సృష్టికి జన్మ ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ...
పురిటినొప్పులు పడుతూ... పడుతూ... పడుతూ...
లేస్తూ... లేస్తూ.. లేస్తూ...
పునర్జన్మలు పొందుతూ... పొందుతూ... పొందుతూ...
తల్లి భారతి సమాజానికి పునరుజ్జీవనం ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ..
రాబోయే కొత్త సంవత్సరానికి మనకు స్ఫూర్తిని
పంచుతూ... పంచుతూ... పంచుతూ...
అసలు మహిళ విజయం సాధించనిదెప్పుడు? కుటుంబంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎవరి విజయమైనా అది మహిళదే! తన శక్తియుక్తులను ఇంటికి, కుటుంబానికి ధారపోస్తేనే కదా.. ఏలికలు సవ్యంగా పాలించేది! సమాజాన్నయినా.. దేశాన్నయినా.. చివరకు ఈ లోకాన్నయినా! ప్రతి పురుషుడి గెలుపు వెనక స్త్రీ త్యాగం ఉందని లోకోక్తి కూడా కదా! ఇలా ఇంటిని చూస్తూ బయట పనులూ చక్కబెట్టే మహిళ శక్తికి మాటలు గట్టే ప్రయత్నం చేస్తే విశ్వమంత పేజీ అయినా సరిపోదు. ఆమె ఆత్మనిబ్బరం, ఆత్మవిశ్వాసం, సాహసాన్ని ఏ భాషా నిర్వచించలేదు. ఒక్క ఉదాహరణ.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన లక్ష్మీ అగర్వాల్. టీవీ చానళ్లలో రియాలిటీ షోస్‌లో పాడుతూ.. సింగర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని పధ్నాలుగేళ్ల వయసు నుంచీ కలలు కన్నది. వాటిని నెరవేర్చుకోవడానికి సాధన చేసింది. 32 ఏళ్ల ఓ వ్యక్తి లక్ష్మి మీద మనసు పడ్డాడు. మగాడు మనసు పడ్డ అమ్మాయి అతని ఆస్తి అనే భావం ఈ దేశంలో జాస్తి కదా! అందుకే అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆర్డర్ వేశాడు. నువ్వు నాకే అని. కాదు.. నేను నాకే అంది లక్ష్మి. అహం దెబ్బతిన్న పురుషుడు ఆమె మొహం మీద యాసిడ్ పోశాడు. దాదాపుగా మరణం అంచుకు వెళ్లి మళ్లీ జీవం నింపుకుంది. కొన్ని యేళ్లు పట్టింది. అయినా ఆశను చావనివ్వలేదు. నెమ్మదిగా నిలదొక్కుకుంది. తనకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకు జరగొద్దని ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. యాసిడ్ అటాక్ తర్వాత గొంతు దగ్గర చర్మం బిగుసుకుపోయి పాటకు సహకరించకపోయేసరికి టెలివిజన్ హోస్ట్‌గా మారింది. 2014లో అప్పటి అమెరికా మొదటి పౌరురాలు మిషెల్లీ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ విమెన్ కరేజ్ అవార్డును అందుకుంది. అంతేకాదు, ఎన్‌డీవీ వాళ్ల ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్నీ పొందింది.
అనురిమా సిన్హాది ఇంకో రకమైన గెలుపు. జాతీయస్థాయి వాలీబాల్, ఫుట్‌బాల్ ప్లేయర్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరాలన్నది ఆమె స్వప్నం, ఆశయం కూడా. ఆ పరీక్ష రాయడానికే రైలెక్కింది. అందులో ఉన్న కొంతమంది దుండగులు అనురిమ మెడలో బంగారు గొలుసును దొంగిలిద్దామని ఆమె ఒంటి మీద చేయి వేశారు. నిలువరించింది అనురిమ. అంతే! అందరూ కలిసి ఆమె మీద పడ్డారు గొలుసు లాక్కొని కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది అనురిమా. కాని కలను కాదు. కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కింది. పెట్టుడుకాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఎన్నో అవార్డులు తీసుకుంది. కిలిమంజారో ఎక్కడం గురించీ ఇప్పుడు ఆలోచిస్తోంది.
ఫరిదాబాద్‌కు చెందిన కిరణ్ కనోజీది కూడా ఇలాంటి అనుభవమే. ఆమె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రైల్లో ఫరిదాబాద్‌కు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ను దొంగిలించబోతూ రైల్లోంచి ఆమెను కిందకు తోశారు. ఆ దుర్ఘటనలో ఆమె ఒక కాలు కోల్పోయింది. అయినా స్థయిర్యం కోల్పోలేదు. బ్లేడ్ రన్నర్‌గా గెలుపును వరించింది. జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
ఆరోగ్య సిరి
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభాషిణీ మిస్త్రీ... ఊరందరి క్షేమం కోసం తపించిన తల్లి. ఆమె భర్త కూరగాయలు అమ్మేవాడు. ఒకసారి జబ్బు చేసి ఊళ్లో హాస్పిటల్ లేక.. వైద్యసహాయం అందక చనిపోయాడు. అప్పటికే వాళ్లకు నలుగురు పిల్లలు. సుభాషిణి ఏమీ చదువుకున్నది కాదు. అయినా కుటుంబ బండిని లాగే భారం ఆమె తీసుకోక తప్పలేదు. భర్త పనినే అందుకుంది. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించ సాగింది. అయితే మనసులో ఒకే కోరిక. తన భర్తలాగే ఆ ఊళ్లో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు. అందుకే వచ్చిన డబ్బుల్లో కొంతలో కొంత దాచేది. ఓవైపు కూరగాయలు అమ్ముతూనే ఇంకోవైపు ఇళ్లలో పనిచేసింది. కూలికి వెళ్లింది. అలా 20 ఏళ్లు కూడబెట్టిన డబ్బులతో ఒక ఎకరం భూమి కొన్నది. అంతకుముందు ఆమె ప్రయత్నాన్ని చూసి నవ్విన వాళ్లంతా ఆశ్చర్యంతో నొసలు ముడివేశారు. కొడుకులూ అందివచ్చారు. ఆ నేలలో ఒక గదితో క్లినిక్ కట్టాలనే తమ తల్లి నిశ్చయానికి ఊతమిచ్చారు. తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి కొంత చందా తెచ్చారు. అంతా కలిపి ఎట్టకేలకు ఒక గది ఉన్న క్లినిక్‌ను కట్టారు. వీళ్ల సంకల్పానికి ముచ్చటపడ్డ డాక్టర్లు వంతులవారీగా వచ్చి వైద్యసేవలందించడం మొదలుపెట్టారు. కేవలం పది రూపాయల ఫీజుతో. ఆ ఫీజునూ ఈ క్లినిక్‌ను ఇంకా విస్తరించడానికే ఖర్చు చేస్తున్నారు. ఇది సుభాషిణి విజయం!
సమానహక్కు..
ముంబైకి చెందిన సఫీనా హుసేన్.. సమాన హక్కులు సాధించడానికి చదువొక్కటే సాధనం అని నమ్మే వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పట్టాపొందిన సఫీనా 2007లో బాలికల చదువుకోసం ఒక ఎన్‌జీవో ప్రారంభించింది. బేటీ బఢావో కార్యక్రమాన్ని మోదీ కంటే ముందునుంచే ప్రచారం చేయడమే కాదు.. పనీ చేస్తోంది. జీవితమంతా దానికే అంకితం అంటోంది.
వ్యాపార దక్షత..
విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అంటూ ఈ యేడు మహిళా వ్యాపార దక్షతను ప్రోత్సహించడానికి ప్రపంచమంతా నడుం కట్టింది. సాక్షాత్తు అమెరికా ఆడపడచు ఇవాంకా ట్రంప్ దానికి సారథ్యం వహించింది. వేదిక మన దేశమైంది. నిజమే! మహిళకు ముందు స్థానమిస్తే అందరి సంక్షేమాన్నీ ఆమె కాంక్షిస్తుంది. ఆమెకు జెండర్ డిస్క్రిమినేషన్ తెలియదు. ఆలస్యమైనా ఆ ఆలోచన చేసిన జగత్తుకు జేజేలు. అలాంటి దక్షత ఉన్న ఒక సామాన్య స్త్రీ పరిచయం ఇది. ఆమె పేరు కమల్ కుంభార్. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ఆమె ఊరు. తనలాగా పేదరికంలో ఉన్న మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం తన వెరైటీ కోళ్లతో ఒక చిన్న పౌల్ట్రీ ఫామ్‌ను స్థాపించింది ముందు. అది ఇప్పుడు మహారాష్ట్ర అంతటా విస్తరించి ఎంతోమంది ఒంటరి, పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తన పౌల్ట్రీ బిజినెస్ మీద వచ్చిన లాభాలతో ఆమే ఇంకో ఆరు వ్యాపారాలు మొదలుపెట్టి వాటిని లాభాల బాటలో నడిపిస్తోంది. దాదాపు 5వేల మంది మహిళలకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టించి ఎంట్రప్రెన్యూర్‌కి రోల్ మోడల్‌గా నిలిచింది.
కనికాటేక్రివాల్ కూడా ఎంట్రప్రెన్యూరే. అయితే ఆమె ప్రయాణం మరోలా సాగింది. ఆమె పుట్టిపెరిగిందంతా భోపాల్‌లోనే. పదిహేడేళ్లకే ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పార్ట్‌టైమ్ జాబ్‌తో. ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలున్నాయని, అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్‌గా పరిణామం చెందబోతోందని ఆ వయసులోనే గ్రహించింది కనిక. అంతేకాదు, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి మంచి డిమాండ్ ఉందని కూడా తెలుసుకోగలిగింది. ఆ దిశగా అడుగులు వేద్దామనుకునేలోపే అంటే తన 21వయేట క్యాన్సర్ బారిన పడింది. ఒకవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంకోవైపు ఏవియేషన్ ఇండస్ట్రీలో తన పెట్టుబడి ఆలోచనలకు పిల్లర్స్ వేసుకోనారంభించింది. ట్రీట్‌మెంట్ సమయంలో ఆ ఇండస్ట్రీ గురించి అధ్యయనం చేసింది. క్యాన్సర్‌ను జయించింది. ఏవియేషన్ ఇండస్ట్రీలోనూ తన కంపెనీని టేకాఫ్ చేసింది. 2013లో ‘జెట్‌సెట్‌గో’ తో. చార్టెడ్ జెట్స్‌కి ఫస్ట్‌మార్కెట్ ప్లేస్ అదే. ఇప్పుడు ఆమెకు 28 ఏళ్లు. పదహారు ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో కాంట్రాక్ట్ సైన్ చేసి రోజుకు నాలుగు నుంచి 20 విమానాలను రన్‌వే మీద పరిగెత్తిస్తోంది కనిక టేక్రివాల్.
లేడీ టార్జాన్..
జమునా తుడు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని మతుర్ఖమ్ స్వస్థలం. అదంతా అటవీప్రాంతం. స్మగ్లర్ల బెడద చాలా ఎక్కువ. వాళ్లంతా మాఫియాగా మారి అడవిని నాశనం చేస్తూ ఆ ప్రాంత గిరిజనుల బతుకును దుర్భరం చేయసాగారు. వాళ్ల ఆగడాలను అటవీశాఖా ఆపలేకపోయింది. ఒక్క చేవ చూపించింది పదిహేడేళ్ల ఒక సివంగి. ఆమే జమునా. తనతోపాటు 25 మంది మహిళలను కలుపుకొని విల్లంబులు చేత పట్టుకొని అడవిని పహారా కాసే బాధ్యతను తీసుకుంది. 50 హెక్టార్ల ఆ వనం నుంచి మాఫియా ముఠాను తరిమి కొట్టింది. ఇప్పుడు ఆమె సైన్యంలో 60 మంది మహిళలున్నారు. ఆ ప్రాంతమంతా ఆమెను లేడీటార్జాన్ అని పిలుచుకుంటారు గౌరవంగా!
సైంటిస్ట్ అమ్మ
అవసరాలే పరిష్కారాలను కనిపెడ్తాయి. ఈ అమ్మ కథ అలాంటిదే. బెంగళూరుకు చెందిన రాజలక్ష్మి బొర్తాకుర్‌కు ఒక కొడుకు. ఎపిలెప్సీతో బాధపడ్తున్నాడు. ఎప్పుడు బాగుంటాడో.. ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియదు. ఒక్క క్షణం బాబును వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. కనీసం ఫలానా సమయంలో ఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిసినా జాగ్రత్తగా ఉండొచ్చు. బాబు అనారోగ్యంతో ఆమె చాలా నీరసించి పోయింది. విపరీతంగా అలసిపోయింది. నిరాశా నిస్పృహలకు లోనయ్యింది. అసలు ఫిట్స్ ఎప్పుడు వస్తాయో కనిపెట్టే పరికరం ఏమైనా ఉందా అని అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. లేదని తేలి.. తానే ఎందుకు కనిపెట్టకూడదని పరిశోధనా ప్రారంభించింది. మూడేళ్ల ఆ కష్టానికి ఫలితం కనపడింది. ఒక సింపుల్ గ్లోవ్‌ను కనిపెట్టింది. అందులోని సెన్సర్లు ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని హెచ్చరిస్తుంటాయన్నమాట. ఇలా తన కొడుకు కోసం రాజలక్ష్మి కనిపెట్టిన ఈ పరికరం అలాంటి ఎంతోమంది జీవితాలను రక్షిస్తోంది.
ఫైర్ ఫైటర్..
నాగ్‌పూర్‌వాసి హర్షిణీ కన్హేకర్ తొలి మహిళా ఫైర్ ఫైటర్. అదొక కోర్స్ ఉంటుందని కూడా తెలియని ఆమె తన స్నేహితురాలికి సహాయంగా వెళ్లి దాని గురించి తెలుసుకొని ఫైర్ సర్వీస్‌లో సీట్ తెచ్చుకుంది. పెద్ద పెద్ద ఫైర్స్ యాక్సిడెంట్స్‌ను ఒంటిచేత్తో హ్యాండిల్ చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
వెటర్నరీ డాక్టర్..
మహారాష్ట్రకే చెందిన సునీతా కాంబ్లే ఆ ప్రాంతంలోని తొలి మహిళా వెటర్నరీ డాక్టర్. మహాస్వాడ్.. కరువు ప్రాంతం. ప్రధాన జీవనాధారం గొర్రెలు. కాని అక్కడి పరిస్థితుల వల్ల వాటిని కాపాడ్డం చాలా కష్టంగా ఉండింది. అవి బతికితేనే ఆ ఊళ్లకు బతుకు. అప్పుడే అనుకుంది సునీత. పశువుల డాక్టర్.. ప్రత్యేకించి గొర్రెల ఆరోగ్యాన్ని రక్షించే డాక్టర్ కావాలని. కుటుంబం, కమ్యూనిటీ ఆడపిల్లకు చదువేంటి, అందునా అలాంటి చదువేంటి? అని వ్యతిరేకరిస్తున్నా.. వెనక్కి లాగుతున్నా.. వెటర్నరీ డాక్టర్ అయింది. ప్రస్తుతం మహాస్వాడ్‌కి దేవతలా గౌరవాన్నందుకుంటోంది.
ఈ మెచ్చుకోలు మచ్చుకే! స్త్రీ ఇంటిని చక్కదిద్దుతున్నా.. బయట వ్యవహారాలను చక్కబెడుతున్నా.. ఏకాగ్రత, చిత్తశుద్ధి, నిబద్ధత ఆమె అలంకారాలు! సహనం ఆమె ఆయుధం! ఇవన్నీ ఆమె వ్యక్తిత్వంలో ఒదిగిన కలికితురాయిలు!
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment