vasectomy operation
-
కోతుల కథ.. జనం వ్యథ!
విపరీతంగా సంతతి.. అడవుల్లో పండ్ల చెట్లు తగ్గడం, కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో జనావాసాలపై పడుతున్నాయి. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడ కోతి మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. ఏడాదికోసారి చొప్పున తన జీవితకాలంలో అటూఇటూగా 20–22 పిల్లలను కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాలకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. ఎవరైనా వాటిని అదిలిస్తే.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపులుగా దాడికి పాల్పడుతున్నాయి. ‘హిమాచల్’ప్రయోగం మొదలుపెట్టినా.. ఇంతగా ఇబ్బందిపెడుతున్న కోతులను చంపేందుకు చట్టాలతోపాటు నమ్మకాలు కూడా అడ్డువస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. కోతులను పట్టుకుని ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేసి వదిలేసి.. వాటి సంతతిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. దీనిని స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఇందులో కోతులకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో విరిగిన చేయితో, పక్కనే కర్ర, గులేర్ పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ధనుంజయ్. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్. రోజూ మధ్యాహ్న భోజన సమయంలో కోతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. వంటలు, భోజనం చేసేప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు పొడవాటి కర్రలను పట్టకుని కాపలా ఉండాల్సి వస్తోంది. ఇటీవల అలా వచ్చిన కోతుల గుంపును తరిమేసేందుకు ధనుంజయ్ ప్రయత్నించారు. కానీ అవి ఒక్కసారిగా ఆయనపై దాడికి రావడంతో కిందపడ్డారు. చేయి విరిగింది. ఇప్పటికీ ఇలా భయంభయంగానే పాఠాలు బోధిస్తున్నారు. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు చాతరబోన నర్సవ్వ (70). కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆమె ఈనెల 2న మధ్యాహ్నం ఇంట్లోనే వంట పాత్రలు కడుగుతోంది. అక్కడ పడేసిన అన్నం మెతుకులను చూసిన కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై దాడిచేసింది. ఇష్టారీతిన ముఖం, గొంతు, మెడ, నడుము భాగంలో రక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు మహిళలు భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకలేదు. .. ఇలాంటి ఒకటి రెండు ఘటనలు కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ‘‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేచినప్పటి నుంచే పరేషాన్ చేస్తున్నయ్. బయటికి అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందలకు మందలు తిరుగుతున్నాయ్. ఏమైనా అంటే మీదికి వస్తున్నయ్..’’అనుకుంటూ జనం పరేషాన్ అవుతున్నారు. గుంపుగా మీదపడి రక్కుతుండటంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల దాడులపై అంతంత మాత్రమైనా స్పందిస్తున్న ప్రభుత్వం.. కోతుల బాధను మాత్రం అసలే పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. ఊరిపైకి కోతులదండు వచ్చిందని తెలిస్తే.. పనులు మానుకొని మరీ, ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తేగానే చర్యలు.. మంకీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒక పశువైద్యాధికారి, ఒక అసిస్టెంట్‌తోపాటు నలుగురు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ కేంద్రానికి తీసుకువచ్చిన కోతులకు వారు ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఇక్కడికి కోతులను తీసుకురావడం దగ్గరే సమస్య నెలకొంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కోతులను పట్టుకుని ఇక్కడి తీసుకువచ్చే బాధ్యతను స్థానిక సంస్థలకే అప్పజెప్పింది. మొదట్లో కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అలా కోతులను తెచ్చాయి. అయితే కోతులను పట్టుకోవడం, వాటిని అంతదూరం తరలించడం ఇబ్బందిగా మారిందంటూ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీనితో ఇప్పటివరకు 1,176 కోతులకు మాత్రమే ఆపరేషన్లు చేయడం గమనార్హం. కోతుల బెడద నివారణలో ఎంతోకొంత ఫలితమిచ్చే ఈ అంశాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో ఒక్కటే పెట్టి వదిలేశారు. ఇక కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల చెట్లతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పెద్దగా చర్యలు లేవని జనం వాపోతున్నారు. కోతులను తేవాలన్నా.. స్పందన తక్కువగానే.. మా కేంద్రానికి తెచ్చిన కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 528 ఆడ కోతులకు ఆపరేషన్ చేశాం. అవి మరో పదేళ్ల వరకు పిల్లలు కనే వయసు ఉన్నవే. అంటే దాదాపు 5,280 కోతులు పుట్టకుండా చేయగలిగాం. గ్రామాల్లో కోతులను పట్టి తీసుకురావాలని సూచిస్తూనే ఉన్నాం. కానీ స్పందన తక్కువగానే ఉంటోంది. – డాక్టర్ శ్రీకర్రాజు, మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ -
కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక రాష్ట్రంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మరణాలకు కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమిక అంచనాకు రాలేమని తెలిపారు. కు.ని ఆపరేషన్లు కేవలం ఆడవారికే పరిమితమతున్నాయని, దీనివల్ల మహిళలకు ఇబ్బంది ఆవుతోందని తెలిపారు. తెలంగాణలో జరిగే కు. ని ఆపరేషన్లలో మగవారి శాతం కేవలం మూడేనేనని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్ ట్యూబెక్టమీ అంటే మహిళలకు లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు. మహిళలకు రిస్క్.. అయితే, కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ పురుషులకు చేసే వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పోల్చితే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కు.ని కోసం ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. మరోవైపు పురుషుల కంటే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. పురుషులు దూరంగా.. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదని.. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే? ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయినా కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా ఆపరేషన్లు విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం గమనార్హం. -
వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): వెసక్టమీ.. ఈ పేరు వింటేనే మగవారు పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్లకు వెనకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెసక్టమీ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. వెసక్టమీకి తాము దూరమంటూ.. భారం బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లుగా కొందరు ప్రదర్శిస్తున్న ధోరణి ఈ లెక్కలకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నాలుగున్నరేళ్లులో కేవలం 559 మంది పురుషులు మాత్రమే వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. చదవండి: స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..! సింగిల్ డిజిట్‌కే పరిమితం.. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంలో మగవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవారు. క్రమేణా వారిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత మహిళలదే అన్న భావనలో ఉంటున్నారు. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ లక్ష్యాలు వేలల్లో ఉంటే అమలు సింగిల్ డిజిట్లు దాటడం లేదు. ప్రస్తుత సమాజంలో దాదాపుగా విద్యావంతులు అన్నింట్లో అవగాహన కలిగిఉన్నప్పటికీ.. వెసక్టమీ వంటి ఆపరేషన్ల విషయంలో ముందుకు రావడం లేదు. పైగా ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చలకు ఆస్కారమివ్వడం లేదు. ఎక్కడో భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటేనే కొందరు భర్తలు వెసక్టమీలకు అంగీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అపోహలే కారణమా.. వెసక్టమీ చేయించుకుంటే పురుషుల శక్తిహీనులవుతారని, పనులు సమర్ధంగా చేయలేరన్న అపోహ చాలా మందిలో ఉంది. ♦భర్త కంటే తామే శస్త్రచికిత్సలు చేయించుకుంటామంటున్న మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ♦ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. ♦అపోహలు తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా...ఫలితం మాత్రం కనబడడం లేదు. ♦మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదే అని వైద్యులు చెబుతున్నారు. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని అంటున్నారు. ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లుగా ఈ శస్త్రచికిత్సల లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా 2022–23 (జూన్ నాటికి)లో వెసక్టమీ సర్జరీలు 654, ట్యుబెక్టమీ సర్జరీలు 12,430 వరకు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత జూన్ నెలాఖరు నాటికి కేవలం ఆరు వెసక్టమీ, 840 ట్యుబెక్టమీ సర్జరీలు నమోదయ్యాయి. లక్ష్య శాతాలను పరిగణనలోకి తీసుకుంటే 3.67 శాతం వెసక్టమీ, 27.03 శాతం ట్యుబెక్టమీ లక్ష్యాలను మాత్రమే సాధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. కుటుంబ నియంత్రణకు వీలుగా పురుషులకు వెసక్టమీ, మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ఎప్పటికప్పుడు అవగాహన కలి్పస్తున్నాం. అయినప్పటికీ అపోహలతో పురుషులు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాధించిన లక్ష్య శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అపోహలు లేకుండా వెసక్టమీకి పురుషులు సిద్ధం కావాలి. అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. చాలా మంది వైద్యులు ఈ సర్జరీలపై దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. – డాక్టర్ బి.మీనాక్షి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి -
అన్నింటా తామేనంటూ.. అందనంత దూరంగా..
సాక్షి, గుంటూరు: దేనికైనా సరే.. మేము రెడీ అనే మగాళ్లు కుటుంబ నియంత్రణ కోసం చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు మాత్రం దూరం... దూరం అంటున్నారు. అన్నింటా తామేనంటూ ఆధిపత్యం చాటుకునే మగ మహారాజులు కు.ని. ఆపరేషన్ దగ్గరికి వచ్చే సరికి ‘వేసెక్టమా.. వామ్మో’ అంటూ తప్పించుకుంటున్నారు. జనాభా నియంత్రణలో కీలకంగా ఉండే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. శస్త్రచికిత్సల కోసం పురుషులకు ఎంతో సులువైన పద్ధతులు వచ్చినా వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో జరిగిన ఆపరేషన్ల గణాంకాలే అందుకు నిదర్శనం. జిల్లాలో ఐదేళ్లలో 1,23,907 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో మహిళలు 1,23,713 మంది ఆపరేషన్లు చేయించుకోగా పురుషులు కేవలం 194 మంది మాత్రమే కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఏడాది మొత్తంలో ఆపరేషన్లు చేయించుకుంటున్న పురుషులు కనీసం 50 మంది కూడా ఉండటం లేదు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వేసెక్టమీ ఆపరేషన్ల విషయంలో మగవారికి అవగాహన కల్పించే విషయంలో అధికార యంత్రాంగం సరైన చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. సిజేరియన్తో కలిపి చేస్తున్నారు.. నేడు చాలా మంది సంతానం విషయంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. కాన్పు కోసం వెళ్లిన సమయంలో ఇక పిల్లలు వద్దను కోగానే సిజేరియన్ చేసి దాంతో పాటుగా కు.ని. ఆపరేషన్ చేస్తున్నారు. ఎక్కువ మంది వైద్యులు సాధారణ కాన్పుల కోసం వేచి చూడకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తుండటంతో పనిలో పనిగా ఆడవారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కొంత మంది సాధారణ కాన్పు జరిగినా కూడా మహిళలనే కు.ని. ఆపరేషన్లు చేయించుకోమని చెబుతున్నారే తప్పా పురుషులు చేయించుకోవడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు. ఆడవారి పని అనే ధోరణి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారే చేయించుకోవాలనే భావన నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతోంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సంపాదనలో మగవారితో పోటీ పడుతున్నారు. ఇంటి ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తున్నారు. అక్కడ మహిళను గొప్పగా చూసే మగవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల దగ్గరికి వచ్చే సరికి అది వాళ్ల బాధ్యతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మగవారికి చేసే శస్త్రచికిత్సలు సులువుగా ఉంటాయని తెలిసినా ఎవరూ ముందుకు రావడం లేదని వైద్యులు అంటున్నారు. చదువుకున్న పురుషులు సైతం వేసెక్టమీ శస్త్రచికిత్స కోసం ఆసక్తి చూపించడం లేదు. మగవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే రకరకాల సమస్యలు వస్తాయనే మూఢత్వం ఇంకా జనాల్లో పేరుకుపోయి ఉంది. ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభం కుటుంబ నియంత్రణ కోసం మహిళలు చేయించుకునే ట్యూబెక్టమీ శస్త్రచికిత్స కంటే పురుషులు చేయించుకునే వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులువుగా చేయవచ్చు. కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ చేస్తారు. కు.ని. శస్త్రచికిత్స చేయించుకునే పురుషులు కేవలం ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవాలి. స్త్రీలు ఆపరేషన్ చేయించుకుంటే వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి. పురుషులు వారం రోజులు బరువులు ఎత్తకూడదు. వారం రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎలాంటి భయాలు లేకుండా పురుషులు వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం కు.ని. ఆపరేషన్ చేయించుకునే స్త్రీలకు రూ.600లు, పురుషులకు రూ. 1,100 పారితోషికంగా ఇస్తోంది. – డాక్టర్ మండవ శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ -
కు.ని. ఆ‘పరేషాన్’ మాకొద్దు..!
గత పదిహేను రోజుల క్రితం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఇక్కడ ఒక్క పురు షుడు కూడా ఆపరేషన్ కోసం కనీసం పేరు నమోదు చేసుకోలేదు. ఇక్కడ 24 ఆపరేషన్లు జరగగా అందులో ఒక్క వేసెక్టమీ ఆపరేషన్ జరగలేదు. సాక్షి, ఆసిఫాబాద్‌క్రైం: జిల్లాలో గతేడాది 1,793 ఆపరేషన్లు జరగగా అందులో కేవలం 17 మంది మగవాళ్లు మాత్రమే ఆపరేషన్ కోసం ముందుకొచ్చారు. మిగతా మహిళలకు అటు ప్రసవ వేదనతోపాటు ఈ కు.ని ‘కోతలు’ తప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పురుషులకు చేసే ఆపరేషన్‌ను వేసెక్టమీ, మహిళలకు చేసే ఆపరేషన్‌ను ట్యూబెక్టమీ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో రెండు మూడు కాన్పులు వరుసగా సిజేరియిన్ అయి, తిరిగి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ద్వారా పొట్టను నాలుగు, అయిదు అంగుళాలు మేర కోతకోయడంతో భవిష్యత్‌లో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవగాహన లేకే వెనుకడుగు గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే అది ఆడవాళ్లకు సంబంధించినదిగా భావించడం. దీనిని అధిగమించేందుకు వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండే ఆశ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటా విస్త్రృత ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా అలాంటి కార్యక్రమాలేవి లేకపోవడంతో ప్రసవ సమయంలోనే చాలా మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మగవారిలో చాలా మందికి వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా శారీరకంగా బలహీన మవుతామనే అపోహాతో పురుషులు ఈ ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆపరేషన్లు చేసుకుంటే శారీరక శ్రమ చేయలేమనే భావనతో మగవాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. స్త్రీల కంటే పురుషులకే సులభం మహిళల కంటే పురుషులకే కు.ని. ఆపరేషన్ ఎంతో సులువుగా ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. మగవాళ్లకు చేసే కు.ని.ఆపరేషన్‌లో గతంలో కోత విధానం ఉండేది. కాని ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఇందుకోసం ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయి. సాధారణ ఇంజక్షన్ వేసుకున్న తరహాలో ఆపరేషన్లు అయిపోతున్నాయి. రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే వేసెక్టమీ పూర్తవుతుంది. గంటలోపే డిశ్చార్జీ కావచ్చు. మూడు నెలల తర్వాత నిత్యం జీవితంలో చేసే అన్ని పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా లేనిపోని అపోహాలతో పురుషులు కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా మహిళలకు కోతలు తప్పడం లేదు. దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు సంఖ్య పెరిగేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తన సర్వీసులో ఒక్క వాసెక్టమీ ఆపరేషన్ చేయలేదని ఓ సీనియర్ వైద్యుడు చెప్పడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వేసెక్టమీ ఆపరేషన్లు పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత మేరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందుబాటులో లేని సర్జన్ జిల్లాలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయాలంటే గైనకాలజీ డాక్టర్ ఎవరైనా చేయొచ్చు. అదే మగవారికి వాసెక్టమీ ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక వేసెక్టమీ సర్జన్ అవసరం. అయితే జిల్లాలో కనీసం ఒక్క సర్జన్ కూడా లేకపోవడంతో ఈ ఆపరేషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 1,793 కుటుంబం నియంత్రణ ఆపరేషన్లు జరగగా అందులో 99 శాతం మహిళలే ఉన్నట్లు జిల్లా వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు వెనుకడుగు వేస్తున్న మాట వాస్తవమే. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. ఇందుకోసం వైద్య సిబ్బందితో వాసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు చేసే నిపుణుడు లేకపోవడం సమస్యగా మారింది. – డాక్టర్ సుబ్బారాయుడు,డీఎంహెచ్‌వో -
ఆ ఆపరేషన్లు వద్దంటున్న మగరాయుళ్లు!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మగవాళ్లు సిగ్గుపడుతున్నారు. కేవలం ఏటా పదుల సంఖ్యలో మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదేళ్ల గణాంకాలు గమనిస్తే.. ఈ విషయం స్పష్టవుతోంది. కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేయించుకుంటే సంసార జీవితానికి ఇబ్బందులు కలుగుతాయనే అపోహలు బలంగా నాటుకున్నట్లు కనిపిస్తోంది. కుటుంబంలో భార్యాభర్తకు సమానభాగం ఉంటుందనే భావిస్తున్న ప్రస్తుత సమాజంలో కుటుంబ నియంత్రణ బాధ్యతను పూర్తిగా ఆడవారిపైనే పెట్టి మగవారు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారికి ట్యూబెక్టమీ, డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) ద్వారా చేస్తారు. మగవారికి మాత్రం వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ఆడవారికి మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుండగా, మగవారు మాత్రం వేసెక్టమీకి ముఖం చాటేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే వ్యవసాయ పనులు చేయడానికి, బరువులు మోయడానికి ఇబ్బందులు కలుగుతాయని, సంసార సుఖానికి ఆటంకం కలుగుతుందన్న అపోహలు బలంగా నాటుకున్నాయి. గ్రామీణ ప్రాంత మగవారిలో ఈ అపోహలు బాగా ఉన్నాయి. వేసెక్టమీ చేయించుకున్న మగవారిలో పట్టణ ప్రాంతం వారే అగ్రభాగం కావడం గమనార్హం. నిరక్షరాస్యులతోపాటు అక్షరాస్యులు కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. 2013–14 సంవత్సరంలో 22 వేల 50 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జిల్లాలో జరిగితే అం దులో కేవలం 53 మంది మా త్రమే వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకున్నారు. 2014– 15 సంవత్సరంలో 24 వేల 5 ఆపరేషన్లు జరిగితే అందులో 29 మంది మగవారు మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. 2015–16 సంవత్సరంలో 21వేల2 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగితే 30 మంది వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకున్నారు. 2016–17 సంవత్సరంలో 6226 ఆపరేషన్లు జరిగితే 3 మంది మాత్రమే వేసెక్టమీ చేయించుకున్నారు. 2017–18 సంవత్సరంలో ఇప్పటి వరకు 6557 ఆపరేషన్లకు గాను అందులో ఒక్క మగవాడు కూడా వేసెక్టమీ ఆపరేషన్‌ను చేయించుకోవడానికి ముందుకురాకపోవడం విశేషం. అన్ని తెలిసి కూడా ఏదో అవుతుందని భావన బలంగా ఉంటోంది. ఇప్పటికైనా మగవాళ్లు మూఢనమ్మకాలను, అపోహలను విడనాడి వ్యాసెక్టమీ ఆపరేషన్లను చేయించుకోవడానికి ముందుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిస్తోంది. సంవత్సరం ఆపరేషన్లు వేసెక్టమీ 2013-14 22050 53 2014-15 24005 29 2015-16 21002 30 2016-17 6226 3 2017-18 6557 0 ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మగవారు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పది, ఇరవై రోజుల తరువాత రోజువారీ పనులను యధావిధిగా చేసుకోవచ్చు. కష్టం, వ్యవసాయ పనులు చేయాలంటే ఇబ్బంది ఉంటుందనే అపోహలను నమ్మవద్దు. సంసార జీవితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. మూఢనమ్మకాలతో వేసెక్టమీ చేయించుకోవడానికి మగవారు ముందుకురాకపోవడం బాధాకరం. ఎలాంటి అపోహలను నమ్మకుండా ముందుకురావాలి. – డాక్టర్ కె.బానుప్రసాద్నాయక్, డీఎంహెచ్ఓ -
మగతనం తగ్గుతుందన్న అపోహ
రాజాం:కుటుంబ రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాల్లాంటివారు. రెండూ సమానంగా నడిస్తేనే రథం సజావుగా సాగుతుంది. కష్టసుఖాలు, బాధ్యతల బరువుల్లోనూ సమాన వాటా పొందాల్సి ఉంది. కానీ కుటుంబ పెద్దలుగా ఉంటున్న మగరాయుళ్లు కుటుంబ నియంత్రణలో మాత్రం తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దాన్ని పూర్తిగా మహిళల నెత్తిన రుద్దుతున్నారు. మహిళలు కూడా ఈ విషయంలో మగాళ్లను వెనకేసుకు వస్తుండటం మరీ విడ్డూరం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను మహిళలు(ట్యూబెక్టమీ), పురుషులు(వేసక్టమీ) కూడా చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో పురుషులు పూర్తిగా వెనుకబడ్డారు. గత ఏడాది జిల్లాలోని 75 పీహెచ్‌సీల పరిధిలో 18,600 కు.ని. ఆపరేషన్లు నిర్వహించగా వీటిలో వేసక్టమీ ఆపరేషన్లు 304 మాత్రమే. అలాగే ఈ ఏడాది లక్ష్యం 19 వేలు ఆపరేషన్లు కాగా ఇప్పటివరకు 6 వేల ఆపరేషన్లు జరిగాయి. వీటిలో 106 మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి. మగతనం తగ్గుతుందన్న అపోహ వేసక్టమి ఆపరేషన్ చేయించుకుంటే మగతనం తగ్గుతుందన్న అపోహ చాలా మందిని వేధిస్తోంది. గ్రామాల్లో నిరక్షరాస్యత కారణంగా వేసక్టమీ అంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఆపరేషన్ వల్ల మగతనానికి ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు ఎంతగా చెబుతున్నా పురుషులు ముందుకు రావడంలేదు. మహిళలు కూడా ఒప్పుకోవడం లేదు...! మగవారు కు.ని. ఆపరేషన్ చే యించుకునేందుకు వారి భార్యలు కూడా ఒప్పుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. తాము వంద కేసులను వైద్య శిబిరానికి తీసుకొస్తే చివరకు ఆపరేషన్ చేయించుకునే మగవారు వారు కేవలం ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మిగలడం లేదంటున్నారు. పురుషులు చేయించుకుంటేనే మంచిది ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గీతాంజలి మాట్లాడుతూ కు.ని. ఆపరేషన్లు మహిళలు క ంటే పురుషులు చేయించుకోవడమే మంచిదన్నారు. వేసక్టమీ చేయించుకుంటే మగతనానికి ఇబ్బంది, పని చేసుకోవడం ఇబ్బంది అన్నది అపోహేనన్నారు. ఎంత చైతన్యపరిచినా ముందుకు రాకపోవడం సరికాదన్నారు. ఆపరేషన్ చేయించుకున్న గంట తర్వాత యథావిధిగా ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు. మరుసటి రోజు నుంచి తేలికపాటి పనులు, వారం తర్వాత యథావిధిగా పనులు చేసుకోవచ్చని సూచించారు.