సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు.
విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్‌లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్‌కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి.
ఇదే ఆల్బమ్‌కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్‌లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది.
ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు.
అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి.
విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్‌కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందటమే కాదు... ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్‌ది.
తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది.
అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్‌ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత.
ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు.
ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు.
గ్రామీ అవార్డుల పంట!
Published Tue, Feb 6 2024 12:45 AM | Last Updated on Tue, Feb 6 2024 12:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment