విపరీతంగా సంతతి..
అడవుల్లో పండ్ల చెట్లు తగ్గడం, కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో జనావాసాలపై పడుతున్నాయి. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడ కోతి మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. ఏడాదికోసారి చొప్పున తన జీవితకాలంలో అటూఇటూగా 20–22 పిల్లలను కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది.
ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాలకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. ఎవరైనా వాటిని అదిలిస్తే.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపులుగా దాడికి పాల్పడుతున్నాయి.
‘హిమాచల్’ప్రయోగం మొదలుపెట్టినా..
ఇంతగా ఇబ్బందిపెడుతున్న కోతులను చంపేందుకు చట్టాలతోపాటు నమ్మకాలు కూడా అడ్డువస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది.
కోతులను పట్టుకుని ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేసి వదిలేసి.. వాటి సంతతిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. దీనిని స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవనంలో 2020 డిసెంబర్‌లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఇందులో కోతులకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు.
ఈ చిత్రంలో విరిగిన చేయితో, పక్కనే కర్ర, గులేర్ పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ధనుంజయ్. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్. రోజూ మధ్యాహ్న భోజన సమయంలో కోతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి.
వంటలు, భోజనం చేసేప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు పొడవాటి కర్రలను పట్టకుని కాపలా ఉండాల్సి వస్తోంది. ఇటీవల అలా వచ్చిన కోతుల గుంపును తరిమేసేందుకు ధనుంజయ్ ప్రయత్నించారు. కానీ అవి ఒక్కసారిగా ఆయనపై దాడికి రావడంతో కిందపడ్డారు. చేయి విరిగింది. ఇప్పటికీ ఇలా భయంభయంగానే పాఠాలు బోధిస్తున్నారు.
ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు చాతరబోన నర్సవ్వ (70). కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆమె ఈనెల 2న మధ్యాహ్నం ఇంట్లోనే వంట పాత్రలు కడుగుతోంది. అక్కడ పడేసిన అన్నం మెతుకులను చూసిన కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై దాడిచేసింది.
ఇష్టారీతిన ముఖం, గొంతు, మెడ, నడుము భాగంలో రక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు మహిళలు భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకలేదు.
.. ఇలాంటి ఒకటి రెండు ఘటనలు కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ‘‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేచినప్పటి నుంచే పరేషాన్ చేస్తున్నయ్. బయటికి అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందలకు మందలు తిరుగుతున్నాయ్. ఏమైనా అంటే మీదికి వస్తున్నయ్..’’అనుకుంటూ జనం పరేషాన్ అవుతున్నారు.
గుంపుగా మీదపడి రక్కుతుండటంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల దాడులపై అంతంత మాత్రమైనా స్పందిస్తున్న ప్రభుత్వం.. కోతుల బాధను మాత్రం అసలే పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. ఊరిపైకి కోతులదండు వచ్చిందని తెలిస్తే.. పనులు మానుకొని మరీ, ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
నామ్‌కే వాస్తేగానే చర్యలు..
మంకీ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఒక పశువైద్యాధికారి, ఒక అసిస్టెంట్‌తోపాటు నలుగురు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ కేంద్రానికి తీసుకువచ్చిన కోతులకు వారు ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఇక్కడికి కోతులను తీసుకురావడం దగ్గరే సమస్య నెలకొంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కోతులను పట్టుకుని ఇక్కడి తీసుకువచ్చే బాధ్యతను స్థానిక సంస్థలకే అప్పజెప్పింది.
మొదట్లో కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అలా కోతులను తెచ్చాయి. అయితే కోతులను పట్టుకోవడం, వాటిని అంతదూరం తరలించడం ఇబ్బందిగా మారిందంటూ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీనితో ఇప్పటివరకు 1,176 కోతులకు మాత్రమే ఆపరేషన్లు చేయడం గమనార్హం. కోతుల బెడద నివారణలో ఎంతోకొంత ఫలితమిచ్చే ఈ అంశాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో ఒక్కటే పెట్టి వదిలేశారు.
ఇక కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల చెట్లతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పెద్దగా చర్యలు లేవని జనం వాపోతున్నారు.
కోతులను తేవాలన్నా.. స్పందన తక్కువగానే..
మా కేంద్రానికి తెచ్చిన కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 528 ఆడ కోతులకు ఆపరేషన్ చేశాం. అవి మరో పదేళ్ల వరకు పిల్లలు కనే వయసు ఉన్నవే. అంటే దాదాపు 5,280 కోతులు పుట్టకుండా చేయగలిగాం. గ్రామాల్లో కోతులను పట్టి తీసుకురావాలని సూచిస్తూనే ఉన్నాం. కానీ స్పందన తక్కువగానే ఉంటోంది. – డాక్టర్ శ్రీకర్‌రాజు, మంకీ రిహాబిలిటేషన్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment