
కోల్‌కతా: వక్ఫ్ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు మృతిచెందగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో రెండ్రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.
కాగా, మాజీ టీమిండియా క్రికెటర్, టీఎంసీ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటైన బహరంపూర్ నుండి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా మరికొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
బెంగాల్ దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ యూసుఫ్ పఠాన్ Instagram వేదికగా తన ఫొటోలను షేర్ చేశారు. ఆయన కాఫీ తాగుతున్న ఫొటో ఒకటి కాగా.. దర్జాగా, ఉల్లాసంగా ఉన్న మరో ఫొటోను షేర్ చేశారు. దీంతో, ఎంపీ యూసుఫ్ పఠాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం, పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారి ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘బెంగాల్ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉండగా.. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు! ఇంతలో యూసుఫ్ పఠాన్.. ఒక ఎంపీగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్ కాంగ్రెస్ అంటే అని’ ఘాటు విమర్శలు చేశారు. యూసుఫ్ పోస్టుపై అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటనలపై కలకత్తా హైకోర్టులో శాసనసభ విపక్షనేత సువేందు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. శనివారం సెలవైనా అత్యవసర విచారణ జరపడానికి జస్టిస్ సౌమెన్ సేన్ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించారు. ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ ధర్మాసనం ఆదేశించింది. పరిణామాలపై తాము కళ్లు మూసుకోలేమని జస్టిస్ సౌమెన్ సేన్ వ్యాఖ్యానించారు. వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
Bengal is burning
HC has said it can’t keep eyes closed and deployed centra forces
Mamata Banerjee is encouraging such state protected violence as Police stays silent!
Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered…
This is TMC pic.twitter.com/P1Yr7MYjAM— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025