2024 గ్రామీ అవార్డుల్లో మన భారతీయ సంగీత దిగ్గజాలకు చెందిన దిస్ మూమెంట్ (శక్తి ఆల్బమ్) అవార్డు గెల్చుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పలువురు లెజెండ్స్ కూడా జాకీర్ హుస్సేన్, శంకర్‌మహదేవన్ బృందంపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. దిగ్గజ స్వరకర్త, రవిశంకర్ మన దేశానికి తొలి గ్రామీ అవార్డును అందించిన ఘనతను సాధించారు. మరి గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా? ఇపుడిదే నెట్టింట ఆసక్తి కరంగా మారింది. మరి ఆమె ఎవరు? ఏ విభాగంలో గ్రామీ గెల్చుకుంది అనే వివరాలను ఒకసారి చూద్దాం.
25 ఏళ్లకేగ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ, చెన్నైకి చెందిన గాయని తన్వీషా. 2010లో లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో జరిగిన 52వ గ్రామీ అవార్డుల్లో ఆమె ఈ అవార్డును గెల్చుకున్నారు. బాలీవుడ్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్ పాట " జై హో "కోసం స్పానిష్ సాహిత్యాన్ని అందించినందుకు ఉత్తమ పాట అవార్డు దక్కించుకున్నారు. ప్రముఖ గాయకుడు, స్వరకర్త, AR రెహమాన్, గీత రచయిత గుల్జార్‌తో అవార్డును పంచుకుంది. ఈ అవార్డు తన్వి కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. గ్రామీతో పాటు, ఆమె లండన్‌లో 2009లో BMI అవార్డును కూడా అందుకుంది.
తన్వీషా డిసెంబర్ 1, 1985న తమిళనాడులో జన్మించింది. చాలా తక్కువ వ్యవధిలో భారతీయ సంగీత పరిశ్రమలో బాగా పాపులర్ అయిన తన్వీషా అనుకోకుండా సింగర్‌గా మారింది. రెహమాన్‌తో యువ మూవీ ‘ఫనా’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మాత్రమే సంగీతంలో శిక్షణ తీసుకొని మరింత రాటు దేలింది. తమిళం, హిందీ , తెలుగు భాషల్లో ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంది. ఎళుతు చిత్రం కోసం "యక్కై తిరి" మొదలు ఫనా, పప్పు కాన్ట్ డ్యాన్స్, రెహ్నా తూ, బూమ్ బూమ్ రోబోడా, మవ్వాలి కవ్వాలి, కేదా కారి లాంటి పాటలతో బాగా పేరు తెచ్చుకుంది. అలాగే స్పానిష్ , పోర్చుగీస్ భాషలతో పాటు అరబిక్‌లో కూడా పాడింది. గ్రామీ అవార్డు తరువాత యువన్ శంకర్ రాజా , అమిత్ త్రివేది లాంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా మెరిసింది. ఐకానిక్ అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్‌తో కలిసి స్నూప్ డాగ్ మిలియనీర్ పాట, జెరెమీ హాకిన్స్, చే పోప్, డేవిడ్ బాటియో లాంటి మరెన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో పాపులర్ అయింది.
స్కిన్‌కేర్ బ్రాండ్ తాన్షా స్టూడియోస్‌కు నాంది
తన్వి షా అద్భుతమైన ప్రతిభావంతులైన గాయని మాత్రమే కాదు, తాన్షా స్టూడియోస్ అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త కూడా. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. చెమట, దుర్వాసనకు సంబంధించిన సమస్యలతో బాధపడేదట తన్వీ. దీని చికిత్సకు స్టెరాయిడ్లను వాడాలని వైద్యులు సూచించడంతో ఎలాంటి హాని లేని కొత్త బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దీంతో సహజ చర్మ సంరక్షణకోసం సల్ఫేట్‌లు, పారాబెన్స్, అల్యూమినియం లాంటి ప్రమాదకర రసాయనాలు లేని తాన్షాను బ్రాండ్‌ను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment