
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందినవారే. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 28 అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులను వారి అఫిడవిట్ల ఆధారంగా సంస్థ అధ్యయనం చేసింది. వారి మొత్తం ఆస్తులు మూడు చిన్న రాష్ట్రాల వార్షికబడ్జెట్‌ను మించిపోవడం విశేషం.
ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. కర్నాటకలో మొత్తం 223 మంది ఎమ్మెల్యేలకు కలిపి రూ.14,179 కోట్ల ఆస్తులుండగా మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యే లదగ్గర రూ.12,424 కోట్ల సంపద ఉంది.
మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించి...
4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.73,348 కోట్లు. ఇది 2023–24లో మేఘాలయ (రూ.22,022 కోట్లు), నాగాలాండ్ (రూ.23,086 కోట్లు), త్రిపుర (రూ.26,892 కోట్లు) రాష్ట్రాల ఉమ్మడి వార్షిక బడ్జెట్ల కంటే ఎక్కువ. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు అత్యధిక ఆస్తులున్నాయి. ఆ పార్టీకి చెందిన 1,653 మంది రూ. 26,270 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.17,357 కోట్ల సంపద ఉంది. 134 టీడీపీ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.9,108 కోట్లు. 59 మంది శివసేన ఎమ్మెల్యేల వద్ద రూ.1,758 కోట్లున్నాయి.
నిరుపేద ఎమ్మెల్యే నిర్మల్ కుమార్
పశ్చిమబెంగాల్‌లోని ఇండస్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1,700 మాత్రమే. అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలున్న రాష్ట్రాలుగా త్రిపుర, మణిపూర్, పుదుచ్చేరి నిలిచాయి. 60 మంది త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ.90 కోట్లు. మణిపూర్‌లోని 59 మంది ఎమ్మెల్యేలకు రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలకు రూ.297 కోట్ల ఆస్తులున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment