పట్టా తండ్రి చేతికి ఇచ్చి తనకు ఇష్టమైన సంగీతపు దారిలో ప్రయాణం ప్రారంభించాడు. టీవీలోని మ్యూజిక్ షోల ద్వారా చిన్నప్పుడే రిక్కీకి సంగీతంపై ఆసక్తి మొదలైంది. ఇంట్లో పెద్ద మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. రాక్ బాండ్ ‘ఏంజెల్ డస్ట్’లో గిటార్ ప్లేయర్‌గా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిక్కీ ఆ తరువాత ఫుల్‌టైమ్ కంపోజర్‌గా మారాడు. నస్రత్ ఫతే అలీఖాన్, పండిట్ రవిశంకర్, పీటర్ గాబ్రియెల్ తనకు ఇష్టమైన సంగీతకారులు. జింగిల్స్ చేయడం అంటే రిక్కీకి చాలా ఇష్టం. జింగిల్స్ చేయడం అంటే తన దృష్టిలో రోజూ వ్యాయామం చేయడం లాంటిది. సృజనాత్మక పరిధిని పెంచుకోవడంలాంటిది. ఎన్నో భాషల్లో, ఎన్నో జానర్స్‌లో జింగిల్స్ చేస్తున్నప్పుడల్లా తనలో అదనపు శక్తి వచ్చినట్లుగా భావిస్తాడు. ఇప్పటివరకు మూడువేలకు పైగా జింగిల్స్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వంద మ్యూజిక్ అవార్డ్లు గెలుచుకున్నాడు. రిక్కీకి నచ్చిన పుస్తకం రిచర్డ్ డాకిన్స్ ది గాడ్ డిలూజన్. నిజానికి రిక్కీ తండ్రి, తాతతో సహా బంధువుల్లో చాలామంది వైద్యులుగా పనిచేశారు. ‘రిక్కీలో ఆర్టిస్టి్టక్ జీన్స్ తాత నుంచి వచ్చాయి’ అని మురిసిపోతుంది తల్లి పమ్మి. తాత జానకిదాస్ నటుడు, భావుకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. 2014లో తన గర్ల్‌ఫ్రెండ్ వర్షను వివాహం చేసుకున్నాడు రిక్కీ కేజ్. నవ రత్నాలు ‘డివైన్ టైడ్స్’ విడుదల అయిన కొత్తలో ఈ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డ్ గెలుచుకునే సంపూర్ణ అర్హతలు ఉన్నాయని కితాబు ఇచ్చారు సంగీత విశ్లేషకులు. వారి మాట నిజమైంది. ‘డివైన్ టైడ్స్’ లోని వండర్స్ ఆఫ్ లైఫ్, హిమాలయాస్, అవర్హోమ్, ఆర్డ్ ఆఫ్ డివోషన్, పాస్టోరల్ ఇండియా, ఐయామ్ ఛేంజ్, ఏ ప్రేయర్, గాంధీ, మదర్ ఎర్త్... తొమ్మిది ట్రాక్స్ నవరత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆల్బమ్‌లో మూలసూత్రం ఏమిటి? మనతో మనం... అంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత ప్రంచంలోకి వెళ్లి తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడం. తమను తాము విశ్లేషించుకోవడం, విశ్లేషణ ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం. కాలంతో పాటు మనం... కాలంపై మనదైన సంతకం ఉండాలి. కాలం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. కాలం విసిరే ప్రశ్నలకు జవాబు వెదుక్కోవాలి. కాలం విసిరే సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలి. మన గ్రహంతో మనం... భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీరేది కాదు. మనం చేయాల్సిందల్లా చెట్టును కాపాడుకోవాలి. చెట్టుపైన పిట్టను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ నినాదం మన శ్వాసలో భాగం కావాలి. వ్యక్తిత్వ నిర్మాణంలో నేస్తం ఆసక్తిగా మొదలై, అభిరుచిగా మారి రిక్కీ జీవితంలోకి వచ్చిన సంగీతం ‘సంగీతమే నా వ్యక్తిత్వం’ అనే స్థాయికి చేరుకుంది. అదే శ్వాస అయింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సంగీతంలో కెరీర్‌ను వెదుక్కోవడానికి ఇష్టంగా లేరు. దీని గురించి ప్రస్తావిస్తూ ‘మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పాషన్పై కాకుండా భయంపై తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థికకోణాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంచుకోవడం కాకుండా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వృత్తులకు దూరంగా తాము ఎంచుకున్న మార్గం ద్వారా మీ పిల్లలు పెద్దగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. అయితే డబ్బు కంటే విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు’ అంటాడు రిక్కీ కేజ్. గ్రామీ అవార్డ్ అందుకున్న యంగెస్ట్ ఇండియన్, మూడు గ్రామీలు అందుకున్న ‘వోన్లీ ఇండియన్’గా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న రిక్కీ కేజ్ (41)... ‘సంగీతం అనేది హాయిగా విని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయపడుతుంది. మన పాటలలో ఎక్కువగా ప్రేమ, శాంతి, మంచితనం చుట్టూ అల్లుకున్నవే’ అంటాడు. -
'మాటలు రావడం లేదు, ఈ అవార్డు భారత్‌కు అంకితమిస్తున్నా'
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ తన సత్తా చాటాడు. ఇప్పటికే రెండు సార్లు గ్రామీ పురస్కారాలను అందుకున్న ఆయన తాజాగా మరోసారి అవార్డును ఎగరేసుకుపోయారు. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో 'డివైన్ టైడ్స్'కు గానూ గ్రామీ అవార్డు పొందారు. ఈ పురస్కారాన్ని డివైన్ టైడ్స్‌కు పనిచేసిన డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్‌ల్యాండ్‌తో షేర్ చేసుకున్నారు. కాగా మూడు గ్రామీ అవార్డులు సాధించిన ఏకైక భారతీయుడిగా రిక్కీ రికార్డు నెలకొల్పారు. ఈ సంతోషకర క్షణాలను ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు రిక్కీ. 'మూడో గ్రామీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. ఈ పురస్కారాన్ని భారత్‌కు అంకితమిస్తున్నా' అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రిక్కీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో క్రిస్టినా, నిదరోస్డోమెన్స్ జెన్టెకర్, ట్రోండ్ హెమ్సోలిస్టెన్, ద చైన్‌స్మోకర్స్, జేన్ ఐరాబ్లూమ్ బ్యాండ్ట్రూప్స్ పోటీపడ్డాయి. కానీ వీటన్నింటిని వెనక్కు నెట్టి కేజ్ విజయ బావుటా ఎగురవేశారు. ఎవరీ రిక్కీ కేజ్ అమెరికా ఉత్తర కెరోలినాలో 1981లో భారతీయ దంపతులకు రిక్కీ కేజ్ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే వారు స్వదేశానికి వచ్చి బెంగళూరులో సెటిలయ్యారు. బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో రిక్కీ కేజ్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో మొదటిసారి గ్రామీ అవార్డు పొందారు. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో విండ్స్ ఆఫ్ సంసారాకు ఈ పురస్కారం పొందారు. 2022లో ఇదే కేటగిరీలో డివైన్ టైడ్స్కుగానూ అవార్డు అందుకున్నారు. తాజాగా డివైన్ టైడ్స్‌కు మరోసారి అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే చిన్న వయసులోనే గ్రామీ అవార్డు పొందిన భారతీయ వ్యక్తిగా అందరి దృష్టి ఆకర్షించారు రిక్కీ కేజ్. Just won my 3rd Grammy Award. Extremely grateful, am speechless! I dedicate this Award to India.@copelandmusic Herbert Waltl Eric Schilling Vanil Veigas Lonnie Park pic.twitter.com/GG7sZ4yfQa — Ricky Kej (@rickykej) February 6, 2023 చదవండి: సార్ ఆడియో లాంచ్.. స్టేజీపై పాట పాడిన ధనుష్ -
గ్రామీ అవార్డ్స్: అత్యధిక అవార్డులతో ఆ సింగర్ రికార్డు
ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 6న లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. భారత్‌కు చెందిన రిక్కీ కేజ్ 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. 2015, 2022లోనూ కేజ్‌కు గ్రామీ అవార్డులు వరించాయి. దీంతో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్ నిలిచారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్ సింగర్, డ్యాన్సర్ బియాన్స్ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది. ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే.. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్: రిక్కీ కేజ్ బెస్ట్ పాప్ డ్యుయో పర్ఫామెన్స్ - సామ్ స్మిత్, కిమ్ పెట్రాస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ : బోనీ రైట్ బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్: రెనిసాన్స్(బియాన్స్) బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్: అదెలె బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: కెన్‌డ్రిక్ లామర్ (మిస్టర్ మొరాలే, బిగ్ స్టెప్పర్స్) బెస్ట్ మ్యూజిక్ అర్బన్ ఆల్బమ్: బ్యాడ్ బన్నీస్ అన్ వెరానో సిన్టి బెస్ట్ కంట్రీ ఆల్బమ్ విన్నర్: ఎ బ్యూటిఫుల్ టైమ్ బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్: కఫ్ ఇట్ (బియాన్స్) బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్: హ్యారీ స్టైల్స్ -
హుర్రే... మన గొంతుకి గ్రామీ
‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ అని మన తల్లులు పాడుతారు పిల్లలతో. ‘చిట్టి కన్నయ్యా... లోకం చూస్తావా’ అని పాడింది ఫాల్గుణి షా తన కొడుకుతో. పిల్లలు ఒక్కోసారి ప్రశ్నలను సంధిస్తారు. వాటికి సమాధారాలు ఇదిగో ఇలా అవార్డులను కూడా తెచ్చి పెడతాయి. ‘అమ్మా.. నా క్లాస్‌లో అందరూ ఒకేలా ఎందుకు లేరు’ అని ఫాల్గుణి షా చిన్నారి కొడుకు అడిగాడు. దానికి జవాబుగా ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమే చేసింది. గ్రామీ గెలుచుకుంది. ఇది ఒక కొడుకు తల్లికి గెలిచి ఇచ్చిన అవార్డు. ఒక తల్లి తన కొడుకు కోసం గెలుచుకున్న అవార్డు. అమెరికాలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల నిషాద్ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి వాళ్ల అమ్మను ‘అమ్మా... స్కూల్లో ఎందుకు అందరూ ఒకేలా ఎందుకు లేరు? రంగూ రూపం, అలవాట్లు వేరే వేరేగా ఎందుకున్నాయి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు తల్లి...‘వేరే వేరేగా ఉండి కలిసి ఉండటమే ప్రపంచమంటే. ఇప్పుడు నీ దగ్గర చాలా రకాల పెన్సిల్స్ ఉన్నాయి. కాని అవన్నీ ఒక పెన్సిల్ బాక్స్‌లో ఇముడుతాయి కదా. అలాగే మనుషులు కూడా కలిసి కట్టుగా ఉంటారు’ అని జవాబు చెప్పింది. కాని సంతృప్తి కలగలేదు. ఇలాంటి ప్రశ్నను ఎందరో పసివాళ్లు తమ తల్లులను అడుగుతూ ఉండొచ్చు. వారికి అందరు తల్లులూ జవాబు చెప్పకపోవచ్చు. వారిని తాను చేరాలి. పాట రూపంలో చేరాలి అనుకుంది. వెంటనే ‘ఏ కలర్‌ఫుల్ వరల్డ్’ పేరుతో ఆల్బమ్ చేసి విడుదల చేసింది. ఇది గ్రామీ మెచ్చడంతో ఏకంగా గ్రామీ అవార్డు వరించింది ఆ తల్లిని. ఆ తల్లి మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన ఫాల్గుణి షా. ముంబై గాయని ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఫాల్గుణి షా... ముంబైలోని జుహులో ఓ సంగీత కుటుంబంలో పుట్టింది. ఇంట్లో సంగీత వాతావరణం ఉండడం, ఫాల్గుణి తల్లి ఆల్ ఇండియా రేడియోలో సంగీత విద్వాంసురాలిగా పనిచేస్తుండంతో చిన్న వయసు నుంచే ఫాల్గుణికి సంగీతం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. రేడియోలో వస్తోన్న పాటలను ఎంతో ఇష్టంగా వినేది. ఈ ఇష్టమే సంగీతం నేర్చుకునేలా చేసింది. ప్రముఖ గుజరాతీ గాయకులు కౌముది మున్షి, ఉదయ్ మజుందార్‌ల దగ్గర గుజరాతీ జానపద సంగీతం, గజల్స్‌తోపాటు టుమ్రి కూడా నేర్చుకుంది ఫాల్గుణి. తరువాత సారంగీ మ్యాస్ట్రో సుల్తాన్ ఖాన్ వద్ద హిందుస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. సంప్రదాయ గాయకుడు కిశోరి అమేన్ కర్ వద్ద జైపూర్ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. రెండుసార్లు గ్రామీకెళ్లిన ఫాలు సంగీతం నేర్చుకుంటూ పెరిగిన ఫాల్గుణి కరిష్మా బ్యాండ్ నడుపుతోన్న గౌరవ్ షాను పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లింది. అక్కడ కరిష్మా బ్యాండ్‌లో గాయకురాలుగా చేరింది. ‘ఫాలు’ అనే స్టేజ్ పేరుతో పాటలు పాడుతూ 2007లో ఫాల్గుణి తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. తరువాత 2013లో ‘ఫోరస్ రోడ్’ పేరిట మరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఈ ఆల్బమ్ తొలిసారి గ్రామీకి షార్ట్ లిస్ట్ అయినప్పటికీ నామినేషన్ కు ఎంపిక కాలేదు. తరువాత 2019లో ‘ఫాలూస్ బజార్’ పేరిట విడుదలైన ఆల్బమ్ మరోసారి గ్రామీకి నామినేట్ అయ్యింది. రెండుసార్లు బెస్ట్ చిల్డ్రన్ ్స మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఫాల్గుణి నిలిచింది. గ్రామీ అవార్డు రానప్పటికీ ఫాల్గుణి సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతోనే గత కొన్నేళ్లుగా అమెరికన్ కంపోజర్ ఫిలిఫ్ గ్లాస్, అమెరికన్ మ్యుజీషియన్ సెల్లిస్ట్ యోయో మా, ఏఆర్ రెహ్మాన్ లతో కలిసి పని చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్‌ను తెచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకు రెహ్మాన్ తో కలసి ఫాల్గుణి పని చేసింది. ఏ కలర్‌ఫుల్ వరల్డ్ పాటల రచయిత, గాయనిగా రాణిస్తోన్న ఫాల్గుణి ఆల్బమ్స్‌లో ఎక్కువగా భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్ జోడించి సమకాలిన అంశాల పాటలు ఉంటాయి. ఫాల్గుణి తొమ్మిదేళ్ల కొడుకు నిషాద్ న్యూయార్క్ సిటీలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రోజూ వాళ్లను దగ్గర నుంచి చూస్తోన్న నిషాద్ ఒకరోజు....‘‘అమ్మా మా స్కూల్లో కొంతమంది నల్లగా, మరికొంతమంది తెల్లగా, ఇంకొంత మంది చామనఛాయగా ఉన్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఇష్టాలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అంతా ఒక దగ్గరే ఎలా చదువుతున్నారు?’’ అని ఫాల్గుణిని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా...‘‘ బొమ్మలకు రంగులు నింపే రంగురంగుల కలర్ పెన్సిళ్లు, క్రేయాన్ ్స .. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నప్పటికీ అన్నీ ఒకే బాక్సులోనే ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, రూపురేఖలు, నలుపు, తెలుపు, ఎరుపు, చామనఛాయ రంగులు, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం లో అంతా శాంతియుతంగా జీవించడం అనేది కూడా క్రేయాన్ ్స బాక్స్లాంటిదే ’’ అని వివరించింది. ఈ వివరణ ఫాల్గునికి నచ్చడంతో ఈ థీమ్‌తో భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘కలర్‌ఫుల్ వరల్డ్ పేరిట (క్రెయాన్ ్స ఆర్ వండర్ ఫుల్)’ ఆల్బమ్? రూపొందించింది. ప్రస్తుతం ఈ ఆల్బమే ఫాల్గుణికి గ్రామీ అవార్డు తెచ్పిపెట్టింది. ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసిపారేయకుండా కాస్త విభిన్నంగా, లోతుగా ఆలోచిస్తే ప్రపంచం మెచ్చేలా కనెక్ట్ కావచ్చుననడానికి ఫాల్గుణి జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. -
శ్మశాన నిశ్శబ్దంలో ఉక్రెయిన్ నగరాలు
Ukraine Tribute At Grammy: సంగీతం అంటే శబ్దం.. పరవశం కలిగించేంది.. ప్రతీ ఒక్కరినీ కదిలించగలిగే శక్తి ఉంది దానికి. మరి దాని వ్యతిరేకం.. నిశబ్దం. ఆ నిశబ్దమే ఇప్పుడు ఉక్రెయిన్ నగరాల్లో రాజ్యమేలుతోంది. శవాల దిబ్బలతో శ్మశానాలను తలపిస్తున్నాయి అక్కడి నగరాలు. అందుకే సంగీతంతో ఆ మృత్యుఘోషను ప్రపంచానికి వినిపించడని వేడుకుంటున్నాడు జెలెన్స్కీ. గ్రామీ అవార్డులు 2022 కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 5గం.30ని. ప్రారంభమైన Grammy Awards 2022 వేదికలో ప్రసంగించాడు జెలెన్స్కీ. మౌనం వల్లే ఉక్రెయిన్ నాశనం అవుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వీలైన రీతిలో ఉక్రెయిన్ పౌరులకు మద్ధతు ప్రకటించాలంటూ గ్రామీ అవార్డుల వేదికగా విజ్ఞప్తి చేశాడు జెలెన్స్కీ. నిశబ్దాన్ని మీ సంగీతంతో పూరించండి. అదీ ఇవాళే. మా కథను ప్రపంచానికి చెప్పండి. వీలైన రీతిలో మాకు మద్ధతు ప్రకటించండి. కానీ.. మౌనంగా మాత్రం ఉండకండి’ అంటూ ప్రసంగించాడు జెలెన్స్కీ. అటుపై ఉక్రెయిన్ కవి ల్యూబా యకించుక్, అమెరికన్ సింగర్ జాన్ లెజెండ్లు ఉక్రెయిన్ పరిణామాలపై పర్ఫార్మెన్స్ చేశారు. El presidente de Ucrania, Volodímir Zelensky, participó este domingo en la gala de los Grammy con un mensaje en video en el que pidió ayuda internacional por la invasión rusa. 💙💛🇺🇦#StandUpForUkraine #StandWithUkraine️ #Zelensky #CloseTheSky #PeaceForUkraine pic.twitter.com/YrVMJUY2KX — Wálter Meléndez 🇺🇦🇵🇪 (@amigoperu76) April 4, 2022 🔴#AHORA| 📹 Siguiendo el mensaje de #Zelenskyy, #JohnLegend interpretó su canción "Free" 🎙️🎶 con los músicos ucranianos 🇺🇦 Siuzanna Iglidan y Mika Newton, y el poeta Lyuba Yakimchuk, mientras se mostraban imágenes de la guerra en las pantallas detrás de ellos. pic.twitter.com/30bMuSrDLH — Ahora Noticias (@AhoraTabasco) April 4, 2022 64వ గ్రామీ అవార్డుల వేడుక లాస్ వెగాస్‌లో అట్టహాసంగా జరిగింది. జనవరిలో జరగాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా వాయిదా పండి. దాదాపు 45కు పైగా కేటగిరీల్లో అవార్డులను ఇచ్చారు. వరుసగా రెండో ఏడాది ట్రెవర్ నోహా హోస్టింగ్ చేశారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా.. లీవ్ ది డోర్ ఓపెన్ Leave the door open గ్రామీ అవార్డు దక్కించుకుంది. ఈ సాంగ్‌కు గానూ.. బ్రాండన్ ఆండర్సన్, క్రిస్టోఫర్ బ్రాడీ బ్రౌన్, డెర్నెస్ట్ నెమిలీ 2, బ్రూనో మార్స్‌లు అవార్డు అందుకున్నారు. భారత్ తరపున హాజరైన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. సెల్ఫీలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. Grammys😍 pic.twitter.com/wM0q42kOFG — A.R.Rahman (@arrahman) April 3, 2022 -
కరోనా, ఒమిక్రాన్ ఎఫెక్ట్.. 64వ గ్రామీ అవార్డుల వేడుక వాయిదా
Grammy Awards 2022 Postponed Amid Corona And Omicron: కరోనా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశంలో సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది తారలు కరోనా బారిన పడ్డారు. అలాగే కరోనా, ఒమిక్రాన్‌లు తమ సత్తా చాటుతుండటంతో పాన్ ఇండియా సినిమాలతోపాటు పెద్ద చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా సంగీతంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన కళకారులకు గౌరవార్థంగా ఇచ్చే గ్రామీ అవార్డుల వేడుక (Grammy Awards 2022) వాయిదా పడింది. అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో జనవరి 31న నిర్వహించాల్సిన ఈ వేడుకలను కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో పోస్ట్‌పోన్ చేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్ (CBS), ది రికార్డింగ్ అకాడమీ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇదీ చదవండి: స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. వీలైనంత త్వరగా కోలుకుంటా అమెరికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున వేడుక నిర్వాహకులకు ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ భావించినట్లు సమాచారం. సంగీత నిర్వాకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని అకాడమీ అధికారులు తెలిపారు. త్వరలో కొత్త తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు నామినేషన్లను నవంబర్‌లో ప్రకటించారు. అయితే గతేడాది కూడా కరోనా వల్ల గ్రామీ అవార్డులు కొంతకాలం వాయిదా వేయాల్సి వచ్చింది. 2021లో జనవరిలో జరగాల్సిన ఈ అవార్డు వేడుకలు మార్చిలో నిర్వహించారు. అలాగే స్టేపుల్స్ సెంటర్‌కు బదులుగా లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్లోని అవుట్డోర్ సెట్లలో ఈ కార్యక్రమం జరిగింది. సెలబ్రిటీలు కూర్చునే ప్రదేశాన్ని మార్చడంతోపాటు సీటింగ్ కెపాసిటీ సైతం తగ్గించారు. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ డౌన్‌టౌన్‌లోని అరెనాలో జరగాల్సిన 64వ గ్రామీ అవార్డులు (64Th Grammy Awards) ఎక్కడ నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Recording Academy / GRAMMYs (@recordingacademy) ఇదీ చదవండి: నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ -
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు కొంతమంది అంతర్జాతీయ ప్రముఖలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరో ప్రముఖ వ్యక్తి చేరారు. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 63వ గ్రామీ అవార్డు వేడకల్లో ప్రముఖ కెనడీయన్ యూట్యూబర్ లిల్లి సింగ్.. భారత్‌లోని రైతులకు మద్దతుగా ఉంటానని సూచించే ఓ మాస్క్ ధరించి పాల్గొన్నారు. నల్లని సూట్ ధరించి ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్‌ను వేసుకొని రెండ్ కార్పెట్‌పై ఫోటోలకు పొజులిచ్చారు. అనంతరం ఆమె తన ట్విటర్ ఖాతాలో ఆ ఫోటోను పోస్ట్ చేశారు. ‘అవార్డు వేడుకల్లోని రెడ్ కార్పెట్‌పై దిగే ఫోటోలకు మీడియా కవరేజ్ అధికంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా భారత రైతులకు మద్దతు ప్రకటించండి’ అని ఆమె కామెంట్ జతచేశారు. రైతులకు మద్దతు ప్రకటించిన లిల్లి సింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇటీవల పర్యవరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్, అమెరికన్ పాప్ సింగర్ రెహానా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తమ మద్దతును రైతులకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి మద్దతుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు నవంబర్‌లో సింగు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కనీస మద్దతు ధరపై చట్ట పరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. I know red carpet/award show pictures always get the most coverage, so here you go media. Feel free to run with it ✊🏽 #IStandWithFarmers #GRAMMYs pic.twitter.com/hTM0zpXoIT — Lilly // #LateWithLilly (@Lilly) March 15, 2021 చదవండి: కాంక్రీట్ గోడ నిర్మాణం: రైతులపై కేసు నమోదు -
గ్రామీ అవార్డు విజేతలు వీరే...
లాస్ఎంజిల్స్: ఎట్టకేలకు ప్రఖ్యాత హాలీవుడ్ 63వ గ్రామీ అవార్డ్స్ అవార్డు ఫంక్షన్ మార్చి 14న లాస్ఎంజిల్స్లో జరిగాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ వేడుకలతో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న మహిళగా బెయోన్స్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బెయాన్స్ 28 ట్రోఫీలను గెలిచింది. ప్రముఖ సింగర్ అలిసన్ క్రాస్‌ను దాటింది.కోవిడ్-19 నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే.. రికార్డ్ ఆఫ్ ది ఇయర్: ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ఫోక్లోర్ బై టేలర్ స్విఫ్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్: ఐ కాంట్ బ్రీత్ బై హెచ్.ఈ.ఆర్ ఉత్తమ నూతన ఆర్టిస్ట్: మేగాన్ దీ స్టాలియన్ ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన: వాటర్మెలాన్ బై హ్యారీ స్టైల్స్ ఉత్తమ రాక్ సాంగ్: స్టే హై బై బ్రిటనీ హోవార్డ్ ఉత్తమ రాక్ ఆల్బమ్: ది న్యూ ఆబ్నార్మల్ బై ది స్ట్రోక్స్ ఉత్తమ ర్యాప్ సాంగ్: సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్ ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: కింగ్స్ డిసీజ్ బై నాస్(చదవండి: ఒక వేడుక.. రెండు వేదికలు) -
గ్రామీ అవార్డ్స్ వాయిదా
హాలీవుడ్ ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్ గ్రామీ అవార్డ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ నెల 31న లాస్ ఏంజెల్స్‌లో జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేశారు. ‘‘ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు గ్రామీ అవార్డు నిర్వాహకులు. -
ప్రియరాగం
గ్రామీ అవార్డ్‌ల నామినీల జాబితాలో ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని. ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూత్‌ను ఊపేస్తున్న ‘పెరిఫెరీ’ ఆల్బమ్ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. చిన్నాచితకా పనులు చేస్తూనే ‘అబ్బా! టైమ్ సరిపోవడం లేదు’ అని గొణుక్కుంటాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ ‘ఒక్కరే ఇన్నిన్ని పనులు ఎలా చేస్తారు!’ అని కూడా ఆశ్చర్యపోతుంటాం. ‘టైమ్ మన చేతిలో ఉంటే అదృష్టం కూడా మన చేతిలో ఉంటుంది’ అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ... ప్రియదర్శిని. సింగర్ సాంగ్ రైటర్ స్విమ్మర్ ఎంటర్ప్రెన్యూర్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్ట్రా–మారథానర్... ప్రియదర్శిని అనే పేరుకు ముందు ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ‘నా పేరు నిలపాలి సుమా!’ అని పెద్దలు అంటుంటారు. నిలపడమేమిటి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రియదర్శిని బామ్మ పేరు ప్రియదర్శిని. సేమ్ పేరు అన్నమాట! అమ్మమ్మ ఒడిలోనే సంప్రదాయ కర్నాటక సంగీతాన్ని నేర్చుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియదర్శిని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్–మేకింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్లు, సంగీతకారులతో కలిసి పనిచేసింది. మదర్ థెరెసా జీవితం ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమా ‘ది లెటర్స్’లో సుభాషిణి దాస్ పాత్రలో ఒదిగిపోయింది. ప్యార్ క్యోం కియా, డి–కంపెనీ... మొదలైన బాలీవుడ్ సినిమాలలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంది. వందకు పైగా రేడియో, టీవి కమర్షియల్స్‌కు తన గాత్రాన్ని అందించింది. నే పాడితే లోకమే ఆడదా... 2017లో ‘ఇట్ కాన్ట్ హ్యాపెన్ హియర్’ నాటకంలో నటించి రంగస్థలంపై కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘పెరిఫెరీ’ ఆల్బమ్ ఒక ఎత్తు. ఆమె తొలి ఆల్బమ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం, అమెరికన్ పాప్ మ్యూజిక్ కలయికగా వచ్చిన ఈ ఆల్బమ్ న్యూ ఏజ్ మ్యూజిక్‌లో తనదైన స్టాంప్ వేసింది. ‘నా చిన్నప్పటి కల నిజమైంది. ముంబైలోని గోరెగావ్‌లో పెరిగిన నాలాంటి తమిళ పొన్నుకు ఇలాంటి నిజాలు జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే’ అంటోంది ప్రియదర్శిని. ఆమె తన గురించి ఏమనుకుంటుంది సరే, మరి ఇతరులు? ఫైవ్ టైమ్ గ్రామీ విన్నర్ రాయ్ వుటెన్ ఇలా అంటారు... ‘ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ గానం, సాహిత్యంలోనే కాదు సాహసంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది ప్రియదర్శిని. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆల్ట్రా మారథాన్ రన్నర్‌గా 100–మైల్ హిమాలయన్ స్టేజ్ రేస్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో పోర్టర్లు, గైడ్లుగా బతుకుతున్న షేర్పాల జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు దోపిడికి గురవుతున్నారనే వాస్తవం బోధ పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ట్రా మారథాన్లను నిర్వహించడానికి ‘ది విండ్ ఛేజర్స్’ అనే కంపెనీ లాంచ్ చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని షేర్పాల కుటుంబ సంక్షేమానికి కేటాయిస్తున్నారు. హోమ్ మ్యూజిక్ వీడియోలో ఒక దృశ్యం నమీబియా ఎడారిలో 250 కిలోమీటర్ల హార్డ్ కోర్ రేస్ మరో సాహసం ప్రియదర్శిని దృష్టిలో గానం, పరుగు రెండు వేరు విషయాలు కాదు. ఒకదానికొకటి అనుసంధానమైవి. ‘సృజనాత్మకత మరింత పదును తేలడానికి ఇది ఉపకరిస్తుంది’ అంటోంది ప్రియదర్శిని. సాహనం మాత్రమే కాదు సహాయం కూడా ఆమెకు ఇష్టమైన మాట. క్యాన్సర్ చికిత్స కోసం ముంబై మహానగరానికి వచ్చి ఆశ్రయం దొరకక ఇబ్బందిపడే పేదలకు ప్రియదర్శిని తల్లి తన వన్–బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఆశ్రయం కల్పించేది. తల్లి నుంచి ఇలాంటి మంచి గుణాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియదర్శిని ‘జనరక్షిత’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ‘జనరక్షిత’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు సమకూరుస్తుంది. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి కృషి చేస్తుంది. కళ,సేవ,వ్యాపారరంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియదర్శిని. నామినీ జాబితాలో చోటు సంపాదించుకున్న మన కళాకారులు అనుష్క శంకర్, నేహా మహాజన్, శిల్పారావులకు అభినందనలు తెలియజేద్దాం. -
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
పాట మరిచిపోయింది.. నవ్వుల పాలు
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్). ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది. -
గ్రామీ అవార్డుల రేసులో ‘అనంత’ ఆల్బమ్
సాక్షి, హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విడుదల చేసిన ‘అనంత వాల్యూమ్–1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ 60వ గ్రామీ అవార్డుల ‘వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్’ పోటీకి ఎంపి కైంది. ప్రసిద్ధ ఘటం విద్వాంసుడు పండిట్ విక్కు వినాయక్ రామ్ ఆధ్వర్యంలో మూడు తరాలకు చెందిన విద్వాంసులు పండిట్ విక్కు వినాయక్ రామ్, సెల్వగణేశ్ స్వామినాథన్‌ల సహకారంతో సిద్ధాంత్ భాటియా స్వరపరచిన ‘గురుస్తోత్రం’ అనే పాట గాత్రవాద్య విభాగంలో పోటీకి ఎంపికైనట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.‘అనంత’ ఆల్బమ్ రికార్డింగ్ 33 రోజులలో పూర్తి చేశారు. దాని రూపశిల్పి సిద్ధార్థ్ భాటియా దేశవ్యాప్తంగా పర్యటించి.. ఆయా ప్రాంతాల్లో సహజమైన సంగీతాన్ని అప్పటికప్పుడు రికార్డు చేశారు. సంగీతం సహజంగా జాలువారే అపురూప క్షణాలను ఒడిసిపట్టడమే లక్ష్యంగా సాగిన ఈ ఆల్బమ్‌లోని పాటలు సైతం అప్పటికప్పుడు తయారుచేసినవే. ఈ ఆల్బమ్ 30 మంది సంగీత దిగ్గజాల గాత్ర, స్వర సహకారంతో 300 నిమిషాల నిడివితో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సంగీత సంకలనంగా నిలిచింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బాలల విద్య, సంక్షేమ పథకాలకు వినియోగించనుంది. త్రివేణి సంగమంలా.. ప్రేమ, భక్తి, మౌనంల త్రివేణి సంగమంలో నుంచి ఈ ఆల్బమ్‌లోని పాటలు పుట్టాయని.. సంగీత, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిని ‘అనంత’ ఆవిష్కరించిందని రూపశిల్పి సిద్ధాంత్ భాటియా పేర్కొన్నారు. ఈ ఆల్బమ్‌లో గ్రామీ విజేతలు పండిత్ విక్కు వినాయక్రామ్ (ఘటం), పండిత్ విశ్వమోహన్ భట్ (మోహన వీణ), స్వరకర్త కళారామ్నాథ్, గ్రామీ అవార్డుకు గతంలో నామినేటైన యు.రాజేష్ (మాండలిన్), పండిత్ తేజేంద్ర నారాయణ్ మజుందార్ (సరోద్)ల వాద్య సంగీతాలున్నాయి. గాత్ర సంగీతంలో ప్రముఖులైన పండిత్ జస్రాజ్, అరుణా సాయిరామ్, ఉస్తాద్ షహీద్ పర్వేజ్ ఖాన్, ఉస్తాద్ రషీద్‌ఖాన్, లైఫ్ ఆఫ్ పై చిత్రానికి ఆస్కార్ అవార్డును అందించిన బోంబే జయశ్రీల కృతులూ ఉన్నాయి. యువ కళాకారులైన పుర్బయాన్ ఛటర్జీ (సితార్), రాజేశ్ వైద్య (వీణ), రాకేష్ చౌరాసియా (వేణువు), బాలీవుడ్ గాయకులు హరిహరన్, కె.ఎస్.చిత్ర, జావేద్ అలీ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. -
అడెల్కు ఐదు గ్రామీలు
► సందీప్ దాస్‌ను వరించిన సంగీత పురస్కారం ► అనౌష్క శంకర్‌కు నిరాశ లాస్ఏంజిలెస్: సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’పురస్కారాల్లో బ్రిటన్ కు చెందిన పాప్ సింగర్ అడెల్ సత్తాచాటారు. 25, హలో ఆల్బమ్స్లతో ఈమె ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ (25), రికార్డ్ ఆఫ్ ది ఇయర్ (హలో), సాంగ్ ఆఫ్ ది ఇయర్ (హలో), ఉత్తమ పాప్ సోలో పర్ఫామెన్స్ (హలో), బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బ మ్ (25) పురస్కారాలను గెలుపొందారు. ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన కార్యక్రమంలో 59వ గ్రామీ పురస్కారాలను ప్రదానం చేశారు. బియాన్స్ 9 విభాగాల్లో నామినేషన్ పొందినప్పటికీ అడెల్అత్యధిక అవార్డులు పొందారు. బియాన్స్ .. బెస్ట్ అర్బన్ కంటెంపరరీ, బెస్ట్ మ్యూజిక్ వీడియో విభాగాల్లో రెండు అవార్డులు సాధించారు. ఈసారి గ్రామీ పురస్కారాల్లో భారత్‌కు మిశ్రమ స్పందన లభించింది. తబలా ప్లేయర్ సందీప్ దాస్‌ను అవార్డు వరించగా, సితారిస్ట్ అనౌష్క శంకర్‌కు నిరాశే మిగిలింది. సందీప్ దాస్.. ‘యో యో మా’బృందంతో కలసి రూపొందించిన ‘సింగ్ మి హోమ్’ప్రపంచ మ్యూజిక్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుపొందడం విశేషం. తమకు మూడోసారి గ్రామీ అవార్డు దక్కినందుకు సందీప్ హర్షం వ్యక్తంచేశారు. ‘సింగ్ మి హోమ్’ను శరణార్థుల సంక్షోభం నేపథ్యంతో రూపొందిం చారు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క శంకర్‌కు వరుసగా ఆరోసారీ నిరాశతప్పలేదు. ఆమె రూపొందించిన ‘ల్యాండ్ ఆఫ్ గోల్డ్’కూడా ఇదే విభాగంలో నామినేట్ అయినప్పటికీ ఆమెకు పురస్కారం దక్కలేదు.