
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మగవాళ్లు సిగ్గుపడుతున్నారు. కేవలం ఏటా పదుల సంఖ్యలో మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదేళ్ల గణాంకాలు గమనిస్తే.. ఈ విషయం స్పష్టవుతోంది. కుటుంబ నియంత్రణ అపరేషన్‌లు చేయించుకుంటే సంసార జీవితానికి ఇబ్బందులు కలుగుతాయనే అపోహలు బలంగా నాటుకున్నట్లు కనిపిస్తోంది. కుటుంబంలో భార్యాభర్తకు సమానభాగం ఉంటుందనే భావిస్తున్న ప్రస్తుత సమాజంలో కుటుంబ నియంత్రణ బాధ్యతను పూర్తిగా ఆడవారిపైనే పెట్టి మగవారు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారికి ట్యూబెక్టమీ, డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) ద్వారా చేస్తారు. మగవారికి మాత్రం వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ఆడవారికి మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుండగా, మగవారు మాత్రం వేసెక్టమీకి ముఖం చాటేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే వ్యవసాయ పనులు చేయడానికి, బరువులు మోయడానికి ఇబ్బందులు కలుగుతాయని, సంసార సుఖానికి ఆటంకం కలుగుతుందన్న అపోహలు బలంగా నాటుకున్నాయి. గ్రామీణ ప్రాంత మగవారిలో ఈ అపోహలు బాగా ఉన్నాయి. వేసెక్టమీ చేయించుకున్న మగవారిలో పట్టణ ప్రాంతం వారే అగ్రభాగం కావడం గమనార్హం.
నిరక్షరాస్యులతోపాటు అక్షరాస్యులు కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. 2013–14 సంవత్సరంలో 22 వేల 50 కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు జిల్లాలో జరిగితే అం దులో కేవలం 53 మంది మా త్రమే వేసెక్టమీ ఆపరేషన్‌లను చేయించుకున్నారు. 2014– 15 సంవత్సరంలో 24 వేల 5 ఆపరేషన్‌లు జరిగితే అందులో 29 మంది మగవారు మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. 2015–16 సంవత్సరంలో 21వేల2 కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు జరిగితే 30 మంది వేసెక్టమీ ఆపరేషన్‌లను చేయించుకున్నారు. 2016–17 సంవత్సరంలో 6226 ఆపరేషన్‌లు జరిగితే 3 మంది మాత్రమే వేసెక్టమీ చేయించుకున్నారు. 2017–18 సంవత్సరంలో ఇప్పటి వరకు 6557 ఆపరేషన్‌లకు గాను అందులో ఒక్క మగవాడు కూడా వేసెక్టమీ ఆపరేషన్‌ను చేయించుకోవడానికి ముందుకురాకపోవడం విశేషం. అన్ని తెలిసి కూడా ఏదో అవుతుందని భావన బలంగా ఉంటోంది. ఇప్పటికైనా మగవాళ్లు మూఢనమ్మకాలను, అపోహలను విడనాడి వ్యాసెక్టమీ ఆపరేషన్‌లను చేయించుకోవడానికి ముందుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిస్తోంది.
సంవత్సరం ఆపరేషన్లు వేసెక్టమీ
2013-14 22050 53
2014-15 24005 29
2015-16 21002 30
2016-17 6226 3
2017-18 6557 0
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
మగవారు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పది, ఇరవై రోజుల తరువాత రోజువారీ పనులను యధావిధిగా చేసుకోవచ్చు. కష్టం, వ్యవసాయ పనులు చేయాలంటే ఇబ్బంది ఉంటుందనే అపోహలను నమ్మవద్దు. సంసార జీవితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. మూఢనమ్మకాలతో వేసెక్టమీ చేయించుకోవడానికి మగవారు ముందుకురాకపోవడం బాధాకరం. ఎలాంటి అపోహలను నమ్మకుండా ముందుకురావాలి. – డాక్టర్ కె.బానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్‌ఓ