
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడులు(Terrorist attacks) (26/11) భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఘటనలలో ప్రధానమైనవిగా నిలుస్తాయి. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. లష్కర్-ఏ-తోయిబా అనే పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది.
నారిమన్ హౌస్ సమీపంలోని..
ఈ దాడుల లక్ష్యాలలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్(Chhatrapati Shivaji Terminus) (సీఎస్‌టీ), నారిమన్ హౌస్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఎన్‌డీటీవీ పేర్కొన్న ఒక కథనం ప్రకారం ముంబైలోని జల వాయు విహార్ పేరిట ఉన్న సైనిక కాలనీ కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతం ముంబైలోని కోలాబాలో ఉంది. ఇక్కడ నావికా దళ సిబ్బంది, వారి కుటుంబాలు ఉంటాయి. ఈ ప్రాంతం దాడి జరిగిన నారిమన్ హౌస్(Nariman House) సమీపంలో ఉంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే ఉగ్రవాది ఈ దాడులకు ముందు అత్యంత రహస్యంగా ముంబైలో వారి లక్ష్యాలను పరిశీలించాడు. హెడ్లీ బృందం జల వాయు విహార్‌ను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాలనీలో సైనిక అధికారులు ఉండటం వల్ల దీనిపై ఉగ్రవాదులు దాడులు చేయాలనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో వారి ప్రణాళికలు మారి, ఇతర ప్రదేశాలలో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో తహవ్వుర్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆ కథనం బెబుతోంది.
డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు
తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు. తొలుత పాకిస్తాన్ సైన్యంలో వైద్యునిగా పనిచేసిన రాణా ఆ తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. అక్కడ అతను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ సెంటర్‌ను నడిపాడు. రాణా.. డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు. ఈ దాడుల్లో కీలక సహాయకునిగా వ్యవహరించాడు. హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ, అతను పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది. రాణా ఈ దాడులకు సంబంధించిన లాజిస్టిక్ సహాయం అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాణా స్వమంగా హెడ్లీకి ఆర్థిక సహాయం, ప్రయాణ ఏర్పాట్లు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరోపిస్తోంది.
భారత న్యాయస్థానం ముందుకు..
తహవ్వుర్ రాణా లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలో పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో అమెరికాలోని చికాగోలో రాణాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. అతనిపై ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణలతో పాటు, డెన్మార్క్‌లోని ఒక వార్తాపత్రికపై దాడికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. 2011లో అమెరికన్ కోర్టు(American court) రాణాను లష్కర్-ఏ-తోయిబాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. కానీ ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భారత్ రాణాను ఈ దాడుల్లో భాగస్వామిగా గుర్తించింది. 2025 ఏప్రిల్‌లో రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. దీంతో తహవ్వుర్ రాణా ఇప్పుడు భారత న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోనున్నాడు.
ఇది కూడా చదవండి: వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?