
మానవా... ప్లీజ్ మానవా!
వాయిదా పద్ధతొద్దు దేనికైనా..!
మగాళ్లు పనుల్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు... మహిళామణులంతా చేసే ఫిర్యాదు ఇది. ‘‘అసలు పనులంటూ చేసేవాడే కదా వాటిని ఇప్పుడో రేపో చేసేది’’ అని మనం ఎదురు ప్రశ్నించగలం. కానీ ప్రశ్నించకపోవడమే మంచిది. ఎందుకంటే... వాయిదా పద్ధతి అంత మంచి కాదు అంటున్నారు నిపుణులు. ‘దాని వల్ల మీ మీద ఆధారపడ్డవాళ్లు అసంతృప్తి చెందవచ్చు. ఎంత వాళ్ల విషయంలో మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించినా, సకాలంలో చేయకుండా వాయిదా వేయడం వలన మిగిలేది అసంతృప్తే’ అంటున్నారు వారు. అందుకే వాయిదా పద్ధతిని వదులుకొమ్మని సూచిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... స్త్రీ మనసును గెలుచుకోవాలనుకునేవారికి వాయిదా అనేదే కూడదట. కోరుకొన్న పనిని కోరుకొన్న వెంటనే చేసిపెడుతుంటే సంతోషపడటమే కాదు... వారికి మన మీద బోలెడంత ప్రేమ పెరుగుతుందట. వృత్తిగత జీవితంలో కూడా... ‘పోస్ట్‌పోన్’ అనే మాటను డిక్షనరీలో పెట్టుకోని వారే కెరీర్‌లో ఉన్నత దశకు చేరే అవకాశం ఉంది. ఇక మధ్య వయసు ఉద్యోగులు పని సరిగా చేయరు అనే అభిప్రాయానికి కూడా ప్రధాన కారణం వారి ‘వాయిదా’ మనస్తత్వమేనట. కాబట్టి... ‘వాయిదా పద్ధతి’ని వాయిదా వేయండిక!