అడెల్‌కు ఐదు గ్రామీలు
► సందీప్ దాస్‌ను వరించిన సంగీత పురస్కారం
► అనౌష్క శంకర్‌కు నిరాశ
లాస్‌ఏంజిలెస్: సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’పురస్కారాల్లో బ్రిటన్ కు చెందిన పాప్ సింగర్ అడెల్ సత్తాచాటారు. 25, హలో ఆల్బమ్స్‌లతో ఈమె ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ (25), రికార్డ్ ఆఫ్ ది ఇయర్ (హలో), సాంగ్ ఆఫ్ ది ఇయర్ (హలో), ఉత్తమ పాప్ సోలో పర్ఫామెన్స్ (హలో), బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బ మ్ (25) పురస్కారాలను గెలుపొందారు. ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన కార్యక్రమంలో 59వ గ్రామీ పురస్కారాలను ప్రదానం చేశారు.
బియాన్స్ 9 విభాగాల్లో నామినేషన్ పొందినప్పటికీ అడెల్‌అత్యధిక అవార్డులు పొందారు. బియాన్స్ .. బెస్ట్ అర్బన్ కంటెంపరరీ, బెస్ట్ మ్యూజిక్ వీడియో విభాగాల్లో రెండు అవార్డులు సాధించారు. ఈసారి గ్రామీ పురస్కారాల్లో భారత్‌కు మిశ్రమ స్పందన లభించింది. తబలా ప్లేయర్ సందీప్ దాస్‌ను అవార్డు వరించగా, సితారిస్ట్ అనౌష్క శంకర్‌కు నిరాశే మిగిలింది. సందీప్ దాస్.. ‘యో యో మా’బృందంతో కలసి రూపొందించిన ‘సింగ్ మి హోమ్’ప్రపంచ మ్యూజిక్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుపొందడం విశేషం. తమకు మూడోసారి గ్రామీ అవార్డు దక్కినందుకు సందీప్ హర్షం వ్యక్తంచేశారు.
‘సింగ్ మి హోమ్’ను శరణార్థుల సంక్షోభం నేపథ్యంతో రూపొందిం చారు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క శంకర్‌కు వరుసగా ఆరోసారీ నిరాశతప్పలేదు. ఆమె రూపొందించిన ‘ల్యాండ్ ఆఫ్ గోల్డ్’కూడా ఇదే విభాగంలో నామినేట్ అయినప్పటికీ ఆమెకు పురస్కారం దక్కలేదు.