‘ఉన్నావ్‌, హత్రాస్‌ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’ | | Sakshi
Sakshi News home page

ఆ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?.. అసెంబ్లీలో బీజేపీని నిలదీసిన మమతా బెనర్జీ

Published Tue, Sep 3 2024 3:31 PM | Last Updated on Tue, Sep 3 2024 4:07 PM

Mamata Banerjee slams on BJP over Unnao, Hathras incident in assembly

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై బెంగాల్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. 

ఆర్జీకర్‌ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్‌, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. 

ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వ హాస్పిటల్‌ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. 

అదేవిధంగా బెంగాల్‌లోని నార్త్‌ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్‌, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని  బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.

వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్‌లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్‌ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement