ఆకాశంలో సగమంతా గాయమే | International Day for the Elimination of Violence against Women | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సగమంతా గాయమే

Published Sun, Nov 24 2024 8:26 AM | Last Updated on Sun, Nov 24 2024 9:58 AM

International Day for the Elimination of Violence against Women

ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్‌ఓ  ప్రతి ఏడు నవంబర్‌ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైన్‌స్ట్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌) దినంగా  పరిగణిస్తోంది.

స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత,  స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!

నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్‌లైన్‌ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్‌ఫెక్ట్‌గా లేదని తేలింది ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ (డబ్ల్యూపీఎస్‌)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్‌ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. 

ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్‌కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్‌లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్‌ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్‌ కనిపించింది. 

ఇక మన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్‌ వయొలెన్స్‌ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. 

‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్‌ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’

‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!

‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్‌ టాప్స్‌ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్‌ కామెంట్‌ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్‌లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్‌ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’

‘మా అమ్మాయి మంచి అథ్లెట్‌. కోచింగ్‌కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్‌లోనే స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో మహామహులు వినేశ్‌ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్‌ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’

‘నా సీనియర్‌ మేల్‌ కొలీగ్‌ హెరాస్‌మెంట్‌ భరించలేక మేనేజర్‌కి రిపోర్ట్‌ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్‌ చేశాడు. దాంతో నా సీనియర్‌ కొలీగ్‌ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్‌లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్‌మెంట్‌ తట్టుకోలేక జాబ్‌కి రిజైన్‌ చేశాను!’

ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్‌ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్‌.. కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా.. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్‌ఓ! అందుకే ఏటా నవంబర్‌ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన  (ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైన్‌స్ట్‌ విమె¯Œ  అండ్‌ గర్ల్స్‌) దినంగా జరుపుతోంది.   పురుషాధిపత్య భావజాలంతో కండిషన్‌ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్‌ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్‌ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్‌ పది వరకు సాగుతుంది. 

ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్‌ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్‌ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు.  

మన దగ్గరున్న మహిళా చట్టాలు...
గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) యాక్ట్‌.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్‌ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్‌ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్‌), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్‌), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్‌) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైమ్‌ పోర్టల్, వన్‌ స్టాప్‌ సెంటర్స్‌ వంటివీ అందుబాటులో ఉన్నాయి.

గృహహింస అంటే..
గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే  స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్‌ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్‌)కి సంబంధం లేదు. గృహహింస కింద 
కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్‌ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్‌ స్టేషన్‌లో ఇవ్వాలి.

మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. 
మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్‌ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్‌ ఆబ్జెక్ట్‌గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్‌ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 
(NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు 
(15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.

ఈ ‘డే’ వెనుక చరిత్ర

కరీబియన్‌ దేశమైన డొమినికన్‌ రిపబ్లిక్‌కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్‌ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్‌ రిపబ్లిక్‌ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్‌ సిస్టర్స్‌గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ఆ విషయం తెలిసి రఫైల్‌ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్‌ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్‌ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్‌లోనే పెట్టి, జీప్‌కి యాక్సిడెంట్‌ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్‌ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. 

ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్‌ రిపబ్లిక్‌ ప్రజలు "Las Mariposas..  ద బటర్‌ఫ్లైస్‌’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైన్‌స్ట్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌’కి లోగోగా బటర్‌ఫ్లైనే నిర్ణయించింది యూఎన్‌ఓ!  ‘మీరాబాల్‌ సిస్టర్స్‌’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. 

ఆ మీరాబాల్‌ సిస్టర్స్‌ గౌరవార్థమే యూఎన్‌ఓ 1999లో నవంబర్‌ 25ను ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైన్‌స్ట్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్‌.. 2020లో ‘హండ్రెడ్‌ విమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ సంచికలో చేర్చింది.   

పాఠ్యాంశం చేయాలి
కాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్‌క్రైమ్‌ ట్రోలింగ్‌ వద్దే ఆగడంలేదు. మార్ఫ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్‌ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు  అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్‌ ఎడ్యుకేషన్‌ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్‌ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్‌ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస  నార్మలైజ్‌ అవుతుంది.

దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్‌ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్‌ చార్జ్‌లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్‌ అధికారులే అడిషనల్‌ చార్జ్‌లో ఉన్నారు.

పురుషాధిపత్య భావజాలంతో కండిషన్‌ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్‌ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్‌ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్‌ పది వరకు సాగుతుంది. 

ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్‌ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్‌ని నిర్వహిస్తోంది. 

ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement