Chandrika Tandon: తేజో చంద్రిక | Chandrika Tandon recipe for a life of perfection | Sakshi
Sakshi News home page

Chandrika Tandon: తేజో చంద్రిక

Published Tue, Oct 31 2023 4:21 AM | Last Updated on Tue, Oct 31 2023 4:21 AM

Chandrika Tandon recipe for a life of perfection - Sakshi

ఆరోజు...  ‘అలాగే’ అని తల ఆడించి ఉంటే ‘పవర్‌ఫుల్‌ ఉమన్‌’గా ప్రపంచవ్యాప్తంగా చంద్రిక పేరు తెచ్చుకునేది కాదు. ‘ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండలేను’ అని భయపడి ఉండే ఉద్యోగజీవితంలోకి వచ్చేది కాదు. తనను తాను నిరూపించుకునేది కాదు. ‘లాయర్‌ కావాలనుకున్నాను. ఈ ఉద్యోగం ఏమిటి’ అని నిట్టూర్చి ఉంటే చంద్రిక కొత్త శిఖరాలు అధిరోహించేది కాదు. ‘ఉద్యోగ జీవితానికే టైమ్‌ లేదు. ఇక సంగీతానికి స్థానం ఎక్కడ’ అని సర్దుకుపోయి ఉంటే సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకునేది కాదు. ప్రపంచ గుర్తింపు పొందిన బిజినెస్‌ లీడర్, గ్రామీ–నామినేట్‌ ఆర్టిస్ట్‌గా, దాతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది చంద్రిక....

‘అవసరం లేదు’ ఒక మాటలో తేల్చేసింది అమ్మ. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో డిగ్రీలో చేరాలనుకుంటున్న చంద్రికకు ఆ మాట శరాఘాతం అయింది. ‘ఆ కాలేజీలో తక్కువమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే’ అన్నది అమ్మ. చంద్రిక చాలా సేపు అమ్మతో వాదించినా ఫలితం కనిపించలేదు.

ఇంట్లోనే నిరాహార దీక్ష చేసింది. దీంతో చంద్రిక మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదవడానికి తల్లి ఒప్పుకోక తప్పింది కాదు. మూడు సంవత్సరాల కాలేజీ జీవితం చంద్రిక జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. సంగీతప్రపంచంతో అనుబంధానికి, సింగర్‌గా పేరు తెచ్చుకోవడానికి కారణం అయింది.

 డిగ్రీలో చేరడమే కష్టం అనుకున్న చంద్రిక ఆ తరువాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌ చేరడం పెద్ద విజయం. నిజానికి చంద్రికకు బిజినెస్‌ ప్రపంచంపై పెద్దగా ఆసక్తి లేదు. తాతలాగే లాయర్‌ కావాలనుకుంది. అయితే ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ సూచన మేరకు బిజినెస్‌ స్కూల్‌లో చేరింది.  మొదటి కొన్నిరోజులు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సొంత ఊరు దాటి అంత దూరం రావడం అదే మొదటిసారి.

ఆ ఒంటరితనానికి దూరం కావడానికి సంగీతానికి దగ్గరైంది. చంద్రిక తొలి ఉద్యోగం సిటీబ్యాంక్‌లో. బ్యాంకర్‌ కావాలని కలలో కూడా అనుకోని చంద్రికకు ఇది వింతగా అనిపించింది. ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ కోసం లెబనాన్‌లోని బీరుట్‌ వెళ్లింది. యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడకు వెళ్లింది. అక్కడ అయిదు నెలల పాటు ఉంది. సిటీబ్యాంక్‌ తరువాత వేరే సంస్థల నుంచి చంద్రికకు అవకాశాలు రావడం మొదలైంది.

అలా అమెరికాలోకి అడుగు పెట్టింది. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన సంగీతప్రపంచాన్ని మాత్రం చంద్రిక విడిచి బయటికి రాలేదు. ఎన్నో ఆల్బమ్స్‌ ద్వారా సక్సెస్‌ఫుల్‌ మ్యూజిషియన్‌గా తనను తాను నిరూపించుకుంది. సెకండ్‌ ఆల్బమ్‌ ‘సోల్‌ కాల్‌’ గ్రామీ అవార్డ్‌–బెస్ట్‌ కాంటెంపరరీ వరల్డ్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ విభాగంలో నామినేట్‌ అయింది.
గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ మకెంజీకి ఫస్ట్‌ ఇండియన్‌ ఉమెన్‌ పార్ట్‌నర్‌గా అరుదైన ఘనత సాధించింది. అడ్వైజరీ సంస్థ ‘టాండన్‌ క్యాపిటల్స్‌ అసోసియేషన్స్‌’ ప్రారంభించి సూపర్‌ సక్సెస్‌ అయింది.

ఈ ప్రయాణంలో చంద్రికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కుటుంబజీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అందులో ఒకటి. అయితే ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకు వెళ్లింది. సవాలు ముందుకు వచ్చినా, ఒత్తిడి తలలో దూరినా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం సంగీతం. పాటలు వినడం, పాడడం తనకు ఎంతో ఇష్టం. అదే తన బలం. తాజాగా
‘అమ్మూస్‌ ట్రెజరర్స్‌’ ఆల్బమ్‌తో ముందుకు వచ్చింది చంద్రిక. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement